మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. ఈసీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం!
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వేదికగా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈసీ పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరించిందని, ప్రజాస్వామ్య విలువులను కాలరాస్తోందని మీనాక్షి నటరాజన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన నామినేషన్‌ను ఉద్దేశపూర్వకంగానే తిరస్కరించారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ వివాదానికి ప్రధాన కారణం లో వివరాల దాచారనే అభ్యంతరం మాత్రమే. హైదరాబాద్‌కు సంబంధించిన ఒక ప్రైవేట్ కంప్లైంట్ లేదా క్రిమినల్ కేసు వివరాలను ఆమె వెల్లడించలేదని ఈసీ పేర్కొంది. అయితే దీనిపై మీనాక్షి నటరాజన్ వర్గం గట్టి కౌంటర్ ఇస్తోంది. అది కేవలం చార్జెస్ ఫ్రేమ్ చేయబడని ఒక సాధారణ నోటీసు లేదా కంప్లైంట్ మాత్రమేనని స్పష్టం చేస్తోంది. డిస్‌క్లోజర్ నిబంధనల ప్రకారం చార్జెస్ ఫ్రేమ్ కాకపోతే వాటిని వెల్లడించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ లీగల్ సెల్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ త్వరలోనే ఒక భారీ ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మీడియా సమావేశంలో ఎన్నికల కమిషన్ తీరును ఎండగడుతూ పూర్తి నిజాలను బహిర్గతం చేస్తానని ఆమె ప్రకటించారు. బీజేపీ ఒత్తిడి వల్లే ఎన్నికల కమిషన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని కాంగ్రెస్ నేతలు నేరుగా టార్గెట్ చేస్తున్నారు. ఇదంతా అధికార బీజేపీ ఆడుతున్న పొలిటికల్ గేమ్ అంటూ కాంగ్రెస్ లీగల్ సెల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ అన్యాయంపై హైకోర్టు లేదా సుప్రీం కోర్టు వేదికగా గట్టిగా పోరాడుతామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈ నామినేషన్ తిరస్కరణ ప్రక్రియ వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందనే విమర్శలు వస్తున్నాయి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఫలితంగా అక్కడ పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం అందుతోంది. విపక్ష అభ్యర్థులను సాంకేతిక కారణాలతో పక్కన పెట్టి ఏకగ్రీవాలు చేసుకోవడం బీజేపీ అలవాటుగా మార్చుకుందని కాంగ్రెస్ మండిపడుతోంది. దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్, బీజేపీ మధ్య పెద్ద పొలిటికల్ వార్‌కు దారితీసింది. ఈ పరిణామాల మధ్య మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇటీవల కొట్టేసింది. ఆర్టికల్ 329 నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. అయితే బాధితులు ఎన్నికల పిటిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించవచ్చని న్యాయస్థానం కీలక సూచన చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో కాంగ్రెస్ లీగల్ టీమ్ ఇప్పుడు హైకోర్టులో గట్టి లీగల్ ఫైట్ ఇచ్చేందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ మరియు జాతీయ కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈసీ దుర్మార్గపు చర్యలపై న్యాయపోరాటం ఆపే ప్రసక్తే లేదని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. కేవలం సాధారణ కంప్లైంట్‌ను పెద్ద నేరంగా చూపించి నామినేషన్ తిరస్కరించడం వెనుక ఉన్న శక్తులను త్వరలోనే ఎండగడతామని హెచ్చరించారు. ఈ పొలిటికల్ డ్రామా రాబోయే రోజుల్లో ఎలాంటి ట్విస్టులు తీసుకుంటుందో వేచి చూడాలి.