పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. 14 మంది కమిటీ సభ్యులతో ముందుకు..!
జనసేన జాయినింగ్స్ కమిటీపై పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం. 14 మంది సభ్యులతో స్టేట్ లెవెల్ కమిటీ ఏర్పాటు.. ఏపీ, తెలంగాణలో చేరికలపై పవన్ మార్క్ మాస్టర్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతోంది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంపై అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నేతలతో పాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రముఖులను ఆకర్షించేందుకు సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థంగా ఉండే ముఖ్యమైన నాయకులను జనసేన వైపు తిప్పుకోవడానికి సరికొత్త రూట్ మ్యాప్ రెడీ అయింది. ఈ భారీ ఆపరేషన్ కోసం పవన్ కళ్యాణ్ 14 మంది సభ్యులతో కూడిన అత్యున్నత స్థాయి రాష్ట్ర జాయినింగ్స్ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో ముగ్గురు ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీకి చోటు దక్కింది. వీరితో పాటు ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఈ కమిటీలో కీలక భూమిక పోషించనున్నారు. మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభానులను కూడా చేరికల కమిటీలో సభ్యులుగా నియమిస్తూ జనసేన అధిష్ఠానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పార్టీ సీనియర్ నాయకులకు సైతం ఈ ప్రతిష్టాత్మక కమిటీలో పెద్దపీట వేశారు. కొటికలపూడి చినబాబు, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్, కొరికాన రవికుమార్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు వంపూరు గంగులయ్య, టి.సి. వరుణ్, ఆరణి మదన్‌లకు ఈ కమిటీలో బాధ్యతలు అప్పగించారు. ఈ 14 మంది బృందం రాష్ట్రవ్యాప్తంగా జనసేనలోకి వచ్చే నేతలను స్క్రీనింగ్ చేయడంతో పాటు వారితో సంప్రదింపులు జరిపే బాధ్యతను మోయనుంది. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈ కమిటీ నియామకం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే రంగంలోకి దిగనున్నారు. ఈ 14 మంది కమిటీ సభ్యులతో జనసేనాని ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ హైలెవల్ మీటింగ్‌లో చేరికలను ఎలా ప్రోత్సహించాలి, ఏయే వర్గాలను టార్గెట్ చేయాలనే అంశాలపై పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఏ నియోజకవర్గంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై కమిటీకి స్పష్టమైన బ్లూప్రింట్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉండగా ఈ జాయినింగ్స్ కమిటీ ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కావడం లేదు. ఏపీలో పార్టీ బలాన్ని భారీగా పెంచుకోవడంతో పాటు తెలంగాణపై కూడా పవన్ కళ్యాణ్ కన్నేశారు. తెలంగాణలో కూడా త్వరలోనే ఇలాంటి ఒక పటిష్టమైన జాయినింగ్స్ కమిటీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా బలమైన నేతలను పార్టీలోకి లాగేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన విస్తరణ ఇకపై మరింత స్పీడందుకోనుంది. ఈ కమిటీ ఏర్పాటు ద్వారా జనసేన కేవలం ఒక ఎన్నికల పార్టీ కాదని, దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు వెళ్తోందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సంస్థాగతంగా పార్టీని తిరుగులేని శక్తిగా మార్చడమే దీని వెనుక ఉన్న అసలు ప్లాన్. రాబోయే రోజుల్లో ఈ 14 మంది నేతల కమిటీ ఏ మేరకు ఫలితాలు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ లేటెస్ట్ డెసిషన్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా రన్ అవుతోంది.