రివ్యూ : కొరియన్ కనకరాజు

వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ. రేటింగ్ 2.5/5. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

సినిమా పేరు: కొరియన్ కనకరాజు నటీనటులు: వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్, విటి గణేష్, మురళీధర్ గౌడ్, బుల్లిరాజు తదితరులు దర్శకత్వం: మేర్లపాక గాంధీ సంగీతం: ఎస్. థమన్ నిర్మాతలు: రాజీవ్ రెడ్డి ఎడుగురు, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణ రెడ్డి సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి కటసాని ఎడిటింగ్: సత్య జి బ్యానర్స్: యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ విడుదల తేదీ: ఆగస్టు 07, 2026 ​కథ: ​రాయలసీమలోని పెనుగొండ ప్రాంతం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. కనకరాజు (వరుణ్ తేజ్) ఓ మామూలు కుర్రాడు. చెక్కభజన బృందాన్ని నడుపుతూ, ఎవరికీ తలవంచని మొండితత్వంతో జీవిస్తుంటాడు. తండ్రి చేసిన అప్పులు, విదేశాలకు వెళ్లి మధ్యలోనే ఆగిపోయిన అన్నయ్య బాధ్యతలు అన్నీ కనకరాజు భుజాన పడతాయి. ఉన్న కొద్దిపాటి సంపాదనను జాగ్రత్తగా దాచుకుంటూ, ఊరిలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎదురు తిరిగే రకం తను. అదే ఊర్లో ఉండే చైత్ర (రితికా నాయక్)కి కొరియా అంటే పిచ్చి ఇష్టం. ఎప్పటికైనా కొరియా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలని ఆమె కలలు కంటుంటుంది. చైత్రను చూసి మనసు పారేసుకున్న కనకరాజు ఆమె వెంటపడుతుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించే సమయంలోనే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. కొరియాలో ‘చో స్వాంగ్’ అనే పేరు మోసిన క్రూరమైన గ్యాంగ్‌స్టర్ ఒకడు ఉంటాడు. ఫోర్ ఫింగర్స్ పేరుతో రాజ్యమేలే ఆ వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తాడు. అక్కడ చనిపోయిన ఆ వ్యక్తి అస్థికలు, ఆత్మకు సంబంధించిన వ్యవహారం ఒక కుక్ ద్వారా ఇండియాకి, సరిగ్గా పెనుగొండలోని కనకరాజు దగ్గరకు చేరుతుంది. ఆ కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ అనుకోకుండా కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పటి వరకు కోపంతో ఊగిపోయే కనకరాజు బాడీ లాంగ్వేజ్ ఒక్కసారిగా మారిపోతుంది. అసలు ఆ కొరియన్ ఆత్మకు కనకరాజుతో ఏంటి సంబంధం? ఆ ఆత్మ కోరిక ఏమిటి? ఆ ఆత్మ నుంచి తప్పించుకోవడానికి కనకరాజు, చైత్ర, అతడి ఫ్రెండ్ కిష్టప్ప (సత్య) కలిసి కొరియా దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు ఈ కథ ఎలాంటి ముగింపుకు చేరింది అనేది తెరపై చూడాలి. ​విశ్లేషణ: ​సినిమా మొదలైన వెంటనే దర్శకుడు మేర్లపాక గాంధీ తీసుకున్న పాయింట్ ఎంత వెరైటీగా ఉందో మనకు అర్థమైపోతుంది. రాయలసీమ మాస్ కల్చర్‌ని, కొరియన్ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌ని మిక్స్ చేసి హారర్ కామెడీ చేయడం మామూలు విషయం కాదు. హారర్ కథలతో ఎన్ని మ్యాజిక్కులు చేయొచ్చో, వాటిలో కామెడీని మిక్స్ చేసి భయం పుట్టిస్తూనే నవ్వించవచ్చనే ప్లాన్‌తో దర్శకుడు ఈ సెటప్‌ని ఎంచుకున్నాడు. కొరియా నుంచి వచ్చిన ఆత్మ రాయలసీమ వాసిని ఆవహిస్తే ఎలా ఉంటుందనే పాయింట్ పరంగా ఆలోచన కొత్తగానే అనిపిస్తుంది. కొరియన్ సినిమాలు, సిరీస్‌లపై ఆసక్తి పెరుగుతున్న ఈ తరుణంలో ఈ బ్యాక్‌డ్రాప్‌ను వాడుకోవడం కొంతవరకు కలిసొచ్చే అంశమే. అయితే, తొలి 20 నిమిషాలు పాత్రలను పరిచయం చేయడానికే దర్శకుడు సమయం తీసుకున్నాడు. కొరియా నుంచి ఆత్మ వచ్చి హీరోను చేరుతుందనే విషయం ముందుగానే తెలిసినప్పటికీ, అసలు కథలోకి వెళ్లడానికి చాలా టైమ్ పట్టింది. ఆ మధ్యలో సత్య కామెడీ, రొటీన్ లవ్ స్టోరీతో కాలక్షేపం చేయాలని చూశాడు. సత్య కామెడీ వర్కౌట్ అయినప్పటికీ, లవ్ ట్రాక్ మరియు హీరో ఇంటి పరిస్థితులు, సునీల్ విలనిజం పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. హీరో శరీరంలోకి ఆత్మ ప్రవేశించే కీలక మూమెంట్ చాలా ఆలస్యంగా రావడంతో ఫస్ట్ హాఫ్ కొద్దిగా నెమ్మదించింది. ​అయినప్పటికీ, ఆ తర్వాత సత్య చేసే కామెడీ, తన బాడీ లాంగ్వేజ్ వల్ల సన్నివేశాలు చురుగ్గా సాగాయనే ఫీలింగ్ వస్తుంది. కుక్కపిల్ల సీన్, స్మశానం ఎపిసోడ్ రెండూ బాగా వర్కౌట్ అయ్యి ఫస్ట్ హాఫ్‌లో మంచి నవ్వులు పంచాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో అసలు ఆత్మ కథ ఏమిటో అర్థమై, సెకండాఫ్‌కి మంచి లీడ్ దొరికినట్లయింది. కానీ, కథలో అత్యంత కీలకమైన సెకండాఫ్‌లో దర్శకుడు పట్టు కోల్పోయాడు. సన్నివేశాలన్నీ చాలా క్యాజువల్‌గా నడిచిపోవడంతో పెద్దగా కాన్‌ఫ్లిక్ట్ కనిపించలేదు. ముఖ్యంగా ఇది హారర్ సినిమా అనుకుని థియేటర్లకు వెళ్తే ప్రేక్షకులు నిరాశపడాల్సి వస్తుంది. ఇందులో హారర్‌కు సంబంధించిన ఎలిమెంట్స్ ఏమాత్రం పండలేదు. దర్శకుడు కూడా దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆత్మ ఆవహించిన తర్వాత కథ సీరియస్ టోన్‌లోకి వెళ్లినా అందులో తగిన బలం లేదు. బుల్లిరాజు ఎపిసోడ్ కూడా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. ​అయినప్పటికీ, సెకండాఫ్‌ను తన భుజాలపై మోసే బాధ్యతను మరోసారి సత్యే విజయవంతంగా నిర్వర్తించాడు. కనకరాజు ఆత్మను రప్పించే క్రమంలో సిగ్నల్ లేకపోవడం వల్ల వీడియో కాల్ కట్ అవ్వడం, ఆ తర్వాత పుట్టుకొచ్చే వినోదం థియేటర్‌లో మంచి నవ్వులు పూయించింది. ప్రీ క్లైమాక్స్‌లో అన్నయ్య సెంటిమెంట్‌ను, ఫ్లాష్‌బ్యాక్‌ను మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అది ఆర్గానిక్‌గా కుదరలేదు. క్లైమాక్స్‌లో రెండు ఆత్మలు కొట్టుకోవాలనే ఐడియా బాగున్నా, టైమ్ లేకనో బడ్జెట్ లోపం వలనో దాన్ని విజువల్‌గా సరిగ్గా తీయలేదనిపిస్తుంది. చివరికి క్లైమాక్స్ ఫైట్‌కు వీడియో గేమ్ లుక్ తీసుకొచ్చారు. పార్ట్ 2కి ఇచ్చిన లీడ్ మరియు ఆ సీన్ లో వరుణ్ తేజ్ గెటప్, డ్రెస్సింగ్ స్టైల్ పర్వాలేదనిపిస్తాయి. ​నటీనటుల విషయానికి వస్తే, కనకరాజుగా వరుణ్ తేజ్ రాయలసీమ మాస్ అవతార్‌లోనూ, కొరియా గ్యాంగ్‌స్టర్ గెటప్‌లోనూ చక్కగా ఒదిగిపోయాడు. స్లాంగ్ బాగా పట్టుకోవడంతో పాటు చాలాకాలం తర్వాత మంచి డాన్సులు చేసే అవకాశం కూడా దక్కించుకున్నాడు. రితికా నాయక్ కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా సినిమా అంతటా హీరో పక్కనే ప్రయాణించింది. మురళీధర్ గౌడ్ తన పాత్ర వరకు న్యాయం చేశాడు. ఇక ఈ సినిమాకు అసలైన హీరో సత్యే అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన టైమింగ్ ఈ సినిమాకు శ్రీరామరక్షగా నిలిచింది. ఒక షాట్‌లో నందమూరి బాలకృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ మేనరిజమ్స్‌ను అనుకరిస్తూ సత్య థియేటర్‌లో నవ్వుల మోత మోగించాడు. ​సాంకేతిక నిపుణుల పనితీరును పరిశీలిస్తే, తమన్ అందించిన పాటల్లో ‘కంసామీన’ ఆకట్టుకోవడంతో పాటు పిక్చరైజేషన్ పరంగానూ మార్కులు కొట్టేసింది. మిగిలిన పాటలు పెద్దగా రిజిస్టర్ కావు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో హుషారు తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, కొరియా సీన్లలో వినిపించిన బీజీఎం కొన్ని చోట్ల ‘ఓజీ’ సినిమాను గుర్తుకు తెస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ మరియు మేకింగ్ పరంగా నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా, క్వాలిటీగా ఉన్నాయి. స్క్రిప్ట్ మీద మరింత శ్రద్ధ పెట్టి, బలమైన ట్విస్టులు రాసుకుని ఉంటే ఈ సినిమా స్థాయి మరింత ఎక్కువగా ఉండేది. ఏదేమైనా, లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే టికెట్ రేటుకు తగ్గ ఫన్ మరియు టైమ్‌పాస్ వినోదం మాత్రం ఈ చిత్రంలో దొరుకుతుంది. ​ప్లస్ పాయింట్స్: ​సత్య కామెడీ టైమింగ్ ​వరుణ్ తేజ్ నటన ​కొరియన్ డిఫరెంట్ కాన్సెప్ట్ ​రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ​మైనస్ పాయింట్స్: ​పండని హారర్ ఎలిమెంట్స్ ​సాగదీతగా అనిపించే సెకండ్ హాఫ్ ​బలవంతపు సెంటిమెంట్ సీన్స్ ​తేలిపోయిన AI క్లైమాక్స్ ఫైట్ ​ఫైనల్ వర్డ్: ​కొరియన్ కనకరాజు కొత్త పాయింట్‌తో వచ్చినప్పటికీ, రెగ్యులర్ కమర్షియల్ బాటలోనే నడిచింది. హారర్ భయాలు లేకపోయినా, సత్య కామెడీ మరియు వరుణ్ తేజ్ నటన వీకెండ్‌లో హాయిగా నవ్వుకోవడానికి చక్కటి వినోదాన్ని అందిస్తాయి. SkyC Rating: 2.65/5
By Venkat Reddy — 07 August 2026