కేంద్రం క్లియరెన్స్ నిరాకరణ.. రేవంత్ అమెరికా టూర్ రద్దు!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. కేంద్ర అనుమతి నిరాకరించడంతో లండన్ నుంచి ఆగస్టు 23న రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక అమెరికా పర్యటన హఠాత్తుగా రద్దయింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ యాంగిల్‌లో క్లియరెన్స్ నిరాకరించడంతో విదేశీ టూర్‌లోని యూఎస్ భాగాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. విదేశాంగ శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో యూకే షెడ్యూల్ మాత్రమే కొనసాగనుంది. ఆగస్టు 20న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి లండన్ చేరుకుని ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అసలు షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 20 నుంచి 30 వరకు పది రోజుల పాటు యూకే, యూఎస్ లలో ఆయన పర్యటించాల్సి ఉంది. అమెరికాలో బోస్టన్, హార్వర్డ్, ఎంఐటీ, నార్త్‌ఈస్టర్న్, వర్జీనియా టెక్ వంటి ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను సందర్శించడంతో పాటు న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సీఎం పాల్గొనాల్సి ఉండింది. అమెరికా పర్యటన రద్దు కావడంతో ఆగస్టు 23న సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. దీంతో ఆయన అధికారులను నేరుగా యూఎస్‌కు పంపించి, ముందుగా అనుకున్న ఒప్పందాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఫలితంగా హార్వర్డ్, ఎంఐటీ వంటి అంతర్జాతీయ సంస్థలతో అవగాహన ఒప్పందాలు, భాగస్వామ్యాల ప్రక్రియను అధికారులు ముందుకు తీసుకెళ్లనున్నారు. ఈ పరిణామంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ కేంద్ర నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణను, హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ హబ్‌గా మార్చడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు గురించి ఆలోచించాలని పేర్కొంటూ రైజింగ్ తెలంగాణ ఆగదని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయ కారణాలతోనే పర్యటనకు అనుమతి నిరాకరించిందని సీఎం ఆరోపించారు. అయినప్పటికీ యూకేలోని ఆక్స్ ఫర్డ్ బ్లావత్నిక్ స్కూల్, కేంబ్రిడ్జ్, లండన్ బిజినెస్ స్కూల్ వంటి సంస్థల సందర్శన షెడ్యూల్డ్ ప్రోగ్రామ్‌లు యథాతథంగా కొనసాగుతాయి. విదేశీ విద్యా సంస్థలను రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రక్రియ ఆగదని, తెలంగాణ అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందని సీఎం వెల్లడించారు. అధికారుల బృందం ద్వారా అమెరికా ఒప్పందాలు అనుకున్న విధంగానే ముగుస్తాయని స్పష్టం చేశారు. 2026 నాటికి తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే తమ ప్రాధాన్యమని సీఎం పునరుద్ఘాటించారు.
By Bhavani E — 21 August 2026