ఉదయనిధి స్టాలిన్ బెయిల్ పై విడుదలైన తర్వాత ఎంకే స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు. అహంకారం నాశనానికి దారితీస్తుందంటూ టీవీకే ప్రభుత్వానికి స్టాలిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ మరియు తదనంతరం లభించిన బెయిల్ తీవ్ర కలకలం రేపాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన ప్రసంగంపై పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అదే రోజు చెన్నై హైకోర్టు ఆదేశాలతో ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరైంది. ఉదయనిధి విడుదల కాగానే డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వివాదం వెనుక సుదీర్ఘ రాజకీయ పరిణామాలు ఉన్నాయి. కావేరి నీటి సమస్యపై తంజావూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి పాల్గొని ప్రసంగించారు. ఆ సమయంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినట్లుగా ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై టీవీకే వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి చెన్నై ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెంచింది. దీంతో ఉదయనిధి లీగల్ టీమ్ వెంటనే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనను రిమాండ్‌కు తరలించే ఉద్దేశం ఉందో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది తమకు జ్యుడీషియల్ రిమాండ్ కోరే ఉద్దేశం లేదని స్పష్టం చేయడంతో, విచారణ అనంతరం వెంటనే స్టేషన్ బెయిల్ పై విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా ఈ అరెస్ట్ వ్యవహారంపై డిఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఉదయనిధి హాజరుకాకుండా అడ్డుకునేందుకే ఈ రకమైన కుట్రలు పన్నారని ఆరోపించాయి. ఫలితంగా కావేరి నీటి కేటాయింపుల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ అరెస్ట్ డ్రామా ఆడారని డిఎంకే విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఎక్స్ వేదికగా నేరుగా విమర్శలు గుప్పించారు. స్టాలిన్ తమిళంలో స్పందిస్తూ ప్రతిపక్ష నేత ఉదయనిధి అరెస్ట్ పాలకుల అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. అహంకారం నాశనానికి దారితీస్తుందని, వరుస అహంకార చర్యలు ఆ నాశనాన్ని మరింత వేగవంతం చేస్తాయని హెచ్చరించారు. అంతేకాకుండా తొడనడుంగి ప్రభుత్వం అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించి టీవీకే ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కేవలం కక్షసాధింపు రాజకీయాల కోసమే అరెస్టుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని స్టాలిన్ వ్యాఖ్యానించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల ముందు ప్రారంభమైన ఈ రాజకీయ యుద్ధం రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.