తమిళనాడు సీఎం విజయ్ భార్య సంగీత తన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు కేసును క్లోజ్ చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్ భార్య సంగీత సోర్నలింగం తన విడాకుల పిటిషన్‌ను అధికారికంగా ఉపసంహరించుకున్నారు. శుక్రవారం చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో జరిగిన విచారణలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. సంగీత వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టుకు హాజరై, పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయమూర్తికి తెలిపారు. జడ్జి సుజాత సుమారు 15 నిమిషాల పాటు విచారించిన అనంతరం ఈ విజ్ఞప్తిని ఆమోదిస్తూ కేసును ముగించారు. దీంతో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న చట్టపరమైన వివాదానికి అధికారికంగా తెరపడింది. 2026 ఫిబ్రవరిలో సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ప్రత్యేక వివాహ చట్టం 1954 కింద విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్‌లో 2021 నుంచి మానసిక క్రూరత్వం, నిర్లక్ష్యం ఎదురయ్యాయని ఆరోపించారు. వివాహ బంధం కోలుకోలేని విధంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. 1998లో యూకేలో వివాహం నమోదు చేసుకున్న ఈ జంట, 1999లో చెన్నైలో వేడుక జరుపుకున్నారు. దాదాపు 27 ఏళ్ల ఈ బంధంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో జూన్ 15న విచారణ జరిగి తదుపరి ప్రక్రియ ఆగస్టు 7కు వాయిదా పడింది. ఇరుపక్షాలు విచారణకు హాజరుకాకపోవడంతో ప్రక్రియ ఆలస్యమైంది. ఇదిలా ఉండగా చెంగల్పట్టు కోర్టులో సంగీత నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై కేసును వెనక్కి తీసుకున్నారు. విజయ్ తరఫు న్యాయవాదులు దీనిపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఫలితంగా కోర్టు ఈ పిటిషన్‌ను విత్‌డ్రా చేసినట్లు నమోదు చేసి కేసును కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కోర్టు బయట రాజీ కుదిరిందనే వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. కుమారుడు జాసన్ సంజయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తండ్రి గురించి సానుకూలంగా మాట్లాడటం కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. అయితే కోర్టు సంగీతకు భవిష్యత్తులో అవసరమైతే మళ్లీ పిటిషన్ దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. విజయ్ రాజకీయం, వ్యక్తిగత జీవితం రెండూ చర్చనీయాంశంగా ఉన్న వేళ ఈ నిర్ణయం వెలువడింది. విజయ్ టీవీకే అధ్యక్షుడిగా ఉంటూ ఇటీవల ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఈ కీలక పరిణామంతో విజయ్ దంపతుల వివాహ బంధంపై నడుస్తున్న న్యాయపోరాటం తాత్కాలికంగా ముగిసింది. చట్టపరమైన రికార్డుల ప్రకారం పిటిషన్ ఉపసంహరణ పూర్తి కాగా, వీరి భవిష్యత్తు సంబంధాలపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక వర్గాలు మాత్రం కేసు డిస్పోజ్ అయినట్లు ధృవీకరించాయి.