30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండకు కృష్ణమ్మ పరవళ్లు!

veligonda-project-phase-1-inauguration-cm-chandrababu-naidu

రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరే సుదినం రానే వచ్చింది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గంటవానిపల్లి హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రారంభించనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగంగా కృష్ణా జలాలను అధికారికంగా నల్లమల సాగర్ రిజర్వాయర్‌లోకి విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో దశాబ్దాలుగా తీవ్ర కరువు, ఫ్లోరైడ్ సమస్యలతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి శాశ్వత ఉపశమనం లభించనుంది. ఈ ప్రాజెక్టుకు 1996లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడే స్వయంగా పునాది రాయి వేశారు. దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రజలకు నీటిని అందించే స్థాయికి చేరుకోవడం విశేషం. దశాబ్దాల పాటు అనేక అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ, ఎట్టకేలకు మొదటి దశ పనులు పూర్తి చేసుకుని నీటి విడుదలకు సర్వం సిద్ధమైంది. ఫేజ్-1 ద్వారా సుమారు 10.7 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో ప్రకాశం, నెల్లూరు, కడప, మరియు మార్కాపురం జిల్లాల పరిధిలోని 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 4 లక్షల మంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి రానుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ కారణంగా సుమారు 11 గ్రామాలు ముంపునకు గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఫలితంగా నిర్వాసితుల కోసం ₹4.07 కోట్ల తక్షణ సాయాన్ని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముంపు బాధితులకు రేషన్ కిట్లు, పశువుల దాణా మరియు మహిళలకు ప్రత్యేక కిట్లను అందిస్తోంది. ప్రభుత్వం అందించే సాయంలో భాగంగా 10,000 కుటుంబాలకు ₹2,818 విలువైన రేషన్ కిట్లను పంపిణీ చేయనున్నారు. వీటిలో 25 కిలోల బియ్యం, పప్పు, చక్కెర, నూనె, ఉల్లిగడ్డలు మరియు బంగాళదుంపలు ఉంటాయి. వీటితో పాటు 4,933 పశువులకు 30 రోజుల సరిపడా దాణాను, అలాగే 6,000 మంది మహిళలకు పసుపు-కుంకుమ, చీర మరియు గాజుల కిట్లను అందజేస్తున్నారు. రాబోయే రోజుల్లో వెలిగొండ పూర్తి ప్రాజెక్ట్ పనులు పూర్తయితే మొత్తం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో పాటు లక్షలాది మంది ప్రజలకు తాగునీటి కొరత తీరుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో కరువు రాకాసిని తరిమికొట్టడానికి ఈ ప్రాజెక్టు ఒక దివ్యౌషధంగా మారనుంది.
By V Sudhakar — 30 August 2026