చైనాకు షాక్ ఇచ్చిన ఓపెన్‌ఏఐ.. చాట్‌జీపీటీ ఖాతాలు బ్యాన్!
ఓపెన్‌ఏఐ సంచలన నివేదిక వెల్లడించింది. అమెరికా ఏఐ, టారిఫ్ చర్చలను ప్రభావితం చేయడానికి చైనా యాక్టర్లు చాట్‌జీపీటీని దుర్వినియోగం చేస్తూ కుట్ర పన్నారు. ఆ ఖాతాలను ఓపెన్‌ఏఐ నిషేధించింది.
అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు టారిఫ్ చర్చలను తీవ్రంగా ప్రభావితం చేయడానికి చైనా-సంబంధిత యాక్టర్లు చాట్‌జీపీటీని ఉపయోగించినట్లు ఓపెన్‌ఏఐ సంచలన నివేదికను వెల్లడించింది. జూన్ 10,న విడుదలైన తన జూన్ 2026 థ్రెట్ రిపోర్ట్‌లో ఓపెన్‌ఏఐ ఈ షాకింగ్ విషయాలను అధికారికంగా బయటపెట్టింది. చైనాకు చెందిన రెండు సమూహాలు చాట్‌జీపీటీని వాడుతూ అమెరికాలోని కీలక సాంకేతిక విధానాల చర్చలను రహస్యంగా ప్రభావితం చేసే ప్రయత్నం చేశాయని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో సదరు చైనా ఆపరేటర్లకు చెందిన ఖాతాలను ఓపెన్‌ఏఐ ప్లాట్‌ఫామ్ నుండి పూర్తిగా నిషేధించింది. ఈ చైనీస్ ఆపరేటర్లు అమెరికా డేటా సెంటర్ల నిర్మాణం మరియు వాణిజ్య టారిఫ్‌లపై అమెరికన్ ప్రజల మధ్య ఉన్న ఆందోళనలను ఆసరా చేసుకున్నారు. ఫలితంగా ప్రజల్లో ఉన్న ఆందోళనలను మరింత బలపరచడానికి వారు కుట్ర పూరితంగా ప్రయత్నించినట్లు నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. చైనా సంబంధిత ఆపరేటర్లు వీపీఎన్‌లను ఉపయోగించి ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేసి, సరళ చైనీస్‌లో ప్రాంప్ట్‌లు ఇచ్చి ఇంగ్లీష్, చైనీస్ భాషల్లో కంటెంట్ ఉత్పత్తి చేశారు. దీంతో వారు అమెరికన్ పౌరులుగా నటిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ విదేశీ జోక్యపు కార్యకలాపాలను ఓపెన్‌ఏఐ నివేదికలో ప్రధానంగా రెండు విభిన్న సమూహాలుగా వర్గీకరించారు. అందులో మొదటిది డేటా సెంటర్ బ్యాండ్‌వాగన్ క్యాంపెయిన్ కాగా, రెండోది టెక్ అండ్ టారిఫ్స్ క్యాంపెయిన్ అని నివేదిక స్పష్టం చేసింది. డేటా సెంటర్ బ్యాండ్‌వాగన్ క్యాంపెయిన్ సమూహం ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం వల్ల విద్యుత్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రచారం చేసింది. సాధారణ అమెరికన్ కుటుంబాలు దీనివల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పే సోషల్ మీడియా కామెంట్లు, ఇమేజ్‌లను ఈ సమూహం రూపొందించింది. ప్రావిన్షియల్ గవర్నమెంట్ క్లయింట్ల కోసం పనిచేసే ఒక చైనీస్ టెక్నాలజీ కంపెనీకి ఈ మొదటి సమూహంతో సంబంధం ఉన్నట్లు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో వారు ఇమేజ్ ఎడిటింగ్, కామిక్ స్ట్రిప్స్, హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి కంటెంట్ వ్యాప్తి చేయడంతో పాటు విదేశీ చైనీయులను లక్ష్యంగా చేసుకుని హ్యారస్‌మెంట్ చేశారు. ఇదిలా ఉండగా, టెక్ అండ్ టారిఫ్స్ క్యాంపెయిన్ సమూహం యూఎస్ టారిఫ్‌లను కేవలం సాంకేతిక ఆధిపత్యం కోసమే వాడుతున్నట్లు చిత్రీకరిస్తూ రాజకీయ కార్టూన్లు సృష్టించింది. వీరు తమ ప్రాంప్ట్‌లలో ప్రెసిడెంట్ ట్రంప్‌ను మాత్రమే చూపించాలని, చైనా లీడర్ షీ జిన్‌పింగ్‌ను ఎక్కడా ప్రస్తావించవద్దని సూచించారు. ఈ రెండో నెట్‌వర్క్ యూఎస్-చైనా సాంకేతిక పోటీ, రేర్ ఎర్త్స్, 5జీ అంశాలపై దృష్టి పెట్టడమే కాకుండా ఓపెన్‌ఏఐపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేసింది. ఈ ఆపరేషన్లు చైనా పబ్లిక్ సెక్యూరిటీ సిస్టమ్‌తో ముడిపడి ఉన్నట్లు సూచనలు ఉన్నా, ఖచ్చితమైన సంస్థాగత సంబంధాలు మాత్రం ఇంకా పూర్తిగా నిర్ధారించబడలేదు. అయితే ఈ కంటెంట్‌కు నిజమైన ఎంగేజ్‌మెంట్ దాదాపు లేదని, ఇది బ్రేక్‌అవుట్ కాలేదని ఓపెన్‌ఏఐ ఇన్వెస్టిగేటర్ బెన్ నిమ్మో విశ్లేషించారు. దేశీయ సమస్యలను ఆసరా చేసుకుని విభేదాలను పెంచే వ్యూహంతోనే విదేశీ జోక్యం చేసుకున్నారని బెన్ నిమ్మో అభిప్రాయపడ్డారు. ఈ చైనా కుట్రలపై హౌస్ సెలెక్ట్ కమిటీ ఆన్ ది చైనీస్ కమ్యూనిస్ట్ చైర్మన్ జాన్ మూలెనార్ తీవ్రంగా స్పందించారు. అమెరికా ఓపెన్ సొసైటీని చైనా ఎక్స్‌ప్లాయిట్ చేస్తోందని, డేటా సెంటర్లపై చర్చలను విభజించడానికి ప్రయత్నిస్తోందని జాన్ మూలెనార్ ఫైర్ అయ్యారు. నిజమైన సమస్యలపై గౌరవంగా డిబేట్ జరగాలని ఆయన ఆకాంక్షించారు. అమెరికా డేటా సెంటర్లు, కంప్యూటింగ్ సామర్థ్యం ద్వారా సాంకేతిక ఆధిపత్యం కోసం పెట్టుబడులు పెడుతుంటే, చైనా రహస్య ప్రభావం ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని ఈ నివేదిక నిరూపించింది.