"రేపటిలోపు తెరవండి".. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం!

హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్‌పై తీవ్ర దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ప్రకటనను ఖండించిన ఇరాన్.

అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవకపోతే ఇరాన్‌పై అత్యంత శక్తివంతమైన దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, జలసంధి త్వరలోనే తెరుచుకుంటుందని లేదా ఇరాన్ ఊహించని స్థాయిలో దెబ్బ తింటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇరాన్‌తో మంచి చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ ప్రతిపాదించారు. జలసంధిని రేపటికల్లా తెరవడం పెద్ద సంక్లిష్టమైన విషయమేమీ కాదని వ్యాఖ్యానించిన ఆయన, ఇది చివరి అవకాశమని స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాత ఇరాన్ ఓడలపై దాడులకు దిగడం, అమెరికా ఓడరేవులను దిగ్బంధించడంతో ఆ ఒప్పందం విఫలమైంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దాడులకు సంబంధించిన ప్రణాళికలు బయటకు రావడంతోనే ఇరాన్ భయపడుతోందని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. దీంతో ఈ వ్యవహారంపై స్పందించిన ఇరాన్, అమెరికా చేస్తున్న వాదనలను పూర్తిగా తోసిపుచ్చింది. ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ మాట్లాడుతూ, అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు. తమ విదేశాంగ మంత్రి ఇరాక్ పర్యటనలో ఉన్నారని, మిగిలిన చర్చల బృందం ఇరాన్‌లోనే ఉందన్నారు. ఇదిలా ఉండగా కేవలం సముద్ర మార్గ రక్షణకు సంబంధించి ఒమన్ దేశంతో మాత్రమే తాత్కాలిక చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఫలితంగా ఇరాన్ ప్రకటనపై డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ నాయకత్వం అత్యంత మోసపూరితమైనదని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడని రీతిలో అత్యంత తీవ్రమైన దాడికి అమెరికా సిద్ధమవుతోందనే వార్తలు బయటకు రావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ భయంతోనే ఇరాన్ వెనక్కి తగ్గుతోందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ఇంధనంలో దాదాపు 20 శాతం ముడి చమురు మరియు ఇంధన వనరులు ఈ హోర్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతాయి. ఈ కీలకమైన జలదార మూతపడటంతో ప్రపంచ ఇంధన మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఓవైపు అమెరికా తీవ్ర హెచ్చరికలు చేస్తుండగా, మరోవైపు ఇరాన్ చర్చల వార్తలను ఖండిస్తుండటంతో ఈ సమస్య ఎంతవరకు దారితీస్తుందోనన్న ఆందోళన పెరుగుతోంది. ముందుముందు ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందోనని అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది. హోర్ముజ్ మార్గం త్వరలోనే సురక్షితంగా తెరుచుకుంటుందా లేదా తీవ్రస్థాయి మిలిటరీ చర్యలకు దారితీస్తుందా అనేది రానున్న కొన్ని గంటల్లో తేలనుంది. రెండు దేశాల మధ్య ఉన్న వైఖరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
By Bhavani E — 05 August 2026