బీజేపీకి అన్నామలై రాజీనామా.. తమిళ రాజకీయాల్లో పెను సంచలనం

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై రాజీనామా చేశారు. ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడికి లేఖ సమర్పించి, జూన్ 4న కొత్త పార్టీ స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారు.

తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జూన్ 2,న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఆయన తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అన్నామలై రాజీనామా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ఆయన చెన్నైకి తిరిగి వెళ్లనున్నారు. ఈ నిర్ణయం వెనుక గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంతో ఉన్న విభేదాలు కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఏఐఏడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవడాన్ని అన్నామలై తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడులో క్షేత్రస్థాయి నుంచి పార్టీ సొంత బలాన్ని నిర్మించుకోవాలని ఆయన బలంగా ఆకాంక్షించారు. దీంతో పార్టీ అధిష్టానం 2025 లోనే అన్నామలైను తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో నైనార్ నాగేంద్రన్‌ను నూతన అధ్యక్షుడిగా నియమించింది. ఇదిలా ఉండగా ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ వ్యూహం పూర్తిగా విఫలమైంది. మరోవైపు నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం భారీ విజయాన్ని సాధించింది. ఫలితంగా తమిళనాడులో ద్రావిడ శకం ముగిసిందని అన్నామలై భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని ఆయన నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు విజయ్‌ను ఎదుర్కొనే బలమైన ప్రత్యామ్నాయం ప్రస్తుతం ఏదీ లేదని ఆయన విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం అన్నామలై కొత్త ప్రజా ఉద్యమాన్ని లేదా సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. జూన్ 4 న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త పార్టీ ప్రకటన వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. అన్నామలై రాజీనామా నేపథ్యంలో ఆయన మద్దతుదారులు ఇప్పటికే కోయంబత్తూర్ వంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున పోస్టర్లు వేశారు. ఆయనను నాయకత్వం వహించాల్సిందిగా కోరుతూ ఈ పోస్టర్లు వెలిశాయి. ప్రస్తుత తరుణంలో అన్నామలై రాజీనామాను నివారించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం చివరి ప్రయత్నాలు చేస్తోంది. ఆయనను పార్టీలోనే ఉంచేందుకు ఒక జాతీయ స్థాయి కీలక పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే అన్నామలై మాత్రం పార్టీ నుంచి స్నేహపూర్వకంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు. స్వతంత్ర పంథాలో ముందుకు సాగడానికే ఆయన మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.

తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. బీజేపీకి మాజీ అధ్యక్షుడు అన్నామలై రాజీనామా! జూన్ 4న కొత్త పార్టీ ప్రకటన? #annamalai #bjpresignation #tamilnadupolitics #annamalairesigns #tvkvijay మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

By Venkat Reddy — 02 June 2026