రివ్యూ: వధంతి (OTT)

ప్రైమ్ వీడియోలో వచ్చిన వధంతి సీజన్ 2 'ది మిస్టరీ ఆఫ్ మణి' సిరీస్ రివ్యూ. శశికుమార్ ఇన్వెస్టిగేషన్, స్క్రీన్‌ప్లే, గ్రిప్పింగ్ ట్విస్టుల సంపూర్ణ విశ్లేషణ.

టైటిల్: వధంతి: ది మిస్టరీ ఆఫ్ మణి – సీజన్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో జానర్: క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ భాష: తెలుగు డబ్బింగ్ (ఒరిజినల్: తమిళం) ఎపిసోడ్లు: 8 విడుదల తేదీ: ఆగస్టు 2026 దర్శకుడు: ఆండ్రూ లూయిస్ రచయిత: ఆండ్రూ లూయిస్ సంగీత దర్శకుడు: సైమన్ కె. కింగ్ ఛాయాగ్రాహకుడు: మెయ్యెందిరన్ ఎడిటర్: రిచర్డ్ కెవిన్ నిర్మాణ సంస్థ: వాల్‌వాచర్ ఫిల్మ్స్ నటీనటులు: శశికుమార్, అనఘ మరుతోరా, యశ్వంత్, రేవతి శర్మ, అపర్ణ దాస్, చేతన్ కథ : తమిళనాడులోని మధురై సమీపంలో ఎనిమిది లేన్ల జాతీయ రహదారి నిర్మాణం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు కలసి అత్యంత వైభవంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమవుతారు. సభా వేదిక వద్ద, మీడియా ప్రతినిధులు, జనం చూస్తుండగానే భూమిని తవ్వుతున్న జేసీబీ ప్రాజెక్టు ఏరియాలో అకస్మాత్తుగా కొన్ని వింతైన మానవ అస్థిపంజర అవశేషాలను బయటకు తీస్తుంది. ఆ వేడుక కాస్తా ఒక్కసారిగా షాకింగ్ నేర స్థలంగా మారిపోతుంది. ఊహించని ఈ ఘటనతో రాజకీయంగా పెద్ద తుఫానే రేగుతుంది. మీడియా వ్యాప్తంగా ఈ వార్త సంచలనం సృష్టిస్తుంది. దాంతో పోలీసు యంత్రాంగంపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. పాడంబత్తూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్. మూసా రజా (శశికుమార్) ఈ కేసు విచారణ బాధ్యతలను స్వీకరిస్తాడు. అతని పైఅధికారి ఎస్పీ కే. రధికా నాయర్ పర్యవేక్షణలో విచారణ మొదలవుతుంది. అయితే కేసు ప్రారంభంలోనే అనేక తీర్చలేని ప్రశ్నలు పోలీసుల ముందు నిలుస్తాయి. దొరికిన అస్థిపంజరంలో ఒక చెయ్యి భాగం అసలు లేదు. ఆ అవశేషాలు ఆడా? మగా? అనే విషయంలో స్పష్టత ఉండదు. సదరు వ్యక్తిని అక్కడే చంపి పూడ్చిపెట్టారా లేక వేరే ఎక్కడో చంపి ఇక్కడ పాతిపెట్టారా? ఒకవేళ వేరే ప్రాంతంలో చంపితే, రెండున్నరేళ్ల క్రితం చనిపోయినప్పుడే పాతిపెట్టారా లేక ఈమధ్యే తవ్వి ఇక్కడ పెట్టారా? అసలు ఇది కచ్చితంగా హత్యేనా? ఇలాంటి ప్రశ్నలతో విచారణ మొదటికే మోసమొచ్చినట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలోనే పోలీసుల శోధన క్రమంగా 'మోడక్కత్తాన్' మణి (యష్వంత్) అనే వ్యక్తి వైపు మళ్లుతుంది. మణి ఒకప్పుడు జల్లికట్టు విజేత. ప్రస్తుతం అతను తన ప్రియురాలు నిలవతి (రేవతి శర్మ), చెల్లెలు వెంబాలను హత్య చేసిన నేరంలో జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. నిలవతి ఒక ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయి. ఆమె సోదరుడు తీవ్రమైన కులపిచ్చి ఉన్న వ్యక్తి. మణి, నిలవతిల ప్రేమను అతను తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. మరోవైపు మణి చెల్లెలు వెంబాని, మణి ప్రాణస్నేహితుడైన సుందరేశన్ వేధిస్తుంటాడు. మరి జైలులో ఉన్న మణికి, హైవే వద్ద దొరికిన ఈ అనాథ అస్థిపంజరానికి ఉన్న సంబంధం ఏమిటి? ఆ రోజు అసలు ఏం జరిగింది అనే విషయంపై మణి ఎందుకు నోరు విప్పడం లేదు? మూసా రజా ఈ నిగూఢమైన రహస్యాన్ని ఎలా ఛేదించాడు అనేదే మిగతా కథ. విశ్లేషణ : తమిళ చిత్రసీమ నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లకు ఓ ప్రత్యేకమైన శైలి ఉంటుంది. మొదటి 'ది ఫేబుల్ ఆఫ్ వెలోని' చూపించిన సస్పెన్స్, డార్క్ అట్మాస్ఫియర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వచ్చిన రెండో సీజన్ 'ది మిస్టరీ ఆఫ్ మణి' కూడా అదే మూడ్‌ను, వాతావరణాన్ని అద్భుతంగా కొనసాగించింది. ఒక క్రైమ్ స్టోరీకి కావాల్సిన ఉత్కంఠను మొదటి ఎపిసోడ్ ప్రారంభంలోనే సెట్ చేయడంలో దర్శకుడు ఆండ్రూ లూయిస్ సంపూర్ణంగా విజయం సాధించాడు. కథనం ప్రారంభమయ్యే తీరు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిసి ఒక రకమైన మూడీ, థ్రిల్లింగ్ ఫీల్‌ను ప్రేక్షక మనసుల్లో కలిగిస్తాయి. తమిళంలో మంచి లాంగ్-ఫార్మాట్ మిస్టరీ కథల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ సిరీస్ ఒక మంచి డిజిటల్ విందు అని చెప్పవచ్చు. కథనాన్ని నడిపించిన తీరులో దర్శకుడి పరిణితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతీ ఎపిసోడ్‌లోనూ ఏదో ఒక గ్రిప్పింగ్ పాయింట్‌ను ఉంచుతూ, తదుపరి ఎపిసోడ్ చూడాలనే ఆసక్తిని పెంచేలా స్క్రీన్‌ప్లేను డిజైన్ చేశారు. మొదటి సీజన్‌లో ఉన్న కొన్ని చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటూ ఈసారి మరింత పగడ్బందీగా కథనాన్ని అల్లుకున్నారు. కేసు విచారణ ఒకవైపు సాగుతుంటే, మరోవైపు పాత్రల వ్యక్తిగత జీవితాలను చూపిస్తూ కథలో డ్రామాను సమపాళ్లలో మిక్స్ చేశారు. ఇది కేవలం ఒక హత్య కేసు విచారణగానే కాకుండా, ఆ నేరం వల్ల ప్రభావితమైన మనుషుల సైకాలజీని ఆవిష్కరించే ప్రయాణంగా మారుతుంది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మూసా రజా పాత్రలో శశికుమార్ నటన చాలా సహజంగా ఉంది. ఒక పక్క కేసును ఛేదించాలనే తపన, మరోపక్క గర్భవతి అయిన భార్య పట్ల బాధ్యత ఉన్న సగటు మనిషిగా ఆయన జీవించాడు. ఎక్కడా అతి చేయకుండా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బాడీ లాంగ్వేజ్‌లో ఒక నిరంతర అలసట, కేసు చిక్కుముడులు విప్పాలనే సీరియస్‌నెస్ ఆయన నటనలో స్పష్టంగా కనిపిస్తాయి. సంభాషణలు చెప్పే తీరు, విచారణ సమయంలో ముఖంలో మారే భావాలు సీన్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ఆయన భార్య సుమయగా అపర్ణ దాస్ నటన కూడా ఎంతో మెప్పిస్తుంది. సాధారణంగా పోలీస్ ఆఫీసర్ల భార్యలను నిరంతరం ఫిర్యాదు చేసే పాత్రలుగా చూపిస్తుంటారు, కానీ ఇందులో ఆమె పాత్రను చాలా పక్వతతో తీర్చిదిద్దారు. భర్త మానసిక స్థితిని అర్థం చేసుకుని, అతనికి మద్దతుగా నిలిచే భార్యగా ఆమె పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎస్పీ రధికగా అన్ఘ మరుతోర తన హోదాకు తగ్గట్టుగా సీరియస్ లుక్‌తో మెప్పించారు. ఆమె వ్యక్తిగత జీవితం, న్యాయవాది అయిన భర్త సుకుమారన్‌తో ఉండే సంబంధాలు, ఆ విచారణ ఆమె వైవాహిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందనేది కథలో ఒక భాగాలుగా చాలా నీట్‌గా కుదిరాయి. ఇక ఫ్లాష్‌బ్యాక్ పాత్రల విషయానికి వస్తే 'మోడక్కత్తాన్' మణిగా యష్వంత్ నటన చాలా హృద్యంగా ఉంది. జల్లికట్టు విజేతగా, ప్రేమికుడిగా, నిస్సహాయుడైన ఖైదీగా ఆయన పండించిన భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. నిలవతిగా రేవతి శర్మ, ఇతర సహాయ నటులు ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ సిరీస్‌లో అత్యంత విశేషమైన అంశం ఏమిటంటే ప్రతి చిన్న పాత్రకూ ఒక నిర్దిష్టమైన ఆర్క్ ఉండటం. పోలీస్ స్టేషన్‌కు టీ అందించే ఒక స్కూల్ డ్రాపౌట్ కుర్రాడు దిలీప్, యూట్యూబర్ పెరంబు ప్రభాకర్ పాత్రలను అల్లుకున్న తీరు రైటింగ్ పవర్‌కు నిదర్శనం. ఒక టీ కొట్టు కుర్రాడిని యూట్యూబ్ ఛానెల్ పెట్టమని సలహా ఇవ్వడం, మరోవైపు మీడియా ఫేస్‌గా మారిన యూట్యూబర్ విచారణలో కీలక పాత్ర పోషించడం లాంటివి స్క్రీన్‌ప్లేలో చాలా ఆర్గానిక్‌గా కలిసిపోయాయి. ఫోరెన్సిక్ నిపుణుడిగా చేసిన చేతన్ పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నిరంతరం శవాలతో గడిపే అతను హార్ట్ ఎటాక్ వచ్చినా మళ్లీ సిగరెట్ తాగుతూ "నేను దేవుడిని కాను, మన పరిమితులు మనకు తెలియాలి" అని చెప్పే డైలాగ్ పాత్ర అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే, కెమెరా వర్క్ ఈ సిరీస్‌కు అతిపెద్ద బలం. మధురై పరిసర ప్రాంతాలను, రాత్రి వేళల్లో సాగే విచారణ దృశ్యాలను విజువల్స్‌తో చాలా థ్రిల్లింగ్‌గా ప్రెసెంట్ చేశారు. కలర్ ప్యాలెట్, లైటింగ్ సీన్స్ మూడ్‌ను పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేశాయి. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా, డార్క్ థ్రిల్లర్ టోన్‌కు తగ్గట్లుగా ఉంది. కెమెరా యాంగిల్స్ ద్వారా సస్పెన్స్‌ను బిల్డ్ చేసిన తీరు అద్భుతం. ముఖ్యంగా అస్థిపంజరం దొరికిన ప్రాజెక్టు ఏరియా దృశ్యాలు, క్లోజప్ షాట్లు ప్రేక్షకుడిని కథలోకి లాక్కుపోతాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సస్పెన్స్ సన్నివేశాల్లో సైలెన్స్‌ను ఉపయోగిస్తూనే, అవసరమైన చోట బిజీఎమ్‌తో సీన్‌ను లేపారు. సౌండ్ డిజైన్ చాలా నైచురల్‌గా ఉంటూనే, ఒక భయాందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించడంలో తోడ్పడింది. ఎడిటింగ్ విషయానికొస్తే కథనం మేజర్ పార్ట్ చాలా వేగంగానే సాగుతుంది. ప్రతీ ఎపిసోడ్ కట్ అయ్యే విధానం బింజ్-వాచ్ చేయడానికి అనుకూలంగా ఉంది. ప్రోడక్షన్ వాల్యూస్ ప్రైమ్ వీడియో స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగానే చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపిస్తోంది అనేలా మేకింగ్ ఉంది. అయితే సిరీస్‌లో కొన్ని చిన్నపాటి లోపాలు లేకపోలేదు. కొన్ని చోట్ల విచారణ కేవలం డిఎన్‌ఏ పరీక్షలు, అనుమానాల చుట్టూనే సుదీర్ఘంగా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇది కథనంలో కొంత మందకొడితనాన్ని తీసుకువచ్చింది. అలాగే ఏడో ఎపిసోడ్‌లో వచ్చే ఒక కీలకమైన ట్విస్ట్ సీన్ చాలా ధైర్యంతో కూడుకున్న స్క్రీన్‌ప్లే నిర్ణయమే అయినా, అది విచారణలోని అధికారుల సమయాన్ని మాత్రమే కాకుండా ప్రేక్షకుల సమయాన్ని కూడా కాస్త వృథా చేసినట్లు భావన కలిగిస్తుంది. కానీ ఆ తర్వాత ఇచ్చే వివరణ, లాజిక్ సమర్థనీయంగా ఉండటంతో ఆ చిన్న అసంతృప్తి పోతుంది. ఫోరెన్సిక్ నిపుణుడు చెప్పాల్సిన కొన్ని విషయాలను కాప్స్ ఊహించడం లేదా వైస్ వెర్సా కాస్త డ్రమటైజ్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ హోమ్ వీవింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు చాలా బాగా సరిపోతుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ల్యాప్‌టాప్ లేదా టీవీలో పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఆ విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చే థ్రిల్ వేరుగా ఉంటుంది. ఓటీటీకి అనుగుణంగా ఎపిసోడిక్ ప్లానింగ్ ఉండటం వల్ల వారాంతంలో ఒకేసారి బింజ్-వాచ్ చేయడానికి ఇది ఉత్తమమైన ఎంపిక. సస్పెన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథలను ఇష్టపడే వారికి ఈ 'మణి మిస్టరీ' మంచి అనుభూతిని ఇస్తుంది. మొత్తంగా చూస్తే, 'వధంతి: ది మిస్టరీ ఆఫ్ మణి' ఒక అద్భుతమైన, ఆలోచింపజేసే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. పాత్రల నిర్మాణం, బలమైన కథనం, సాంకేతిక నైపుణ్యం ఈ సిరీస్‌ను ఇతర సాధారణ థ్రిల్లర్ల కంటే భిన్నమైన స్థాయిలో నిలబెట్టాయి. ఆండ్రూ లూయిస్ తన మార్కు రైటింగ్‌తో క్రైమ్ జానర్‌లో మరోసారి తన ప్రతాపం చూపించారు. చిన్నపాటి సాగదీతలను పక్కన పెడితే, సస్పెన్స్ లవర్స్ ఖచ్చితంగా మిస్ అవ్వకూడని సిరీస్ ఇది. ప్లస్ పాయింట్స్ : గ్రిప్పింగ్ కథ మరియు కథనం శశికుమార్ సెటిల్డ్ నటన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి ఎపిసోడ్ క్లిఫ్‌హ్యాంగర్లు మైనస్ పాయింట్స్ : కొద్దిగా నెమ్మదించిన మధ్య ఎపిసోడ్లు సుదీర్ఘమైన డిఎన్‌ఏ పరీక్ష సీన్లు కొన్ని ఊహించదగిన సన్నివేశాలు OTT Verdict : 'వధంతి: ది మిస్టరీ ఆఫ్ మణి' ఈ వారాంతంలో తప్పక చూడాల్సిన గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్. కుటుంబంతో కలసి చూడటం కంటే పర్సనల్ స్క్రీన్స్ లేదా రాత్రి వేళల్లో ఒంటరిగా/మిత్రులతో చూస్తే ఈ సిరీస్ ఇచ్చే థ్రిల్ అనుభూతి అంతకంతకూ పెరుగుతుంది. ఎపిసోడ్ ఎపిసోడ్‌కు పెరిగే ఉత్కంఠ, నటీనటుల అత్యుత్తమ నటన, క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ దీనిని పక్కా బింజ్-వర్తీ సిరీస్‌గా మార్చాయి. మిస్టరీ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మంచి రీవాచ్ వాల్యూ ఉన్న సిరీస్. రీసెంట్ ఓటీటీ కంటెంట్‌లో డెఫినెట్‌గా ఇది ఒక 'స్టీమ్ ఇట్' రికమండేషన్! SkyC Rating : (3.75/5)
By Chandrasekhar B — 13 August 2026