రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వచ్చిన రూటెడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' ఎలా ఉంది? పూర్తి రివ్యూ మీకోసం.
సినిమా పేరు: పెద్ది (Peddi) నటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, రావు రమేష్, దివ్యేందు శర్మ, సత్య తదితరులు. దర్శకత్వం: బుచ్చిబాబు సానా సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు ఎడిటింగ్: నవీన్ నూలి / ఆంటోనీ ఎల్. రూబెన్ నిర్మాత: వెంకట సతీష్ కిలారు నిర్మాణ సంస్థ: వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కథ : విజయనగరం జిల్లా కొండల కింద ఉండే ఒక చిన్న పల్లెటూరు చుట్టూ తిరిగే కథ ఇది. అసలు ఆ ఊరికి మ్యాప్‌లో ఒక పేరంటూ లేదు, కనీసం అక్కడ బతికే జనాలకి ప్రభుత్వ రికార్డుల్లో ఎలాంటి గుర్తింపు లేదు. కనీస గుర్తింపు పత్రాలు లేకపోవడంతో, ఆ ఊరి జనాలు బతకడం కోసం రోజువారీ కూలీలుగా కొండల గుండా చాలా ప్రమాదకరమైన దారిలో నడిచి వేరే ప్రాంతానికి వెళ్తుంటారు. అంత ప్రాణాలకు తెగించి కొండలు దాటి వెళ్లినా, సమాజం వాళ్లని ఎప్పుడూ చిన్నచూపే చూస్తుంది. చేసే కష్టానికి సగం జీతమే ఇచ్చి అవమానించి పంపిస్తుంటారు. తమ ఊరి మీదుగా వెళ్లే రైలు అక్కడ ఆగడానికి ఒక రైల్వే స్టేషన్ వస్తే తమ బతుకులు మారతాయని, ఈ నరకం తప్పుతుందని పెద్ది తండ్రి అప్పల సూరి ఏకంగా ముప్పై ఏళ్లుగా నిరంతరం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పోరాడుతుంటాడు. కానీ వ్యవస్థతో పోరాడే ఆ ప్రయత్నంలోనే అతను ఒకరోజు అదే రైల్వే ట్రాక్ మీద ప్రాణాలు కోల్పోతాడు. తండ్రి ప్రాణం పోయినా ఊరి జనం కష్టం తీరదు. అప్పల సూరి కొడుకు పెద్ది మొదట్లో కేవలం ఆర్థిక అవసరాల కోసం లోకల్ బెట్టింగ్ మ్యాచ్‌లలో డబ్బుల కోసం ఆడే ఒక ఆట కూలీ. లోకల్ బెల్లం బట్టీలో పని చేస్తూ, ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా వేలంలో తనను పాడుకుంటే వెళ్లి సిక్సర్ల మోత మోగించడం అతని స్పెషాలిటీ. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టడం అతని నైజం. అయితే తండ్రి అకస్మాత్తుగా చనిపోవడం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ సీన్‌లో తమ ఊరి జనాలకి కనీస గుర్తింపు లేదనే నిజం కళ్లముందు కనిపించడంతో పెద్ది మనసు పూర్తిగా మారిపోతుంది. తన ఊరి ఆత్మగౌరవం కోసం, తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం కోసం తనకు బాగా వచ్చిన క్రికెట్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి కుస్తీ మట్టి గోదాలోకి అడుగుపెడతాడు. ఒక సాధారణ లోకల్ ఆట కూలీ, నేషనల్ లెవెల్ రెజ్లింగ్ రింగ్ వరకు ఎలా ఎదిగాడు? తన సరికొత్త ఆట ద్వారా దేశం మొత్తం తన ఊరి వైపు చూసేలా ఎలా చేశాడు? అనేదే 'పెద్ది' మెయిన్ పాయింట్. విశ్లేషణ : తెలుగు సినిమాలో స్పోర్ట్స్ డ్రామాలు రావడం కొత్తేమీ కాదు, కానీ ఒక కమర్షియల్ స్టార్ హీరోని పెట్టి రూటెడ్ పల్లెటూరి ఎమోషన్‌ను దానికి ముడిపెట్టడం నిజంగానే ఒక పెద్ద సాహసం. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈసారి కేవలం ఒక ఆట చుట్టూ తిరిగే కథను కాకుండా, గుండెల్ని పిండేసే ఒక ప్యూర్ సోషల్ ఎమోషన్‌ను ఎంచుకుని సగం విజయం సాధించాడు. సినిమాకు ముందు నుంచీ అన్నీ కలిసొచ్చేశాయి, ముఖ్యంగా ప్రమోషన్స్ లో వదిలిన గ్లింప్స్, టీజర్ రెండూ జనాలకి తెగ నచ్చేశాయి. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ట్రైలర్ చూశాక కొంచెం మిక్స్డ్ టాక్ వినిపించినా, వెండితెరపై రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆ మ్యాజిక్ ని ఎలా చేస్తుందనే ఆసక్తి అందరిలోనూ బలంగానే ఉంది. ఈ వేసవి సీజన్ ని 'పెద్ది' తన ఒంటిచేత్తో గట్టెక్కిస్తుందని చిత్రసీమ కూడా బలంగా నమ్మింది, సినిమా చూస్తున్నంత సేపు ఆ అంచనాలు నిజమేననిపిస్తుంది. సినిమా ఓపెనింగ్ లోనే ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో, బొమన్ ఇరానీ అసలు పెద్ది ఎవరు అని వెతుక్కుంటూ రావడం రొటీన్ ఫార్మాట్ లోనే ఉన్నా, కథను ముందుకెళ్లే విధానం ఆడియన్స్‌ని కట్టిపడేస్తుంది. స్టార్టింగ్ సీన్స్ లోనే జగపతి బాబు ఇంట్రడక్షన్ తో ఆ ఊరి జనాలు పడే కష్టాలు, కూలీ పని కోసం కొండల గుండా ప్రమాదకరమైన దారుల్లో నడిచి వెళ్లే విజువల్స్ చూపిస్తున్నప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత రిచ్ గా ఉన్నాయో అర్థమవుతుంది. నిర్మాతలు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆర్. రత్నవేలు కెమెరా వర్క్ ఆ కొండ దారుల సీన్స్ లో లో-యాంగిల్, వైడ్ షాట్స్ తో కెమెరా యాంగిల్స్ హై ఇచ్చాయి. రామ్ చరణ్ స్టార్టింగ్ లో లోకల్ పందాల్లో పైసల కోసం 'ఆట కూలీ'గా క్రికెట్ ఆడడం సిక్సర్లు కొట్టడం పైసా వసూల్ అనిపిస్తాయి. ఆ తర్వాత వచ్చే 'రై రై రారా' పాట కూడా బాగుంది. ఆ లోకల్ గ్రౌండ్స్, చరణ్ వాడిన మాస్ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా కుదిరాయి."మళ్ళీ పుడతామా ఏంటి" అని చరణ్ పలికే డైలాగ్ లోనే సినిమా సోల్ అంతా ఉంది. అయితే ఆ తర్వాత కథ నార్మల్ కమర్షియల్ ఫార్మాట్ లోకి షిఫ్ట్ అయి, ఫస్ట్ హాఫ్ లో వచ్చే జాన్వీ కపూర్ ట్రాక్ అంతగా వర్కవుట్ అవ్వలేదు. అసలు కథకు ఏమాత్రం సంబంధం లేకుండా సాగే ఈ ట్రాక్ లో జాన్వీ కపూర్ పాత్ర చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. పైట అందాలు చూపించడానికే తీసుకున్నట్టు అనిపిస్తుంది. లవ్ ట్రాక్ లో వచ్చే సాంగ్స్ వినడానికి బాగున్నా, స్క్రీన్ మీద కథను స్లో చేశాయి. ఒక రూటెడ్ అండ్ సిన్సియర్ కథలో ఈ కమర్షియల్ మాస్ మసాలా టెంప్లేట్ ఎమోషన్‌ను కాస్త డైల్యూట్ చేసింది. పైగా ఈ స్పోర్ట్స్ బ్లాక్స్ లో వచ్చే క్రికెట్ మ్యాచ్‌లు ఆశించిన స్థాయిలో ఎమోషనల్ హైస్ ఇవ్వలేకపోయాయి. జగపతి బాబు పాత్రలో మెలోడ్రామా కొంత ఓవర్ డోస్ అయినట్టు అనిపించినా, నటుడిగా ఆయన తన అనుభవంతో ఆ సీన్లను నిలబెట్టారు. కానీ ప్రీ-ఇంటర్వెల్ లో ఊరి కోసం పోరాడుతూ జగపతి బాబు చనిపోయే సీన్, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో తమకు గుర్తింపు లేదన్న విషయాన్ని చరణ్ ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యే బ్లాక్ థియేటర్ లో అందరినీ కదిలిస్తుంది. చరణ్ కళ్ళల్లో కనిపించే పగ, బాధ ఆ సీన్‌ని పక్కాగా కమర్షియల్ మీటర్ లో కూర్చోబెట్టాయి. చరణ్ మాస్ నటన, పాటలతో మరియు జగపతి బాబు ఎమోషనల్ ట్రాక్ తో ఫస్ట్ హాఫ్ మంచి ఇంప్రెషన్ తో ముగుస్తుంది. సెకండ్ హాఫ్ మొదలవడమే ఆ ఆట కూలీ క్రికెట్ పనిని పక్కన పెట్టేసి కుస్తీ వైపు షిఫ్ట్ అయ్యే స్టైలిష్ రెజ్లింగ్ సీన్స్ తో చాలా గ్రాండ్ గా స్టార్ట్ అవుతుంది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ సీక్వెన్స్ లో చరణ్ బాడీ లాంగ్వేజ్, ఆ ఇంటెన్సిటీ చూస్తే నటనలో జీవించాడు అని చెప్పక తప్పదు. క్యారెక్టర్ కోసం ఆయన బాడీని మార్చుకున్న విధానం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. శివరాజ్ కుమార్ దగ్గర కుస్తీ నేర్చుకునే సీన్స్, ఆ మట్టి గోదా కలర్ ప్యాలెట్ ఆర్ట్ డైరెక్టర్ వర్క్‌ని ఎలివేట్ చేశాయి. కేవలం పైసల కోసం ఆడిన కుర్రాడు, గుర్తింపు లేని తన ఊరి జనం కోసం ఒక ఇంటెన్స్ రెజ్లర్ గా మారే సీన్ లో చరణ్ కళ్ళల్లో ఇంటెన్సిటీ అదిరిపోయింది. రెగ్యులర్ ఫైట్స్ మధ్య ఇలాంటి కుస్తీ పోటీలు రావడం కచ్చితంగా పైసా వసూల్ మూమెంట్ అని చెప్పాలి. కాకపోతే సెకండాఫ్ మొదట్లో కూడా కథనం కాస్త రొటీన్ స్టైల్ లోనే సాగుతుంది. పైగా నేషనల్స్ కి వెళ్ళే ముందు వచ్చే ఒక స్పెషల్ నంబర్ కథకి స్పీడ్ బ్రేకర్ లా అనిపిస్తుంది. జానీ మాస్టర్ వేయించిన స్టెప్పులు కూడా పెద్దగా కంటికి ఆనలేదు. కథనంలో బలం తగ్గినా, ఏ.ఆర్. రెహమాన్ మాత్రం తన పాటలు మరియు కీలక సీన్స్ లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో సినిమాను బాగానే హోల్డ్ చేశారు. అయితే కుస్తీ పోటీల్లో పెద్దికి తగిలే ఒక పెద్ద ఎదురుదెబ్బతో కథలో రన్నింగ్ అనే మరో ఎలిమెంట్ వచ్చి ప్రీ-క్లైమాక్స్ లో కథ మరింత రసవత్తరంగా మారుతుంది. ఆసుపత్రి సీన్ లో చరణ్ నటన నిజంగానే పండింది. కమర్షియల్ హీరోలు ఇలాంటి సీన్లు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు, కానీ చరణ్ మాత్రం చాలా కసిగా, ధైర్యంగా చేసేశాడు. మొత్తం సినిమాలో చరణ్ నటనకు ఎక్కువ మార్కులు పడేది ఇక్కడే.అవార్డ్ వచ్చినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. మరోవైపు సినిమాలో కొన్ని లాజిక్ లోపాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. అంతర్జాతీయ స్థాయి టోర్నీలలో ఆడటం అంత ఈజీనా అన్నట్టు పెద్ది ప్రతి టోర్నీలోకి చాలా సులువుగా వెళ్లిపోతుంటాడు, అందుకోసం అతను పడే ట్రైనింగ్ కష్టాన్ని దర్శకుడు పెద్దగా చూపించలేదు. అలాగే బొమన్ ఇరానీ స్పోర్ట్స్ అకాడమీ ప్రెసిడెంట్ లాంటి పెద్ద పాత్రలో కనిపించినా, అతనికి నేషనల్ లెవెల్ లో ఆడుతున్న పెద్ది గురించి ముందే తెలియకపోవడం వింతగా ఉంటుంది. పైగా అతను పెద్ది ఊరికి నడుచుకుంటూ వచ్చే సీన్ లో ఆ బాట మరీ కష్టంగా ఉంటుంది. అంటే పెద్ది లక్ష్యం ఆ ఊరిలో ట్రైన్ ఆపడం ఒక్కటేనా, రోడ్లు సరిగా లేకపోయినా ఓకేనా అనే లాజిక్ కొడుతుంది. సినిమాలో శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ లాంటి పెద్ద నటులు ఉన్నా కూడా వాళ్ళ క్యారెక్టర్స్ అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ తొలి సన్నివేశాల్లో తప్ప తర్వాత ఎక్కడా కనిపించడు, అతని పాత్ర పూర్తిగా వేస్ట్ అయిపోయింది. కానీ లాస్ట్ 45 నిమిషాలు మాత్రం సినిమా ఇంకో లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఢిల్లీ ఎపిసోడ్ లో ఎమోషన్ చాలా ఫోకస్డ్ గా సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో పెద్ది తీసుకునే ఆ షాకింగ్ నిర్ణయం, అది తెచ్చే షాక్ వాల్యూ థియేటర్ లో ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఒక స్టార్ హీరో సినిమాలో ఇలాంటి ఎండ్ ఊహించనిది, అది గుండెల్ని పిండేస్తుంది. క్లైమాక్స్ లో దేశం మొత్తం ఆ ఊరి వైపు చూసి, రైలు ఊళ్లో ఆగే సీన్ లో డైలాగ్ డెలివరీలో చరణ్ చూపించిన మెచ్యూరిటీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. ఆ లాస్ట్ షాట్ ఇచ్చిన ఇంపాక్ట్ తో ఆడియన్స్ అందరూ ఒక మంచి ఎమోషనల్ శాటిస్ఫాక్షన్‌తో బయటకు వస్తారు. ఈ సినిమాలో ప్రత్యేకించి విలన్ అంటూ ఎవరూ ఉండరు, పరిస్థితులు మరియు ఊరి సమస్యే విలన్లుగా కనిపిస్తాయి. మొదటి సగం రొటీన్ మాస్ టెంప్లేట్ తో కాస్త నిరాశపరిచినా, చివరి ఒక గంటలో వచ్చే పవర్ ఫుల్ ఎమోషన్, ఆ ఊరి ఆత్మగౌరవ పోరాటం అండ్ చరణ్ నట విశ్వరూపం వల్ల సినిమా ఒక మంచి రూటెడ్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ప్లస్ పాయింట్స్: రామ్ చరణ్ జగపతిబాబు క్యారెక్టర్ డిజైన్ మ్యూజిక్ ఎమోషనల్ షాకింగ్ క్లైమాక్స్ ప్రొడక్షన్ వాల్యూస్ మైనస్ పాయింట్స్: జాన్వీ కపూర్ ట్రాక్ అనవసరపు ఐటమ్ సాంగ్ ఫైనల్ వర్డ్: గుర్తింపు లేని తమ ఊరి జనం కష్టాలు తీర్చడం కోసం, తండ్రి ఆశయం కోసం ఒక కొడుకు ఆట కూలీ బతుకును వదిలేసి చేసిన పోరాటమే 'పెద్ది'. కొన్ని కమర్షియల్ మైనస్లు ఉన్నా, రామ్ చరణ్ నటన, క్లైమాక్స్ ఎమోషన్ కోసం ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్లలో చూడవచ్చు. SkyC Review: 3.25/5