విరాట్ కర్ణ, నభ నటేష్ నటించిన భారీ ఫాంటసీ మూవీ 'నాగబంధం' రివ్యూ. విజువల్స్ ఎలా ఉన్నాయి? సినిమా మెప్పించిందా లేదా పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.
సినిమా పేరు: నాగబంధం నటీనటులు: విరాట్ కర్ణ, నభ నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, గరుడ రామ్, మురళీ శర్మ, రిషబ్ షానే తదితరులు. దర్శకత్వం: అభిషేక్ నామా సంగీతం: జునైద్ కుమార్ – అభే కథ : ఈ కథ అంతా ఒక పురాతనమైన రహస్యం, అలాగే మనుషుల అత్యాశ చుట్టూ తిరుగుతుంది. 1962 వ సంవత్సరంలో హిమాలయాల లోతుల్లో రీసెర్చ్ చేసే కొందరు పురావస్తు శాస్త్రవేత్తలకు ఒక వింతైన తాంత్రికుడు (గరుడ రామ్) ఎదురవుతాడు. కాల వృక్షంలో బందీ అయిన ఆ తాంత్రికుడు.. ఈ లోకాన్నంతటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకునే ఒక శక్తివంతమైన 'నాగబంధం' గురించి, దాన్ని తెరవడానికి కావాల్సిన 'బ్రహ్మకమలం' మరియు 'గరుడ మంత్రాల గ్రంథం' గురించి చెబుతాడు. ఎలాగైనా ఆ అంతులేని శక్తిని సొంతం చేసుకుని, అసలు మరణమే లేని చిరంజీవిగా మారిపోవాలని అలీ (రిషబ్ షానే) అనే ఒక క్రూరమైన వ్యక్తి వేట మొదలుపెడతాడు. ఆ గ్రంథం, బ్రహ్మకమలం శ్రీరంగపురంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయంలో ఉన్నాయని తెలుసుకుని, అతని ముఠా ఆ ఊరిపై కన్నేస్తుంది. ఇదే సమయంలో అదే ఊరిలో నదిపై పడవ నడుపుకుంటూ, తన చెల్లెలే ప్రాణంగా బతికే ఒక సాధారణ యువకుడు రుద్ర (విరాట్ కర్ణ). తన చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడమే అతని జీవిత ఆశయం. కానీ అనుకోకుండా అతని జీవితం ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. ఆ ఆలయాన్ని, అందులోని బ్రహ్మకమలాన్ని కాపాడాల్సిన బాధ్యత రుద్రపై పడుతుంది. అసలు రుద్రకి ఈ నాగబంధానికి ఉన్న సంబంధం ఏంటి? పురావస్తు శాఖకు చెందిన ప్రభాకర్ (జగపతి బాబు) కూడా దీని కోసమే ఎందుకు వెతుకుతున్నాడు? ఈ ప్రయాణంలో పార్వతి (నభ నటేష్) పాత్ర ఏంటి? చివరికి ఆ దుష్టుల చేతికి నాగబంధం దొరికిందా లేదా అనేదే మిగతా సినిమా. విశ్లేషణ : ఫాంటసీ, డివోషనల్ టచ్ ఉన్న అడ్వెంచర్ సినిమాలకు ఎప్పుడూ థియేటర్లలో మంచి క్రేజ్ ఉంటుంది. దర్శకుడు అభిషేక్ నామా కూడా అలాంటి ఒక భారీ సనాతన ధర్మం బ్యాక్‌డ్రాప్ ఉన్న లైన్‌ను ఎంచుకుని, దానికి అనంత పద్మనాభ స్వామి ఆలయ చరిత్రను జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా మొదలవ్వడమే హిమాలయాల విజువల్స్, తాంత్రికుడి ఎంట్రీతో చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఫస్టాఫ్ అంతా కథలోకి ప్రేక్షకుడిని ఈజీగా తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. రంగనాథ స్వామి ఆలయం సెట్, అందులోని విగ్రహం చూపిస్తున్నప్పుడు కెమెరా యాంగిల్స్ నిజంగా హై ఇచ్చాయి. సౌందర్ రాజన్ తన కెమెరా వర్క్‌తో ప్రతి ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా ప్రెసెంట్ చేశాడు. ముఖ్యంగా నదిపై వచ్చే సీన్లు, ఆలయం లోపల లైటింగ్ టింట్స్, షాడోస్ వాడిన విధానం సినిమా స్కేల్‌ను చాలా పెద్దదిగా చూపించాయి. నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కథ బాగానే మొదలైనా, హీరో ఎంట్రీ తర్వాత వచ్చే ఫ్యామిలీ సీన్లు, చెల్లెలి సెంటిమెంట్ డ్రామా అంతగా పండలేదు. అక్కడక్కడా వచ్చే రొమాంటిక్ సాంగ్స్ సినిమా ఫ్లోను దెబ్బతీశాయి. లీడ్ పెయిర్ మధ్య లవ్ ట్రాక్ కూడా చాలా అకస్మాత్తుగా వచ్చేసినట్టు అనిపిస్తుంది. హీరోగా చేసిన విరాట్ కర్ణ తన లుక్స్ పరంగా, యాక్షన్ సీన్స్ పరంగా చాలా కష్టపడ్డాడు. అతనిపై పెట్టిన క్లోజప్ షాట్స్, నాగ సాధువుగా అతని మేకోవర్ బాగున్నాయి. యాక్షన్ సీన్లలో విరాట్ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. కానీ ఎమోషనల్ సీన్లలో ఇంకాస్త మేర పర్ఫార్మెన్స్ చూపించి ఉంటే బాగుండేది. ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి యాక్షన్ డోస్ చాలా ఎక్కువైంది. ఫైట్ సీన్ చాలా సుదీర్ఘంగా సాగడం, మితిమీరిన రక్తపాతం ఉండటం వల్ల కొంచెం విసుగు తెప్పిస్తుంది. అయినా ఆ సీన్ చివర్లో వచ్చే ట్విస్ట్, విజువల్స్ థియేటర్లో కూర్చోబెడతాయి. జునైద్ కుమార్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కొన్ని యాక్షన్ సీన్లు బాగా లేచాయి. సెకండాఫ్ వచ్చేసరికి సినిమా గ్రాఫ్ కొంచెం పడిపోయింది. కథ ఎటు వెళ్తుందో తెలియని గందరగోళం కనిపిస్తుంది. విలన్ చేతికి ఆ శక్తులు దొరికితే అసలు ఎలాంటి విపత్తు వస్తుంది అనే పాయింట్‌ను బలంగా చూపించలేదు. దాంతో హీరో చేసే పోరాటంలో ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడం కష్టంగా మారుతుంది. క్లైమాక్స్‌కు ముందు వచ్చే హీరో గత జన్మ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ చాలా రొటీన్‌గా ఉంది. గుడులను దోచుకోవడం, హిందూవులను ఇబ్బంది పెట్టడం వంటి సీన్లు మనం ఇదివరకే చాలా సినిమాల్లో చూసేసినవే కాబట్టి కొత్తదనం ఏమీ అనిపించదు. క్లైమాక్స్ ఫైట్ అయితే అస్సలు ముగియనంత సాగదీశారు. ఎడిటింగ్ పరంగా ఆర్ సి ప్రణవ్ కత్తెరకు ఇంకా చాలా పని చెప్పాల్సింది. కనీసం ఒక అరగంట సినిమాను ట్రిమ్ చేసి ఉంటే పేసింగ్ బాగుండేది. విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల అద్భుతంగా ఉన్నా, కొన్ని ముఖ్యమైన సీన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విజువల్స్ వాడటం వల్ల నాణ్యత లోపించినట్లు స్పష్టంగా తెలిసిపోతుంది. నటీనటుల విషయానికి వస్తే.. నభ నటేష్‌కి చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ రోల్ దొరికింది, ఆమె తన నటనలో జీవించింది. విలన్‌గా చేసిన రిషబ్ షానే తన క్రూరత్వంతో మెప్పించాడు. జగపతి బాబు, మురళీ శర్మ ఎప్పటిలాగే తమ పాత్రలకు న్యాయం చేశారు. గరుడ రామ్ భారీ ప్రొస్థెటిక్ మేకప్‌లో కూడా మంచి ఇంటెన్సిటీ చూపించాడు. ఆర్ట్ వర్క్ పరంగా సినిమా చాలా టాప్ క్లాస్‌లో ఉంది, ముఖ్యంగా భైరవకోన ఎపిసోడ్ సెట్టింగ్స్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయి. దర్శకుడు ఒక మంచి పాయింట్ అనుకున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే మీద ఇంకాస్త వర్క్ చేసి ఉంటే ఈ 'నాగబంధం' విజువల్ వండర్‌గా నిలిచేది. ప్లస్ పాయింట్స్ : గ్రాండ్ విజువల్స్, భారీ సెట్స్. విరాట్ కర్ణ యాక్షన్ సీన్స్. నభ నటేష్ సర్ప్రైజింగ్ రోల్. ఇంటర్వెల్ ట్విస్ట్. మైనస్ పాయింట్స్ : సెకండాఫ్ చాలా సాగదీత. రొటీన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్. సుదీర్ఘమైన క్లైమాక్స్ ఫైట్. సినిమా నిడివి. ఫైనల్ వర్డ్ : 'నాగబంధం' సినిమా విజువల్‌గా చాలా రిచ్‌గా, భారీగా ఉన్నప్పటికీ.. బలహీనమైన కథనం, సాగదీత సీన్ల వల్ల ఒక రొటీన్ డివోషనల్ అడ్వెంచర్‌గా మిగిలిపోయింది. భారీ విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ డ్రామా ఇష్టపడేవారు పెద్దగా అంచనాలు లేకుండా ఒకసారి చూడొచ్చు! SkyC Rating: 2.5/5