రివ్యూ : ది ఆడిస్సీ (THE ODYSSEY)

క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో మ్యాట్ డామన్ నటించిన 'ది ఆడిస్సీ' మూవీ రివ్యూ. విజువల్స్, నటన, టెక్నికల్ వండర్స్ ఎలా ఉన్నాయో పూర్తి రివ్యూలో చూడండి!

​సినిమా: ది ఆడిస్సీ (The Odyssey) ​నటీనటులు: మ్యాట్ డామన్, టామ్ హాలండ్, అనే హతావే, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపిటా న్యోంగో, జెండాయా, చార్లిజ్ తెరాన్ తదితరులు ​దర్శకత్వం: క్రిస్టఫర్ నోలన్ ​సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్ ​ఛాయాగ్రహణం: హోయ్టే వాన్ హోయ్టేమా ​నిర్మాతలు: క్రిస్టఫర్ నోలన్, ఎమ్మా థామస్ కథ : ​హాలీవుడ్ లో ఎన్నో చారిత్రక గాథలు ఉన్నాయి, కానీ గ్రీక్ పురాణాల్లో 'ది ఆడిస్సీ' కథకు ఉన్న క్రేజ్ వేరు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, మహా యోధుడు ఆడిస్సియస్ (మ్యాట్ డామన్) తన గ్రీక్ సైన్యంతో కలిసి బలమైన ట్రాయ్ రాజ్యం మీద దండయాత్రకు బయల్దేరుతాడు. ట్రాయ్ కోట గోడలను బద్దలు కొట్టడం ఎవరి తరం కాదని తెలిసి, ఆడిస్సియస్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఒక భారీ చెక్క గుర్రాన్ని (ట్రోజన్ హార్స్) తయారు చేసి, అందులో తన సైనికులను దాచి పెడతాడు. ఆ గుర్రాన్ని గ్రీకులు తమకు బహుమతిగా ఇచ్చి వెళ్ళిపోయారని భ్రమపడి ట్రాయ్ సైన్యం దాన్ని కోట లోపలికి తీసుకెళ్తుంది. అర్ధరాత్రి కాగానే గుర్రం లోంచి బయటకు వచ్చిన ఆడిస్సియస్ సైన్యం, శత్రువుల కళ్ళు గప్పి ట్రాయ్ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తుంది. ​యుద్ధం ముగిసి విజయకేతనం ఎగురవేసిన తర్వాత, ఆడిస్సియస్ తన స్వరాజ్యానికి తిరుగు ప్రయాణం అవుతాడు. కానీ, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ సుదీర్ఘ సముద్ర ప్రయాణంలో ఆడిస్సియస్ బృందానికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. భయంకరమైన సముద్ర తుఫానులు, దారి తప్పిపోవడం, తినడానికి తిండి లేక అల్లాడిపోవడం లాంటి సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి చుట్టుముడతాయి. ఈ జర్నీలో వారికి కొన్ని వింత శక్తులు, గ్రీకు దేవుళ్ళ శాపాలు కూడా ఎదురవుతాయి. మరి ఇన్ని అడ్డంకులను దాటుకుని ఆడిస్సియస్ తన భార్యాపిల్లల దగ్గరికి క్షేమంగా చేరుకున్నాడా? ఈ సుదీర్ఘ పోరాటంలో ఎంతమంది సైనికులను కోల్పోయాడు? దారిలో అతనికి ఎదురైన వింత అనుభవాలు ఏంటి అనేదే ఈ సినిమా వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ. ​విశ్లేషణ: ​ఇండియాలో హాలీవుడ్ సినిమాలకు ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంది. కానీ, ఒక లోకల్ సూపర్ స్టార్ సినిమా వస్తోందంటే ఎలాంటి హంగామా ఉంటుందో, క్రిస్టఫర్ నోలన్ సినిమా వస్తుందంటే ఇక్కడ అంతకంటే ఎక్కువ హైప్ కనిపిస్తుంది. ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్, డార్క్ నైట్, ఆపెన్ హైమర్ లాంటి మాస్టర్ పీస్ లతో మనల్ని మెప్పించిన నోలన్, ఈసారి ఒక మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకుని థియేటర్లకు వచ్చాడు. ఈ సినిమాలో ఎలాంటి భారీ ఫ్రాంచైజీ హంగులు లేకపోయినా, కేవలం నోలన్ అనే పేరుతోనే థియేటర్లు హౌస్ ఫుల్ అయిపోతున్నాయి. నోలన్ ఎంచుకున్న కథ పాతదే అయినా, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం మైండ్ బ్లాక్ చేస్తుంది. సినిమా స్టార్టింగ్ సీన్ నుంచే నోలన్ తన మార్క్ విజువల్స్ తో మనల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్ళిపోతాడు. ముఖ్యంగా ట్రాయ్ యుద్ధం జరిగే సీన్లు, ఆ భారీ కోట సెట్టింగులు చూస్తుంటే ప్రతి రూపాయి స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తోంది. లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఒక రేంజ్ లగ్జరీ లుక్ తెచ్చాయి. ​సినిమాలో మొదటి సగం అంతా ట్రోజన్ హార్స్ ఎపిసోడ్ చుట్టూ తిరుగుతుంది. ఈ ఎపిసోడ్‌ను నోలన్ స్క్రీన్ మీద మలిచిన తీరు అద్భుతం. గుర్రం లోపల సైనికులు దాక్కున్నప్పుడు వచ్చే సీన్లలో హోయ్టే వాన్ హోయ్టేమా కెమెరా యాంగిల్స్ హై ఇచ్చాయి. చీకటి వెలుగుల కాంబినేషన్‌లో, కేవలం చిన్న కాంతి కిరణాల మధ్య సైనికుల ముఖాల్లోని భయాన్ని, గెలిచి తీరాలనే కసిని చూపించిన విధానం అదిరిపోయింది. ఇక్కడ లుడ్విగ్ గోరాన్సన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో కూర్చున్న ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. కేవలం మ్యూజిక్ తోనే కాకుండా, కొన్ని సీన్లలో కంప్లీట్ సైలెన్స్ మెయింటైన్ చేసి టెన్షన్ బిల్డ్ చేయడం నోలన్ స్టైల్. అది ఈ సినిమాలో కూడా పీక్స్ లో వర్కవుట్ అయింది. యుద్ధం ముగిసిన తర్వాత సినిమా టోన్ పూర్తిగా మారిపోతుంది. ఇక్కడి నుంచి సినిమా ఒక యాక్షన్ డ్రామా లాగా కాకుండా, ఒక మనుషుల ఎమోషనల్ జర్నీ లాగా సాగుతుంది. ​మ్యాట్ డామన్ ఆడిస్సియస్ పాత్రలో నటనలో జీవించాడు. ఒక గొప్ప యోధుడిగా ఎంత పవర్‌ఫుల్ గా కనిపించాడో, సముద్రంలో దారి తప్పి సైనికులను కోల్పోతున్నప్పుడు ఒక నిస్సహాయుడైన లీడర్‌గా అతని బాడీ లాంగ్వేజ్, కళ్ళల్లో ఎమోషన్స్ అంతకంటే బాగా పండాయి. ముఖ్యంగా అతని డైలాగ్ డెలివరీ చాలా నాచురల్ గా ఉంటూనే సీన్ తీవ్రతను పెంచింది. రాణి పాత్రలో అనే హతావే తన రాయల్ లుక్‌తో, ఎమోషనల్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంటుంది. టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిన్సన్ తమకు ఇచ్చిన పాత్రల్లో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. రాబర్ట్ ప్యాటిన్సన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న కాసేపైనా గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. నటీనటులందరి నుంచి నోలన్ బెస్ట్ అవుట్‌పుట్ రాబట్టుకున్నాడు. ప్రతి ఒక్కరి కాస్ట్యూమ్స్, మేకప్ కూడా ఆ కాలం నాటి మనుషులను చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. ​సినిమా సెకండాఫ్‌లో ఆడిస్సియస్ బృందం ఎదుర్కొనే సవాళ్లు విజువల్ గా ఒక జాతరలా ఉంటాయి. ఒక భారీ గుహలో విచిత్రమైన, రాక్షస ఆకారానికి దొరికిపోయినప్పుడు వచ్చే థ్రిల్లింగ్ ఎపిసోడ్ లో గ్రాఫిక్స్, ఆర్ట్ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఆ గుహ సెట్ డిజైన్, అక్కడ వాడిన డార్క్ కలర్ ప్యాలెట్ సీన్ కు కావాల్సిన భయాన్ని క్రియేట్ చేశాయి. ఆ తర్వాత ఒక మాయల లేడీ (విచ్) ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను బాగా థ్రిల్ చేస్తుంది. ఈ సీన్లలో ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది. కథ ఎక్కడా కట్ అయినట్టు కాకుండా, ఒక సీన్ నుంచి ఇంకో సీన్ కు ట్రాన్సిషన్ చాలా స్మూత్ గా సాగిపోతుంది. మన కమర్షియల్ సినిమాల తరహాలో క్లైమాక్స్ లో వచ్చే హీరో ఎలివేషన్ సీన్ అయితే మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది. ఆ వెంటనే వచ్చే యాక్షన్ బ్లాక్ చూసి థియేటర్లలో ప్రేక్షకులు వారెవా అనాల్సిందే. ​అయితే, ఈ సినిమా అందరికీ ఒకేలా నచ్చకపోవచ్చు. సినిమా నరేషన్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా మధ్యలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్లు సహనాన్ని పరీక్షిస్తాయి. గ్రీకు పురాణాలు, వారి దేవుళ్ళ శాపాల గురించి ఐడియా లేని వాళ్లకు కొన్ని చోట్ల క్యారెక్టర్ల ప్రవర్తన చిత్రంగా అనిపించి గందరగోళం తలెత్తే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సినిమా చూసే ముందు కథా నేపథ్యం గురించి కొంచెం తెలుసుకుని వెళ్తే ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల వల్ల వచ్చే నష్టాలను, బాధలను ఈ సినిమా ద్వారా నోలన్ చాలా సున్నితంగా చూపించాడు. కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా, సినిమా చివర్లో ఇచ్చే మెసేజ్, ఎమోషనల్ పే ఆఫ్ ప్రేక్షకుడి గుండెను తాకుతుంది. ఆ ఎమోషన్ కు కనెక్ట్ అయిన వాళ్లకు ‘ది ఆడిస్సీ’ ఒక లైఫ్ టైమ్ మెమరబుల్ మూవీగా మిగిలిపోతుంది. ​ప్లస్ పాయింట్స్ : ​మ్యాట్ డామన్ అద్భుత నటన. ​మైండ్ బ్లోయింగ్ విజువల్స్. ​లుడ్విగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ​క్లైమాక్స్ ఎలివేషన్ సీన్స్. ​మైనస్ పాయింట్స్: ​నెమ్మదిగా సాగే నరేషన్. ​కొన్ని బోర్ సీన్లు. ​పాత్రల చిత్రమైన ప్రవర్తన. ​ఫైనల్ వర్డ్ : ​క్రిస్టఫర్ నోలన్ మార్క్ విజువల్స్, అద్భుతమైన ఎమోషన్స్ ఇష్టపడే వాళ్ళు థియేటర్లలో అస్సలు మిస్ అవ్వకూడని ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ 'ది ఆడిస్సీ'. ​SkyC Rating: 3.25/5
By Venkat Reddy — 17 July 2026