అణు సాంకేతికతతో సౌదీకి అమెరికా పూర్తి మద్దతు..

సౌదీ అరేబియాతో 30 ఏళ్ల చారిత్రాత్మక పౌర అణు సహకార ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియాతో ఒక చారిత్రాత్మక పౌర అణు సహకార ఒప్పందానికి ఆమోదం తెలిపారు. 30 సంవత్సరాల కాలపరిమితితో కూడిన ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య దౌత్య బంధాన్ని కొత్త మలుపు తిప్పనుంది. మధ్యప్రాచ్యంలో అమెరికా తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గతంలో అమెరికా పర్యటనకు వచ్చిన సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు జరిపారు. ఆ తర్వాత రెండు దేశాల ప్రతినిధులు దీనిపై సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించారు. ఈ సుదీర్ఘమైన చర్చల ఫలితంగానే ఇప్పుడు ట్రంప్ పరిపాలన విభాగం ఈ ఒప్పందానికి ఆఖరి ఆమోదముద్ర వేసింది. ఈ ఒప్పందంలో భాగంగా సౌదీ అరేబియాలో యురేనియం శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. దీంతో అమెరికా మరియు సౌదీ నిపుణులు సంయుక్తంగా దీనిపై సమగ్ర అధ్యయనం చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ కేంద్రం నిర్వహణ మరియు నిర్మాణ బాధ్యతలను అమెరికా కంపెనీలకే అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫలితంగా అణు మౌలిక సదుపాయాల కల్పనలో అమెరికా కంపెనీలకు బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు దక్కే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రష్యా మరియు చైనా లాంటి ప్రత్యర్థి దేశాలకు సౌదీ మార్కెట్లో స్థానం లేకుండా అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అణు సాంకేతికత సైనిక అవసరాలకు మల్లకుండా తగిన పర్యవేక్షణ ఉంటుందని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ మరియు సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ త్వరలోనే ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేయనున్నారు. సంతకాల ప్రక్రియ పూర్తయిన వెంటనే ట్రంప్ ప్రభుత్వం ఈ నివేదికను యుఎస్ కాంగ్రెస్ సమీక్ష కోసం పంపించనుంది. అయితే మధ్యప్రాచ్య ప్రాంతంలో అణు సాంకేతికత విస్తరణపై అమెరికా చట్టసభ సభ్యుల్లో కొన్ని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యుఎస్ చట్టాల ప్రకారం ఈ ఒప్పందాన్ని పరిశీలించడానికి కాంగ్రెస్‌కు 90 రోజుల సమయం ఉంటుంది. కాంగ్రెస్ ఆమోదం పొందిన తర్వాతే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలులోకి రానుంది.
By Bhavani E — 22 July 2026