హెచ్-1బీ నిబంధనలు ఉల్లంఘిస్తే అమెరికా ఇచ్చే ఊహించని షాక్

హెచ్-1బీ వీసా నిబంధనలు ఉల్లంఘించిన 4 కంపెనీలపై అమెరికా రెండేళ్ల నిషేధం విధించింది. పూర్తి వివరాలు, కంపెనీల జాబితా ఇక్కడ చెక్ చేయండి.

అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌కు సంబంధించి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. అమెరికా కార్మిక శాఖలోని వేజ్ అండ్ అవర్ డివిజన్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన 4 కంపెనీలపై కఠిన చర్యలు చేపట్టింది. ఈ సంస్థలను విల్‌ఫుల్ వయోలేటర్‌గా వర్గీకరిస్తూ కొత్తగా విదేశీ ఉద్యోగులను స్పాన్సర్ చేయకుండా నిషేధం విధించింది. అమెరికా ప్రభుత్వం విధించిన ఈ కొత్త ఆంక్షల జాబితా జూలై 1 నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ నిషేధానికి గురైన సంస్థల వివరాలను కార్మిక శాఖ స్పష్టంగా వెల్లడించింది. గౌరాటెక్ ఎల్ఎల్సీపై 2025 మే 12 నుంచి 2027 మే 11 వరకు రెండేళ్ల పాటు నిషేధం అమలులో ఉంటుంది. రెనోటెక్ గ్రూప్ ఎల్ఎల్సీపై ఆగస్టు 8 నుంచి 2027 ఆగస్టు 7 వరకు ఆంక్షలు విధించారు. అలాగే సీలోజ్ ఇన్ కార్పొరేషన్‌పై మార్చి 4 నుంచి 2028 మార్చి 3 వరకు నిషేధం వర్తిస్తుంది. షేర్‌వుడ్ ఎట్ మౌంట్ డోరా ఇన్ కార్పొరేషన్ పై మే 26 నుంచి 2028 మే 25 వరకు నిరోధం విధించారు. దీంతో ఈ నిర్ణీత కాలంలో సదరు నాలుగు కంపెనీలు కొత్తగా ఎలాంటి హెచ్-1బీ పిటిషన్లను దాఖలు చేయడానికి వీలుండదు. ఇదిలా ఉండగా ఈ కంపెనీల్లో ఇప్పటికే పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల వీసాలు చెల్లుబాటు అవుతాయని అధికారులు తెలిపారు. అయితే ఆ ఉద్యోగులకు సంబంధించిన వీసా ఎక్స్‌టెన్షన్లను మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. లేబర్ కండిషన్ అప్లికేషన్ లేదా ఎల్సిఎలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా ముఖ్యమైన వాస్తవాలను దాచడం వల్ల ఈ చర్యలు తీసుకున్నారు. ఫలితంగా నిబంధనలు పాటించని ఈ సంస్థలను ప్రభుత్వం విల్‌ఫుల్ వయోలేటర్లుగా అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో సాధారణ ఉల్లంఘనలతో పోలిస్తే ఇలాంటి కంపెనీలపై అత్యంత తీవ్రమైన కఠిన చర్యలు అమలు అవుతాయి. అంతేకాకుండా నిషేధ కాలం పూర్తయిన తర్వాత కూడా తదుపరి 5 ఏళ్ల పాటు ఈ కంపెనీలు అమెరికా ప్రభుత్వ రాండమ్ ఇన్వెస్టిగేషన్లకు గురికావాల్సి ఉంటుంది. స్థానిక కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అదనంగా ఈ కంపెనీలు యూఎస్ వర్కర్లను డిస్‌ప్లేస్ చేయకుండా ఉండటంతో పాటు గుడ్ ఫెయిత్ రిక్రూట్‌మెంట్ వంటి అదనపు అటెస్టేషన్లను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ నాలుగు కంపెనీలు పెద్ద ఐటీ జెయింట్స్ కాకపోవడం వల్ల భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ మెజారిటీ వర్గంపై ప్రత్యక్ష ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అయితే కొత్తగా హెచ్-1బీ ఆఫర్ పొందే అభ్యర్థులు సదరు కంపెనీ డిబార్డ్ జాబితాలో ఉందో లేదో ముందే పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధికారికంగా నిషేధానికి గురైన కంపెనీల పూర్తి వివరాల జాబితా ప్రస్తుతం కార్మిక శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడింది. అమెరికా ప్రభుత్వం తన స్వదేశీ ఉద్యోగుల రక్షణను బలోపేతం చేసేందుకు హెచ్-1బీ వీసా నిబంధనలను క్రమంగా కఠినతరం చేస్తోంది. ఇటువంటి నిషేధ చర్యలు ఆ దిశగా పడిన మరో ముఖ్యమైన అడుగుగా భావించవచ్చు. రాబోయే రోజుల్లో నిబంధనలు ఉల్లంఘించే మరిన్ని కంపెనీలు ఈ నిషేధిత జాబితాలో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
By Venkat Reddy — 28 July 2026