PFC లోకి REC చేరిక.. రంగంలోకి దిగిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము!
ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల విలీనానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. PFC లో REC విలీనంతో రూ. 17 లక్షల కోట్ల రుణ పుస్తకంతో అతిపెద్ద విద్యుత్ సంస్థల విలీనం సాకారం కానుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను సమీకరించి, వాటి ఆపరేషనల్ సామర్థ్యం పెంచే దిశగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) లో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) విలీనానికి కీలక ముందడుగు పడింది. ఈ ప్రతిపాదనకు జూన్ 10,న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా దేశంలోనే అత్యంత భారీ స్థాయి విద్యుత్ రంగ ఫైనాన్సింగ్ దిగ్గజం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ విలీన నిర్ణయం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 2026 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన పబ్లిక్ సెక్టర్ NBFCల పునర్వ్యవస్థీకరణ వ్యూహంలో భాగం. దీని ద్వారా సంస్థల సామర్థ్యం పెంచి, ఆపరేషనల్ ఖర్చులు తగ్గించి, విద్యుత్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు బలమైన ఫైనాన్సింగ్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజానికి PFC సంస్థ ఇప్పటికే 2019 లో రూ. 14,500 కోట్లకు REC లోని 52.63% ప్రభుత్వ వాటాను కొనుగోలు చేసి అనుబంధ సంస్థగా మార్చుకుంది. ఈ నేపథ్యంలో తాజా పూర్తి విలీనంతో REC ఇకపై స్వతంత్ర సంస్థగా కొనసాగదని స్పష్టమైంది. అంతకుముందు మే 16, 2026 న జరిగిన PFC బోర్డు సమావేశంలో REC విలీన ప్రతిపాదనను ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేశారు. కంపెనీస్ యాక్ట్ 2013 లోని సెక్షన్లు 230-232 ప్రకారం ఈ విలీన ప్రక్రియ అధికారికంగా జరగనుంది. ఈ ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే పూర్తి బాధ్యతలను PFC చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పర్మిందర్ చోప్రాకు అప్పగించారు. దీని ప్రకారం REC కి చెందిన ఆస్తులు, అప్పులు, సమస్త బాధ్యతలు అన్నీ కూడా PFC సంస్థకు బదిలీ కానున్నాయి. ఈ విలీనం ద్వారా ఏర్పడే ఉమ్మడి సంస్థ రుణాల పుస్తకం సుమారు రూ. 17 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. 2025 డిసెంబర్ నాటి లెక్కల ప్రకారం PFC రుణాలు రూ. 11.5 లక్షల కోట్లు, REC రుణాలు రూ. 5.8 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది భారతదేశంలో విద్యుత్ రంగ ఫైనాన్సింగ్‌లో ఒక భారీ స్థాయి సామర్థ్యం కలిగిన దిగ్గజ సంస్థగా నిలవనుంది. దీంతో రిన్యూవబుల్ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ వంటి కీలక రంగాలలో పెద్ద ఎత్తున ఫండింగ్ చేయడానికి వీలు కలుగుతుంది. ప్రభుత్వం PFC లో మెజారిటీ వాటా అంటే 51% కంటే ఎక్కువగా నిలుపుకోవడానికి కొత్త షేర్లు జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం PFC లో ప్రభుత్వానికి 56% వాటా, REC లో 52.6% వాటా కలిగి ఉన్నాయి. విలీనం తర్వాత షేర్ స్వాప్ రేషియోను వాల్యూయేషన్ ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ డ్యూప్లికేషన్ తగ్గింపు మరియు మెరుగైన బ్యాలెన్స్ షీట్ ద్వారా ఫండ్ రైజింగ్ సామర్థ్యం పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీలు దీనిని స్వాగతించాయి. ఇదిలా ఉండగా ఈ విలీనానికి SEBI, RBI, స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌ల క్లియరెన్సులు మరియు షేర్‌హోల్డర్ల ఆమోదాలు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ మొత్తం ప్రక్రియను రాబోయే 2027 ఏప్రిల్ 1 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వార్తల ప్రభావంతో జూన్ 10న రెండు కంపెనీల షేర్లు మార్కెట్లో కొంతవరకు పతనమయ్యాయి. అయినప్పటికీ దేశ రిన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యాలను సాధించడంలో దీర్ఘకాలికంగా ఈ విలీనం సానుకూల ప్రభావం చూపుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.