టీవీకే ఉచిత కార్ల ఆఫర్‌ను తిరస్కరించిన ఉదయనిధి స్టాలిన్!

తమిళనాడు ఎమ్మెల్యేలకు టీవీకే ఇచ్చిన ఉచిత కార్ల ఆఫర్‌ను డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తిరస్కరించారు. అప్పుల భారం దృష్ట్యా తమ 59 మంది ఎమ్మెల్యేలు కార్లు తీసుకోరని వెల్లడించారు.

తమిళనాడు రాజకీయాల్లో కొత్త రగడ మొదలైంది. అసెంబ్లీలోని 234 మంది ఎమ్మెల్యేలకు ఉచిత కార్లు ఇస్తామని టీవీకే ప్రభుత్వం ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. ప్రతి ఎమ్మెల్యేకు కారుతో పాటు డ్రైవర్, పెట్రోల్, వాహన నిర్వహణ కోసం నెలకు ₹75,000 భత్యం కూడా ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ ఆఫర్‌ను ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తమ డీఎంకే పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు ఈ ఉచిత కార్లను తీసుకోకూడదని నిర్ణయించుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను ఉదయనిధి స్టాలిన్ సభలో వివరంగా వెల్లడించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రవాణా సౌకర్యాలు అవసరమని వీసీకే ఎమ్మెల్యే జ్యోతిమణి డిమాండ్ చేశారని ప్రభుత్వం పేర్కొంది. ప్రజా ప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయాలంటే ఈ సదుపాయం తప్పనిసరి అని సర్కార్ సమర్థించుకుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తిచూపుతూ ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు విసిరారు. దింతో రాష్ట్రం ఎదుర్కొంటున్న అప్పుల భారాన్ని తగ్గించడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఉదయనిధి తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక సంక్షోభం, అప్పుల భారం గురించి మాట్లాడుతూ, మరోవైపు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఇలాంటి ఆఫర్లు ఇవ్వడం ద్వంద్వ విధానమని విమర్శించారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృథా చేయకుండా, కార్లు లేని పేద ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫలితంగా ఈ అంశంపై తమిళనాడు అసెంబ్లీలో తీవ్రమైన చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో మిగతా రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఆఫర్‌ను స్వాగతించగా, డీఎంకే మాత్రం తోసిపుచ్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఇచ్చే ఉచిత సదుపాయాలను నిరాకరించడం ద్వారా ప్రజల వైపు తాము నిలబడ్డామని డీఎంకే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముందుముందు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. ప్రజాధనాన్ని పదుపుగా వాడాలని డీఎంకే పట్టుబడుతుండటంతో టీవీకే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. నిజంగా అవసరమున్న ఎమ్మెల్యేలకే వాహనాలు ఇస్తారా లేదా అందరికీ వర్తింపజేస్తారా అనేది మున్ముందు తేలనుంది.
By Chandrasekhar B — 21 August 2026