చైనా ఓపెన్ 2026లో పీవీ సింధు శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ఉన్నతి హుడాపై గెలిచి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్ళింది. ఆయుష్ శెట్టి సంచలన విజయం నమోదు చేశాడు.
చైనా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. చైనా వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లోనే భారత ఆటగాళ్లు ముఖాముఖి తలపడ్డారు. ఈ ఉత్కంఠభరిత పోరులో తోటి భారత క్రీడాకారిణి ఉన్నతి హుడాపై సింధు విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల జపాన్ ఓపెన్ టైటిల్ సాధించిన సింధు, అదే ఫామ్‌ను ఈ టోర్నీలోనూ కొనసాగిస్తూ విజయోత్సహంతో ముందుకు సాగుతోంది. గత కొన్ని టోర్నీలుగా వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న పీవీ సింధుకు తొలి రౌండ్‌లోనే యువ క్రీడాకారిణి ఉన్నతి నుంచి గట్టి పోటీ ఎదురైంది. మైదానంలో సుమారు 56 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఇద్దరు ఆటగాళ్లు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. ఈ లీగ్ మ్యాచులో సింధు తన అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించి 21-14, 9-21, 21-10 తేడాతో విజయాన్ని ఖాయం చేసుకుంది. టోర్నీ ఆరంభంలోనే పీవీ సింధు పూర్తి ఆధిక్యంతో తొలి గేమ్‌ను చాలా సులువుగా చేజిక్కించుకుంది. దీంతో ఉన్నతిపై ఒత్తిడి పెరిగినప్పటికీ, రెండో గేమ్‌లో పుంజుకున్న ఉన్నతి అద్భుతమైన షాట్లతో పునరాగమనం చేసింది. ఇదిలా ఉండగా రెండో గేమ్‌ను ఉన్నతి ఏకపక్షంగా తన ఖాతాలో వేసుకోవడంతో మ్యాచ్ మూడో గేమ్‌కు దారితీసింది. అత్యంత కీలకంగా మారిన నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు తన సుదీర్ఘ అనుభవాన్ని రంగరించి ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. ఫలితంగా మూడో గేమ్‌ను సునాయాసంగా గెలుచుకున్న సింధు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు చెందిన ఆయుష్ శెట్టి సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ప్రపంచ 11వ ర్యాంకర్ అల్వి ఫర్హాన్‌పై 21-17, 5-21, 21-17 తేడాతో విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఈ టోర్నీలో ఆయుష్ సాధించిన విజయం అతిపెద్ద సంచలనాల్లో ఒకటిగా నిలిచింది. మరోవైపు డబుల్స్ విభాగంలో భారత జోడీలకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఎంఆర్ అర్జున్-హరిహరన్ జంటతో పాటు రోహన్ కపూర్-రుత్విక్ శివాని మరియు ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీలు తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాయి. పురుషుల, మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లలో ఓడిపోవడంతో వీరు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.