హైదరాబాద్ అనుభవంతో అమరావతిని నిర్మిస్తున్నాం: మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా లభించిందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ₹50,000 కోట్ల టెండర్లతో పనులు వేగవంతం చేశామన్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత సుదీర్ఘ కాలంగా నలుగుతున్న రాజధాని సమస్యకు 2026లో పార్లమెంట్ వేదికగా శాశ్వత పరిష్కారం లభించిందని రాష్ట్ర ఐటీ, ఐండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ లోక్‌సభ, రాజ్యసభలలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ సవరణ బిల్లు ఆమోదం పొందడం చారిత్రక ఘట్టమన్నారు. ఈ చట్టబద్ధమైన నిర్ణయంతో అమరావతి నిర్మాణ పనులలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంటూ పనులను మరింత వేగవంతం చేసిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాజధాని అభివృద్ధి ప్రక్రియ ఇప్పుడు సరికొత్త వేగాన్ని పుంజుకుందని లోకేష్ వివరించారు. గత చరిత్రను పరిశీలిస్తే 2014 నుండి 2019 మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతులు 33,000 ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా అందిస్తే పనులు ప్రారంభమయ్యాయన్నారు. అయితే 2019 నుండి 2024 వరకు పాలించిన గత ప్రభుత్వం మూడు రాజధానుల తుగ్లక్ విధానాన్ని తీసుకురావడంతో ఈ పనులు పూర్తిగా నిలిచిపోయాయని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా రాజధాని రైతులు, మహిళలు 1631 రోజుల పాటు సుదీర్ఘ ఉద్యమాన్ని నిర్వహించగా 270 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ సుదీర్ఘ పోరాటాల తర్వాత 2024లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి పనులకు మళ్లీ మోక్షం లభించిందని లోకేష్ గుర్తు చేశారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో సవరణ బిల్లు ఆమోదం పొందడం అమరావతి చరిత్రలో ఒక కీలకమైన మైలురాయిగా నిలిచిపోతుందని లోకేష్ విశ్లేషించారు. ఇదిలా ఉండగా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ శాశ్వత హోదాను మార్చడం చట్టపరంగా సాధ్యం కాదని ఆయన ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో అమరావతిపై పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ, జాతీయ ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగి భారీగా నిధులు తరలివచ్చే మార్గం సుగమం అయిందన్నారు. ఏకైక రాజధానిగా దీనికి లభించిన చట్టబద్ధమైన రక్షణ రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధికి కొత్త ఊతాన్ని ఇస్తుందని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన 60 ఏళ్ల అనుభవంతో అమరావతిని నిర్మిస్తున్నామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ₹50,000 కోట్లకు పైగా విలువైన పనులకు టెండర్లు పూర్తయి క్షేత్రస్థాయిలో పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఫలితంగా అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ టవర్లతో పాటు ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్ పనులు ఊపందుకున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో 26,000 మందికి పైగా కార్మికులు, 5,000 కంటే ఎక్కువ యంత్రాలతో నిర్మాణ ప్రాంతం రాత్రింబగళ్లు సందడిగా మారిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ వేగవంతమైన చర్యల వల్ల నష్టపోయిన రైతులకు అన్యుటీల పెంపు, లోన్ వేవర్ల వంటి రాయితీలు అందిస్తూ వారి త్యాగాలను గౌరవిస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు. ఈ భారీ ప్రాజెక్టు యొక్క మొదటి దశ పనులను 2027-28 నాటికి పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుందని లోకేష్ ప్రకటించారు. ఈ పనులు పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవానికి గౌరవనీయ ప్రధాన మంత్రిని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఒక రాష్ట్రం - ఒక రాజధాని అనే నిశ్చితమైన నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళుతూనే రాష్ట్రవ్యాప్తంగా వికేంద్రీకృత అభివృద్ధిని సాధించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు స్పష్టం చేశారు. అమరావతి కేవలం ఒక పరిపాలనా నగరం మాత్రమే కాకుండా స్పోర్ట్స్ సిటీ, ఎయిర్‌పోర్ట్ మరియు బ్యాంక్ హెడ్‌క్వార్టర్లతో కూడిన ఆర్థిక హబ్‌గా మారబోతోందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో గుణాత్మక ప్రమాణాలు పాటించడం, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయడం మరియు రైతుల హక్కులను కాపాడటం తమ బాధ్యత అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షల సమ్మేళనమైన అమరావతిని సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోందని లోకేష్ ముగించారు.
By V Sudhakar — 17 July 2026