టాటా సన్స్ కొత్త ఛైర్మన్ ఎంపికలో బిగ్ అప్‌డేట్..!

టాటా సన్స్ నూతన ఛైర్మన్ ఎంపికలో ఎస్‌ఆర్‌టీటీపై ఆంక్షలు అడ్డంకిగా మారాయి. చంద్రశేఖరన్ నిష్క్రమణ వేళ టాటా ట్రస్ట్స్ అత్యవసరంగా న్యాయ మార్గాన్ని ఆశ్రయిస్తున్నాయి.

టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ మధ్య మొదలైంది. ప్రస్తుత ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తన పదవీకాలం ముగిశాక కొనసాగడానికి ఆసక్తి చూపలేదు. దీనితో కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం టాటా ట్రస్ట్స్ వేగంగా చర్యలు ప్రారంభించింది. అయితే సర్ రతన్ టాటా ట్రస్ట్ (ఎస్‌ఆర్‌టీటీ)పై మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ విధించిన ఆంక్షలు ఈ ప్రక్రియకు పెద్ద ప్రతిబంధకంగా మారాయి. ఎన్. చంద్రశేఖరన్ తన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగుస్తుండటంతో మరోసారి పోటీ పడబోనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆయన ఆగస్టు 12న టాటా సన్స్ బోర్డుతో పాటు ట్రస్ట్స్ నామినీ డైరెక్టర్లకు ఇమెయిల్ ద్వారా వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (ఎస్‌డీటీటీ) ఎంపిక కమిటీ ఏర్పాటుకు తక్షణమే తీర్మానం చేసింది. చంద్రశేఖరన్ అందించిన సేవలను టాటా ట్రస్ట్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా కొనియాడారు. టాటా సన్స్ నియమావళిలోని ఆర్టికల్ 118 ప్రకారం ఐదుగురు సభ్యుల ఎంపిక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎస్‌డీటీటీ, ఎస్‌ఆర్‌టీటీ సంయుక్తంగా ముగ్గురు సభ్యులను కమిటీకి నామినేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు టాటా సన్స్ బోర్డు ఒకరిని, మరొక స్వతంత్ర సభ్యుడిని నియమిస్తుంది. ప్రస్తుతం టాటా సన్స్‌లో ఈ రెండు ప్రధాన ట్రస్టులకు 51 శాతం కంటే ఎక్కువ వాటా ఉంది. మొత్తం టాటా ట్రస్ట్స్‌కు సుమారు 66 శాతం వాటా ఉన్నప్పటికీ, ఎస్‌ఆర్‌టీటీపై ఆంక్షల వల్ల సంయుక్త నామినేషన్ నిలిచిపోయింది. ఈ ఆంక్షల నేపథ్యాన్ని పరిశీలిస్తే, 2025లో మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ చట్టానికి కొన్ని సవరణలు చేశారు. పర్పెచువల్ ట్రస్టీల సంఖ్య మొత్తం ట్రస్టీలలో నాలుగో వంతు మించకూడదనే నిబంధనను తీసుకువచ్చారు. ఎస్‌ఆర్‌టీటీలోని 6 గురు ట్రస్టీలలో 3 గురు జీవితకాల ట్రస్టీలుగా ఉండటంతో ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఫలితంగా మే 2026లో ఛారిటీ కమిషనర్ ఎస్‌ఆర్‌టీటీ సమావేశాలు, నిర్ణయాలపై ఆంక్షలు విధించారు. ఈ కారణంతోనే గురువారం నాటి ట్రస్ట్స్ సమావేశానికి ఎస్‌ఆర్‌టీటీ హాజరుకాలేదు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన టాటా ట్రస్ట్స్ అత్యవసరంగా న్యాయపరమైన పరిష్కారం కోరాలని నిర్ణయించాయి. ముందుగా మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద అత్యవసర విచారణ కోరి ఆంక్షలను ఎత్తివేసేలా ఒత్తిడి తెస్తున్నాయి. అక్కడ ఉపశమనం లభించని పక్షంలో బాంబే హైకోర్టును ఆశ్రయించడానికి ట్రస్టీల బృందం సమాయత్తమవుతోంది. నోయెల్ టాటా, వేణు శ్రీనివాసన్, డారియస్ ఖంబాటా, విజయ్ సింగ్ ఈ న్యాయపోరాట దిశగా అడుగులు వేస్తున్నారు. ఆగస్టు 18న టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. ఏజీఎం నిర్వహణకు రెండు ట్రస్టుల సంయుక్త ప్రతినిధి హాజరుకావడం కోరం కోసం అత్యంత అవసరం. ఎస్‌ఆర్‌టీటీ భాగస్వామ్యం లేకపోతే కోరం కొరతతో ఏజీఎం వాయిదా పడే ప్రమాదం ఉంది. చంద్రశేఖరన్ 2017 నుంచి గ్రూప్ పురోగతిలో కీలక పాత్ర పోషించినప్పటికీ, విధానపరమైన విభేదాల వల్ల తప్పుకుంటున్నారు. ఇప్పుడు నూతన ఛైర్మన్ ఎంపిక మరియు ట్రస్ట్స్ పాలనా సంక్షోభం త్వరితగతిన తేలాల్సి ఉంది.
By V Sudhakar — 14 August 2026