ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా గులాబీ జెండా ఖాయం: కేటీఆర్
ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ గెలవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు.
తెలంగాణ రాష్టంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పలువురు స్థానిక నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాన్సువాడలో కాంగ్రెస్ నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డిని ఓడించడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. బాన్సువాడ ప్రాంతానికి చెందిన మోరెల్ శ్రీనివాసరావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో బాన్సువాడ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. ఆ అభివృద్ధి ఫలితాలను అనుభవించిన పోచారం శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు పార్టీ మారి మోసానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బాన్సువాడ రాజకీయాల్లో పోచారం శ్రీనివాసరెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయనకే శాపంగా మారిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా కేసీఆర్ హయాంలో రైతులకు వేళకు యూరియా, విత్తనాలు అందించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏ ఒక్క పథకం సరిగ్గా అందడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు బంధు లాంటి కీలక హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఇప్పటికీ చెక్కుచెదరని ఆదరణ ఉందని అంతర్గత సర్వేల్లో స్పష్టమైందని కేటీఆర్ వెల్లడించారు. భవిష్యత్తులో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. చివరగా పార్టీ శ్రేణులందరూ ఐక్యంగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలని కోరారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.