మెటా, గూగుల్‌పై గడ్కరీ లీగల్ వార్.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

ఈ20 పెట్రోల్ వివాదంలో మెటా, గూగుల్‌పై మాననష్ట దావా వేసేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బొంబాయి హైకోర్టు అనుమతి ఇచ్చింది. వివరాలు ఇవే.

కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా దిగ్గజాలైన మెటా, గూగుల్ సంస్థలపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ20 పెట్రోల్ విధానం ద్వారా ఆయన, ఆయన కుటుంబం సొంతంగా లాభపడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పోస్టులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సదరు సంస్థలపై మాననష్ట దావా వేసేందుకు అనుమతించాలని ఆయన కోరగా, బొంబాయి హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ20 ఇంధన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకువచ్చింది. దేశంలో క్రూడ్ ఆయిల్ దిగుమతులను గణనీయంగా తగ్గించడంతో పాటు కాలుష్యాన్ని అదుపు చేయడం, స్వదేశీ బయో ఫ్యూయెల్ వినియోగాన్ని పెంచడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. అయితే కొంతమంది వాహనదారులు పాత వాహనాలపై ఈ20 ప్రభావం ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నితిన్ గడ్కరీని లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మంత్రి, ఈ పోస్టుల వల్ల తన ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా ముంబై పరిధిలో కూడా ఈ వివాదాస్పద పోస్టులు అందరికీ అందుబాటులో ఉన్నందున, ఈ కేసును విచారించే పూర్తి అధికార పరిధి బొంబాయి హైకోర్టుకు ఉందని ఆయన తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కోర్టులో గడ్కరీ తరఫు న్యాయవాదులు కీలక విషయాలను వెల్లడించారు. ఈ20 విధానం వల్ల గడ్కరీ కుటుంబం వ్యక్తిగతంగా ఆర్థికంగా ప్రయోజనం పొందుతోందంటూ పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఫలితంగా ఆయన ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతింటోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గడ్కరీ పేరు, ఫోటోలు మరియు గొంతును దుర్వినియోగం చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలను కూడా సృష్టించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాస్వామ్యంలో తన విధానాలపై వచ్చే ఆరోగ్యకరమైన, చట్టబద్ధమైన విమర్శలను తాను ఎప్పుడూ స్వాగతిస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. అయితే తనపై కావాలని చేస్తున్న అసత్య ప్రచారాలు, డీప్‌ఫేక్ వీడియోలు మరియు వ్యక్తిగత క్యారెక్టర్ అస్సాసినేషన్‌పై మాత్రమే తాను చట్టపరమైన పోరాటం చేస్తున్నానని ఆయన వివరణ ఇచ్చారు. న్యాయస్థానం ఇరువైపులా వాదనలు పరిశీలించిన అనంతరం సోషల్ మీడియా వేదికలపై మాననష్ట దావా వేయడానికి గడ్కరీకి అనుమతి మంజూరు చేసింది. ఈ కీలక పరిణామంతో ఇప్పుడు సోషల్ మీడియా దిగ్గజాలైన గూగుల్, మెటా సంస్థలు చట్టపరమైన విచారణను ఎదుర్కోవాల్సి రానుంది.
By Bhavani E — 27 July 2026