యష్ టాక్సిక్ మూవీ రివ్యూ: భారీ విజువల్స్, యాక్షన్ ఆకట్టుకున్నా గందరగోళ స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ కనెక్ట్ లోపం సినిమాను నిరాశపరిచాయి.
సినిమా పేరు & తారాగణం సినిమా: టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ హీరో: యష్ హీరోయిన్లు / ముఖ్య తారాగణం: నయనతార, కియారా అద్వాణీ, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, టోవినో థామస్, సుదేవ్ నాయర్, అక్షయ్ ఒబెరాయ్ తదితరులు దర్శకత్వం: గీతు మోహన్‌దాస్ కథ / స్క్రీన్‌ప్లే: గీతు మోహన్‌దాస్, యష్ డైలాగ్స్: రాఘవ్ వినయ్ శివగంగే సంగీతం: రవి బస్రూర్, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చి తదితరులు ఛాయాగ్రహణం: రాజీవ్ రవి ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి ప్రొడక్షన్ డిజైన్: టి.పీ. అబిద్ నిర్మాతలు: వెంకట్ కె. నారాయణ, యష్ నిర్మాణ సంస్థలు: కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ విడుదల తేదీ: 26 ఆగస్టు 2026 రన్‌టైమ్: సుమారు 3 గంటల 14 నిమిషాలు సర్టిఫికెట్: A కథ: గోవా నేపథ్యంలోని ఒక చీకటి గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలో అధికార, డబ్బు, డ్రగ్ నెట్‌వర్క్, నమ్మకం, ద్రోహం అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఆ ప్రపంచంలో రాయా అనే వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది. అతని జీవితం సాధారణ గ్యాంగ్‌స్టర్ కథలా కనిపించినా, కుటుంబ సంబంధాలు, ముఖ్యంగా గంగా పాత్రతో ఉన్న అనుబంధం, అతని జీవితంలోకి వచ్చే మరికొన్ని కీలక పాత్రలు కథను మరో దిశలోకి తీసుకెళ్తాయి. కియారా అద్వాణీ పోషించిన నాదియా, నయనతార పోషించిన గంగా, హుమా ఖురేషీ పోషించిన ఎలిజబెత్, తారా సుతారియా పోషించిన రెబెక్కా, రుక్మిణి వసంత్ పోషించిన మెలిసా వంటి పాత్రలు రాయా గమనాన్ని మారుస్తూ ఉంటాయి. సినిమా టైటిల్‌లోని “ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్” అనే ఆలోచనకు తగ్గట్టుగా, ఇది సంప్రదాయంగా హీరో మంచివాడు, విలన్ చెడ్డవాడు అనే సింపుల్ ప్రపంచాన్ని చూపించే సినిమా కాదు. అధికారాన్ని కోరుకునే మనుషులు, ఆ అధికారంలో చిక్కుకునే సంబంధాలు, హింసతో నిండిన జీవితం, దాని వల్ల వచ్చే పరిణామాల సమాహారమే ఈ కథ. విశ్లేషణ : 'కేజీఎఫ్ 2' తర్వాత దాదాపు నాలుగేళ్లకు తెరపైకి వస్తున్న సినిమా కావడంతో 'టాక్సిక్'పై అంచనాలు మొదటి నుంచీ భారీ స్థాయిలోనే ఉన్నాయి. అందులోనూ గీతు మోహన్‌దాస్ లాంటి భిన్నమైన ఫిల్మ్‌మేకర్‌ను యష్‌తో కలపడం వల్ల ఇది సాధారణ కమర్షియల్ యాక్షన్ సినిమా కాదనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ కాంబినేషన్ అసలు ఎలాంటి రూపం దాల్చుతుందనే ఉత్కంఠ విడుదలకు ముందే విస్తృతమైన చర్చకు దారితీసింది. సినిమా మొదలైన వెంటనే కనిపించే భారీ కాన్వాస్ ‘టాక్సిక్’ ఏ స్థాయిలో తెరకెక్కిందో స్పష్టం చేస్తుంది. గోవా నేపథ్యంలోని చీకటి గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని, డ్రగ్ కార్టెల్ సెటప్‌ను రిచ్‌గా చూపించడంలో ప్రొడక్షన్ డిజైన్ చాలా శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తుంది. లోకేషన్లు, లైటింగ్, సెట్స్ అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని నిర్మించడానికి తెరపై బలమైన ప్రయత్నం కనిపిస్తుంది. ముఖ్యంగా రాయా పాత్రను పరిచయం చేసే విధానం యష్‌కు ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్‌ను గట్టిగా ఉపయోగించుకొన్నారు.బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్స్, ముఖంలో ఉండే కంట్రోల్ ఇవన్నీ కలిసి యశ్ పాత్రకు మరియు తన స్టార్ ఇమేజ్ కు తగ్గట్టు కుదిరాయి.! అయితే ఇక్కడే సినిమా మొదటి పెద్ద సమస్య ఎదురవుతుంది. రాయా పాత్రకు పూర్తిగా ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఇవ్వాల్సిన చోట కొన్ని లుక్స్ మరియు బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకుడికి ‘రాకీ భాయ్’ను గుర్తు చేస్తాయి. విడుదలకు ముందే వినిపించిన ఈ పోలికలు, సినిమా చూస్తున్నప్పుడు కూడా కలిగితే కనపడితే ఆశ్చర్యం లేదు.కానీ యశ్ పెర్ఫార్మెన్స్‌ను మాత్రం తక్కువ చేసి చూడలేం. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అతని ఫిజికాలిటీ, కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ చెప్పకుండానే ఫ్రేమ్‌ను ఆక్రమించే సామర్థ్యం ఆయన బలంగా నిలుస్తాయి. నటుడిగా ఆయన ఇచ్చిన పూర్తి కమిట్‌మెంట్ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఆయన చుట్టూ అల్లిన ప్రపంచం, ముఖ్యంగా ఇంట్రడ్యూస్ చేసిన అనేక పాత్రల ఉనికి వెంటనే అర్థమయ్యేలా ఉండదు. సినిమాలోకి ఒకదాని తర్వాత ఒకటిగా ఎంట్రీ ఇచ్చే పాత్రలు కేవలం వచ్చిపోతుంటాయి తప్ప వాటి వెనుక బలమైన కారణాలు కనిపించవు. ఫలితంగా ప్రేక్షకుడు పాత్రలతో భావోద్వేగంగా కనెక్ట్ అవ్వడం కంటే వాటిని గుర్తుపెట్టుకోవడానికే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కియారా అద్వాణీ పోషించిన నాదియా పాత్ర చుట్టూ ప్రారంభంలో ఒక మిస్టరీ క్రియేట్ అవుతుంది. ఆమె తన పాత్రకు గ్లామర్‌తో పాటు ఎమోషన్ తీసుకురావడానికి నిజాయితీగా ప్రయత్నించినప్పటికీ, స్క్రీన్‌ప్లే ఆ పాత్రకు తగినంత స్పేస్ ఇవ్వకపోవడంతో ఆ పాత్ర ప్రభావం సినిమా పై తక్కువగా పడింది. నయనతార లాంటి అగ్ర నటి గంగా పాత్రలో కనిపించినా, ఆ పాత్రకు రాసిన ఎమోషనల్ మెటీరియల్ ఆశించిన స్థాయిలో పేలలేదు. కుటుంబ సంబంధం మరియు రాయా ప్రపంచంలో ఆమె ఉనికి కథకు బరువు కావాల్సి ఉన్నప్పటికీ, సన్నివేశాల మధ్య భావోద్వేగ ప్రయాణం లోపించడంతో పాత్ర కేవలం ఒక అనవసరమైన పాత్రలాగే మిగిలిపోతుంది. తారా సుతారియా, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్, సుదేవ్ నాయర్, అక్షయ్ ఒబెరాయ్ తదితరులతో భారీ తారాగణమే ఉన్నా, ఇన్ని పాత్రలను ఒకే కథలో సమర్థవంతంగా కలిపే రచన లోపించింది. నటీనటులు తమ పరిధి మేరకు నటించినా, స్క్రీన్‌ప్లే బ్యాలెన్స్ తప్పుతుండటంతో ఆయా పాత్రలు చిరాకు పెడతాయి. "మనం క్రౌర్యానికి, శౌర్యానికి, వీర్యానికి.. చీర్స్" "ఒక చెయ్యికి సమాధానం చెప్పాం.. రెండో చేతికి అర్థమయ్యేలా నువ్వు చెప్పు" "వయలెన్స్ ఈజ్ మై మదర్ టంగ్, యూనివర్సల్ లెంంగ్వేజ్" "మగతనానికి, మగాడి నిజాయితీకి ఒకే సారి పరీక్ష పెట్టకూడదు" "కొంత మందిని బతకడానికి ప్రేమిస్తాం, కొంత మందిని బతుకే అనుకుని ప్రేమిస్తాం" వంటి డైలాగ్స్ పేలాయి..! దర్శకురాలు గీతు మోహన్‌దాస్ తన గత చిత్రాల శైలికి భిన్నంగా ఈ భారీ కాన్వాస్‌ను ఎంచుకున్నారు. ఆమె తన విజువల్ వాయిస్‌ను, డార్క్ టోన్‌ను చివరి వరకు కాపాడుకున్నప్పటికీ, తన సహజమైన ఇంటిమేట్ డ్రామా శైలిని ఈ స్టార్-డ్రివెన్ కమర్షియల్ సినిమాతో పూర్తిగా మిక్స్ చేయడంలో తడబడ్డారు. యాక్షన్ పరంగా చూస్తే జె.జె. పెర్రీ, అన్బరివ్ వంటి ప్రముఖుల ఆధ్వర్యంలో రూపొందించిన ఫైట్లు చాలా భారీగా ఉన్నాయి. గన్స్, బ్లడ్, చేజింగ్ ఎపిసోడ్స్ థియేటర్‌లో మాస్ ఆడియెన్స్‌ను తాత్కాలికంగా ఆకట్టుకుంటాయి. అయితే వాటికి ముందు సరైన డ్రామాటిక్ స్టేక్స్ లేకపోవడం వల్ల కొన్ని ఫైట్లు కథను నడిపించేవిగా కాకుండా కేవలం హంగులకే పరిమితమవుతాయి. రాజీవ్ రవి కెమెరా వర్క్ సినిమాకు నిజమైన హైలైట్ అని చెప్పవచ్చు. షాడో-హెవీ లైటింగ్, వైడ్ ఫ్రేమ్స్ సినిమాకు ఒక ప్రీమియం లుక్‌ను తీసుకువచ్చాయి. అయితే ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్‌లో కొన్ని ట్రాన్సిషన్స్ ఇబ్బంది పెడతాయి. సుమారు మూడు గంటలకు పైగా ఉన్న రన్‌టైమ్ సినిమా కథనాన్ని మరింత సాగదీసిన అనుభూతిని కలిగిస్తుంది. రవి బస్రూర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల మితిమీరిన లౌడ్‌నెస్‌తో నిండిపోతాయి. ప్రశాంతంగా ఉండాల్సిన భావోద్వేగ క్షణాల్లో కూడా భారీ మ్యూజిక్ జోడించడం వల్ల ప్రేక్షకుడు ఆ ఫీల్ మిస్ అయ్యింది. డైలాగ్స్ విషయానికి వస్తే, భారీ స్టార్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిన కొన్ని లైన్స్ పాత్ర స్వభావం నుంచి సహజంగా రాలేదు. తెలుగు డబ్బింగ్‌లో ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తుంది. డైలాగ్ డెలివరీ నెమ్మదిగా సాగడం మరియు లిప్ మూవ్‌మెంట్ సింక్ కాకపోవడం వల్ల ఇంపాక్ట్ కొంత తగ్గుతుంది. చివరిగా, క్లైమాక్స్‌లో ఒక సైకాలజికల్ లేయర్‌ను తీసుకువచ్చి కథను మరో కోణంలో చూపించే ప్రయత్నం చేసినప్పటికీ, అంతకుముందు వరకు చూసిన సినిమా డోసు వల్ల పెద్దగా వర్కౌట్ కాలేదు. మొత్తంగా చూస్తే ‘టాక్సిక్’ విజువల్‌గా గొప్పగా ఉన్నా, సరైన స్క్రీన్‌ప్లే మరియు ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వల్ల ప్రేక్షకుడికి ఒక సుదీర్ఘమైన,అలసిపోయిన అనుభూతిని మిగులుస్తుంది. ప్లస్ పాయింట్స్ : యష్ స్క్రీన్ ప్రెజెన్స్ రిచ్ విజువల్స్ యాక్షన్ బ్లాక్స్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాటిక్ స్కేల్ మైనస్ పాయింట్స్ : కన్ఫ్యూజింగ్ స్క్రీన్‌ప్లే క్యారెక్టర్ డెవలప్‌మెంట్ స్లో పేసింగ్ ఎమోషనల్ డిస్కనెక్ట్ లాంగ్ రన్‌టైమ్ ఫైనల్ వర్డ్ : ‘టాక్సిక్’ అనేది కళ్లకు కనిపించే స్థాయిలో భారీగా ఉన్న సినిమా.. కానీ మనసుకు తగిలే స్థాయిలో అంత బలంగా లేదు. యష్ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాను మోసే ప్రయత్నం చేశాడు. రాజీవ్ రవి కెమెరా, భారీ ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకు మంచి థియేట్రికల్ అప్పీల్ ఇస్తాయి. కానీ ఇవన్నింటికంటే ముఖ్యమైన స్క్రీన్‌ప్లే, పాత్రల నిర్మాణం, ఎమోషనల్ కనెక్ట్ బలహీనంగా ఉండటంతో మూడు గంటలకు పైగా సాగిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా మనకు కావలసినంత అలసటను ఇస్తుంది..! SkyC Rating: 2/5