BCCIకి సుప్రీం కోర్టు నోటీసులు.. క్రీడా చట్టం పరిధిపై ముదిరిన వివాదం!

భారత క్రికెట్ నియంత్రణ మాల్ (BCCI) మరియు అన్ని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ పరిధిలోకి మీరు ఎందుకు రాకూడదో చెప్పాలని స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ సంచలన ఆదేశాలను జారీ చేసింది.

సుదీర్ఘకాలంగా నడుస్తున్న BCCI వివాదాల పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ప్రశ్నలను లేవనెత్తింది. బోర్డుతో పాటు రాష్ట్ర అసోసియేషన్ల భవిష్యత్తు నియమావళిపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో క్రీడా వర్గాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

గతంలోనే జస్టిస్ ఆర్.ఎం. లోధా కమిటీ సిఫార్సులను అంగీకరించిన సుప్రీం కోర్టు, క్రికెట్ బోర్డులో పలు సంస్కరణలను అమలు చేసింది. ఇదిలా ఉండగా 2022 సెప్టెంబరులో బోర్డు నిర్వాహకుల పదవీ కాలాన్ని వరుసగా 12 ఏళ్ల పాటు కొనసాగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్ర అసోసియేషన్‌లో ఆరేళ్లు, BCCIలో ఆరేళ్లు పనిచేసిన తర్వాతే మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్ వర్తించేలా మార్పులు చేశారు.

ఇప్పుడు కొత్తగా అమలులోకి వచ్చిన క్రీడా చట్టం బోర్డు నిర్వాహకుల సర్వీసు నిబంధనలకు వర్తిస్తుందో లేదో స్పష్టం చేయాలని న్యాయమూర్తులు కోరారు. ఈ నేపథ్యంలో తమ న్యాయవాదుల ద్వారా స్పష్టమైన సూచనలు తీసుకోవాలని క్రికెట్ అసోసియేషన్లకు ధర్మాసనం సూచించింది.

ఒకవేళ BCCI మరియు రాష్ట్ర అసోసియేషన్లు ఈ కొత్త చట్టం పరిధిలోకి వస్తే, వివాదాల పరిష్కారానికి ప్రత్యేక క్రీడా ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది. ఫలితంగా ఇప్పటివరకు లోధా కమిటీ సూచించిన రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న బోర్డు వ్యవహారాలు, ఇకపై ప్రభుత్వ చట్టబద్ధమైన క్రీడా విధానం పరిధిలోకి మారే అవకాశం ఉంది.

Leave a comment