పెద్ది షూటింగ్‌లో గాయం.. రేపే రామ్ చరణ్‌కు శస్త్రచికిత్స!

రామ్ చరణ్ మణికట్టు శస్త్రచికిత్స కోసం కోయంబత్తూర్ వెళ్లారు. పెద్ది షూటింగ్ లో గాయం కాగా, పూర్తి కోలుకున్నాకే సుకుమార్ సినిమా ప్రారంభం కానుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శస్త్రచికిత్స కోసం కోయంబత్తూర్ చేరుకున్నారు. పెద్ది సినిమా చిత్రీకరణలో భాగంగా తీవ్రమైన కుస్తీ సన్నివేశాలు తీస్తుండగా ఆయన మణికట్టు కాటిలేజ్ చిరిగి ఎముకకు తీవ్ర గాయమైంది. వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయాలని సూచించినప్పటికీ కొన్ని కారణాల వల్ల కొద్ది వారాల పాటు వాయిదా పడుతూ వచ్చింది. చివరకు శస్త్రచికిత్స కోసం మెగా కుటుంబం శనివారం నాడు ప్రత్యేక విమానంలో కోయంబత్తూర్ బయలుదేరి వెళ్లింది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ మరియు ఉపాసన కలసి హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుండి ప్రయాణమయ్యారు. రేపు కోయంబత్తూర్ లోని ప్రముఖ ఆసుపత్రిలో రామ్ చరణ్ కు శస్త్రచికిత్స జరగనుంది. దీంతో రామ్ చరణ్ రాబోయే కొన్ని వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఆర్సి17 ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుకుమార్ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి ప్రీ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమయ్యారు. ఫలితంగా రామ్ చరణ్ పూర్తి ఆరోగ్యంతో కోలుకున్న తర్వాత మాత్రమే సుకుమార్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా తన తదుపరి చిత్రం షూటింగ్ కు చిన్న విరామం ప్రకటించారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఆయన తన కుమారుడి శస్త్రచికిత్స కోసం సమయం కేటాయించారు. ప్రస్తుతం రామ్ చరణ్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత వైద్యుల పర్యవేక్షణలో కొన్ని వారాల పాటు విశ్రాంతి ముగిసాకే ఆయన మళ్లీ కెమెరా ముందుకు రానున్నారు.
By Bhavani E — 26 July 2026