రివ్యూ : విశ్వనాథ్ అండ్ సన్స్

విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా రివ్యూ. సూర్య, మమిత బైజు నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎలా ఉందో ఇక్కడ చదవండి. పూర్తి వివరాలు.

సినిమా పేరు & తారాగణం సినిమా పేరు: విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons) తారాగణం: సూర్య, మమిత బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టండన్ తదితరులు దర్శకత్వం: వెంకీ అట్లూరి సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి ఎడిటింగ్: నవీన్ నూలి నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కథ : సినిమా కథలోకి వెళితే, సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒక అత్యంత ధనవంతుడైన ఇండస్ట్రియలిస్ట్. అంతేకాదు, గతంలో ఓ ఒలింపిక్స్ పోటీలో గన్ సరిగ్గా పని చేయక తన కెరీర్ మలుపు తిరిగిన నేపథ్యం ఉన్న మాజీ షార్ప్‌షూటర్. ఇప్పుడు అతను ఒక కార్పొరేట్ ప్రపంచంలో క్రైసిస్ హ్యాండ్లర్‌గా వ్యవహరిస్తూ ఉంటాడు. జీవితంలో అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ, పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. అయితే తన తల్లి కోరిక మేరకు, ఒక బిడ్డకు తండ్రి కావాలని అతను సరోగసి మార్గాన్ని ఎంచుకుంటాడు. ఈ ప్రయాణంలో అనుకోకుండా అతని జీవితంలోకి మ్యాడీ (మమిత బైజు) ప్రవేశిస్తుంది. మొదట ఒక సాధారణ పరిచయంగా మొదలైన వీరిద్దరి బంధం క్రమంగా ప్రేమగా మారుతుంది. సంజయ్ తన తల్లి కోరికను ఎలా నెరవేర్చాడు? సరోగసి ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? విదేశాల నుంచి వచ్చిన మ్యాడీని సంజయ్ తన జీవిత భాగస్వామిగా అంగీకరించాడా? ఈ ప్రయాణంలో కుటుంబం ఎదుర్కొన్న భావోద్వేగాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్ర కథాంశం. విశ్లేషణ: డైరెక్టర్ వెంకీ అట్లూరి ఎప్పుడూ కూడా కాంటెంపరరీ అర్బన్ ఫ్యామిలీ డ్రామాలను చాలా స్టైలిష్‌గా తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటారు. ఈ చిత్రంలో కూడా ఆయన అదే ఫార్ములాను నమ్ముకుని, ఒక సున్నితమైన పాయింట్‌ను ఎంచుకుని కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమా ప్రారంభంలోనే సంజయ్ విశ్వనాథ్‌ పాత్రను పరిచయం చేసే తీరు, అతను ఒకప్పుడు షార్ప్‌షూటర్‌గా ఉండి ఆ తర్వాత అనుకోని పరిణామాల వల్ల క్రైసిస్ హ్యాండ్లర్‌గా మారిన నేపథ్యాన్ని చూపించిన విధానం చాలా నీట్ గా అనిపిస్తుంది. కెమెరామెన్ నిమిష్ రవి అందించిన విజువల్స్ సినిమా ప్రారంభం నుంచే ఒక రిచ్ ఫీల్‌ను తీసుకువస్తాయి. హీరో నివసించే భారీ బంగ్లా, దాని చుట్టూ ఉన్న ఎక్స్‌టీరియర్ షాట్స్ ఫ్రేమ్‌ని ఎంతో అందంగా మలుస్తాయి. అయితే, చాలా వరకు సన్నివేశాలు ఆ పెద్ద బంగ్లా ఇండోర్ పోర్షన్స్‌లోనే జరగడం వల్ల, ఒకే రకమైన గోడలు మరియు స్పేస్‌లు పదే పదే కనిపిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అయినప్పటికీ, లైటింగ్ మరియు కలర్ గ్రేడింగ్ విషయంలో టెక్నికల్ టీమ్ చూపిన శ్రద్ధ ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా కనిపించేలా చేసింది. కథ ముందుకు వెళ్లే కొద్దీ వచ్చే మదర్-సన్ బాండింగ్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ముఖ్యంగా సంజయ్ విదేశాలకు వెళ్లి మ్యాడీని ఇంటికి తీసుకువచ్చే సీక్వెన్స్ వరకు రైటింగ్ చాలా బేసిక్ ఫార్ములాలో సాగినప్పటికీ, ఆ తర్వాత వచ్చే ఒక అద్భుతమైన సన్నివేశం సినిమా స్థాయిని ఒక్కసారిగా పెంచేస్తుంది. సంజయ్ ఒక టీవీ ఇంటర్వ్యూలో కనిపించి తన డ్రైవర్ గురించి, ఆ డ్రైవర్ కొడుకు గురించి మాట్లాడే సీన్ నిజంగా సినిమాకి ఒక మేజర్ హైలైట్ అవుతుంది. ఆ సన్నివేశంలో వెంకీ అట్లూరి రాసిన మాటలు అక్షరాలా గుండెల్ని తాకుతాయి. ఈ సీన్‌లో సూర్య బాడీ లాంగ్వేజ్, ఆయన కళ్లలో కనిపించే ఇంటెన్సిటీ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కెమెరా యాంగిల్స్ కూడా ఆ ఎమోషన్‌ను మరింత ఎలివేట్ చేసేలా క్లోజ్-అప్ షాట్స్‌తో అద్భుతంగా పడ్డాయి. ఇక కథలోకి మమిత బైజు ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాటోగ్రఫీ టోన్ కాస్త మారుతుంది. మమిత ఎనర్జిటిక్ ప్రెజెన్స్ వల్ల స్క్రీన్ మీద ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఆమె చేసే అల్లరి, సంజయ్‌తో నడిచే చిన్న చిన్న సరదా సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయి. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ సినిమా మూడ్‌కి సరిగ్గా సరిపోతుంది. పెద్దగా చార్ట్‌బస్టర్ ఆల్బమ్ కాకపోయినప్పటికీ, నేపథ్య సంగీతం మాత్రం కీలక సన్నివేశాలను నిలబెట్టడంలో తన వంతు పాత్ర పోషించింది. అయితే కొన్ని చోట్ల ఇంకాస్త బలమైన బీజీఎం పడి ఉంటే ఎమోషన్స్ మరింత పీక్స్‌కి వెళ్లేవనిపిస్తుంది. ఎడిటర్ నవీన్ నూలి ఫస్ట్ హాఫ్ వరకు కథను ఎక్కడా బోర్ కొట్టకుండా చక్కగా కట్ చేశారు. ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే లైట్‌హార్టెడ్ సన్నివేశం సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేస్తుంది. రాధిక శరత్‌కుమార్ ఎంట్రీతో సాధారణ సన్నివేశాలు కూడా ఎలివేట్ అవుతాయి. ఆమె అనుభవం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది, ప్రతి సీన్‌లోనూ తనదైన నటనతో సినిమాను ఒక మెట్టు పైకి లాగుతారు. సెకండ్ హాఫ్‌ విషయానికి వస్తే, ద్వితీయార్ధం ప్రారంభం చాలా ఆసక్తికరంగానే మొదలవుతుంది. రాధిక పాత్ర చుట్టూ తిరిగే ట్విస్ట్, ఆ తర్వాత వచ్చే ఎమోషనల్ సాంగ్, ఆ పాటలో సూర్య ప్రదర్శించిన అద్భుతమైన అభినయం సినిమాకు మంచి హార్ట్‌వార్మింగ్ ఫీల్‌ను ఇస్తాయి. సంజయ్ పాత్రలో సూర్య పరిణితి చెందిన నటన ఈ దశలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా, ఒక మంచి మనిషిగా ఆ పాత్రలో సూర్య జీవించేశాడు. అయితే, అక్కడి నుంచి కథను ముందుకు తీసుకెళ్లే క్రమంలో డైరెక్టర్ తడబడినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ప్రధాన పాత్రలైన హీరో, అతని తల్లి, చిన్నారి మరియు మమితల మధ్య ఒక ఆర్గానిక్ డ్రామాను బలపడేలా చేయడంలో దర్శకుడు కాస్త పక్కదారి పట్టారు. ముఖ్యంగా రవీనా టండన్ కుటుంబానికి సంబంధించిన సబ్‌ప్లాట్‌ను కథలోకి తీసుకురావడం వల్ల ప్రధాన కథాంశం పక్కదారి పట్టిన అనుభూతి కలుగుతుంది. ఈ ట్రాక్ వల్ల కథలో వేగం మందగించడమే కాకుండా, అనవసరమైన మెలోడ్రామా డోస్ పెరిగిపోయినట్లు అనిపిస్తుంది.ఈ దశలో ఎడిటింగ్ పరంగా ఇంకాస్త కత్తెర పడి ఉండాల్సిందనే అభిప్రాయం కలుగుతుంది. కొన్ని సన్నివేశాలు రిపీటెడ్ అనిపించడం వల్ల రన్‌టైమ్ కొంచెం భారంగా మారుతుంది. వెడ్డింగ్ ఎపిసోడ్ మరియు దాని చుట్టూ నడిచే డ్రామా పూర్తిగా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. "డబ్బులు మన సౌకర్యానికి మాత్రమే..అహంకారానికి కాదు", "కొత్తది చివరి ఆప్షన్ అవ్వాలి", "మనుషులు విడిపోయేది గొడవలు వల్ల కాదు..గొడవల తర్వాత సరిగా మాట్లాడుకోకపోవడం వల్ల" లాంటి సంభాషణలు కేవలం మాటలుగా కాకుండా నేటి తరానికి ఒక మంచి లైఫ్ లెసన్ లాగా వినిపిస్తాయి.అక్కడక్కడ ఫన్, ఎమోషన్స్ ఉన్నప్పటికీ, కొన్ని సన్నివేశాలు టీవీ సీరియల్ వైబ్స్‌ని తలపిస్తాయి. అయినప్పటికీ, టెక్నికల్ డిపార్ట్‌మెంట్ పరంగా చూస్తే నిమిష్ రవి ఫ్రేమింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు నిలకడను తెచ్చాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తాయి. ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి స్క్రీన్ మీద రిచ్‌గా కనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే లోపాలు, సెకండ్ హాఫ్‌లో సాగదీత ధోరణి సినిమా పూర్తి స్థాయి విజయాన్ని సాధించకుండా అడ్డుకున్నాయి. క్లైమాక్స్ రొటీన్ ఫార్మాట్‌కు భిన్నంగా కాస్త డీసెంట్‌గా, హృదయానికి హత్తుకునేలా ముగించినప్పటికీ, అంతకుముందు జరిగిన డ్రామా వల్ల ఆ ప్రభావం పూర్తిగా ప్రేక్షకుడిని తాకదు. మొత్తంగా చూస్తే, ఫస్ట్ హాఫ్ ఇస్తాన్న ఫ్రెష్ ఫీల్, సూర్య మరియు మమితల కాంబినేషన్, అర్థవంతమైన డైలాగులు సినిమాను నిలబెడతాయి. ప్లస్ పాయింట్స్ : సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ మమిత బైజు ఎనర్జీ వెంకీ అట్లూరి మాటలు రాధిక రోల్ ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ సాగదీత రవీనా టండన్ ట్రాక్ హెవీ మెలోడ్రామా డోస్ ఆశించిన స్థాయి లేని బీజీఎం రిపీటెడ్ ఇండోర్ విజువల్స్ ఫైనల్ వర్డ్ : విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా సూర్య లవబుల్ యాక్టింగ్, మమిత బైజు అల్లరి, అద్భుతమైన సంభాషణలతో మొదటి అర్ధభాగంలో చక్కని వినోదాన్ని పంచుతుంది. ద్వితీయార్ధంలో సాగదీత మరియు కొన్ని వర్కౌట్ కాని సబ్‌ప్లాట్స్ మైనస్‌గా మారినప్పటికీ, ఒకసారి కుటుంబంతో కలిసి చూడదగ్గ క్లీన్ అండ్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం నిలుస్తుంది. ఆశించిన స్థాయి కంటే కాస్త మెరుగ్గా ఉంటే బాగుండు అనిపించినా, మంచి భావోద్వేగాల కోసం ఈ వారాంతంలో థియేటర్లలో చూడవచ్చు. SkyC Rating: 3/5
By Venkat Reddy — 14 August 2026