రివ్యూ : జన నాయకుడు

విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జననాయగన్' సినిమా రివ్యూ. కథ, నటన, ప్లస్ మైనస్ పాయింట్స్ మరియు పూర్తి రేటింగ్ ఇక్కడ చూడండి.

సినిమా పేరు: జననాయకుడు (Jana Nayagan) తారాగణం: సి. జోసెఫ్ విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమిత బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, నిజాల్గల్ రవి, రేవతి, నాసర్ తదితరులు దర్శకత్వం: హెచ్. వినోద్ నిర్మాత: వెంకట్ కె. నారాయణ (KVN ప్రొడక్షన్స్) సంగీతం: అనిరుధ్ రవిచందర్ విడుదల తేది: 23 జూలై 2026 నిడివి: 03 గంటల 03 నిమిషాలు జానర్: పొలిటికల్ యాక్షన్ డ్రామా కథ : విజయ్ ఈ చిత్రంలో తలపతి వెత్రి కొండన్ (TVK)గా ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా మరియు ఇరవై ఏళ్ల యువతి (మమిత బైజు)కి రక్షకుడిగా కనిపిస్తాడు. ఆ అమ్మాయిని స్వయంశక్తితో ఎదిగేలా చేసి, ఇండియన్ ఆర్మీలోకి పంపాలనే గట్టి పట్టుదలతో ఉంటాడు. అసలు ఆ అమ్మాయిని ఆర్మీకి వెళ్లేలా చేయడానికి హీరో ఎలాంటి కష్టాలు పడ్డాడు? ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా ఉండాల్సిన హీరో జైలుపాలవడానికి అసలు కారణం ఏమిటి? అమ్రిష్ పూజారి అనబడే జాన్ హిమ్లర్ (బాబీ డియోల్) ఎవరు? అతనికి హీరో వెత్రి కొండన్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? జాన్ హిమ్లర్ వేసే ప్రమాదకరమైన కుట్రలు ఏమిటి? ‘ఆపరేషన్ మెలుగ’ (OM) అంటే ఏమిటి? జాన్ హిమ్లర్ ప్లాన్లను హీరో ఎలా తిప్పికొట్టాడు అనేదే ఈ సినిమా అసలు కథ. అటు కుటుంబ బంధాలు, ఇటు రాజకీయ అంశాలను మిళితం చేసి తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు అలరించిందో విశ్లేషణలో చూద్దాం. విశ్లేషణ : దళపతి విజయ్ కెరీర్‌లో అత్యంత ఆసక్తికరంగా మారిన 'జననాయగన్' సినిమా ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత నేడు థియేటర్లలోకి వచ్చింది. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టే ముందు విజయ్ చేయాల్సిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం సహజం. అయితే సెన్సార్ అడ్డంకులు, రాజకీయ మార్పుల కారణంగా ఈ సినిమా విడుదలకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలుగులో సూపర్ హిట్ అయిన 'భగవత్ కేసరి' సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారనే వార్తలు వచ్చినప్పుడే అందరిలో ఆసక్తి పెరిగింది. అయితే దర్శకుడు హెచ్. వినోద్ ఒరిజినల్ కథలోని సోల్‌ను తీసుకున్నప్పటికీ, దానికి అదనంగా జోడించిన రాజకీయ రంగులు, అనవసరమైన విలన్ ట్రాక్‌లు సినిమాను పూర్తిగా దెబ్బతీశాయి. సినిమా ప్రారంభమైన తీరు చూస్తేనే దర్శకుడు ఎక్కడికి వెళ్తున్నాడో అర్థమైపోతుంది. నిజాల్గల్ రవి మరియు గ్రామస్తులతో కూడిన పొలిటికల్ ఓపెనింగ్ సీన్ కాస్త ఊపునిచ్చినా, ఆ తర్వాత సెంట్రల్ జైలులో విజయ్ ఎంట్రీ సీన్ వచ్చేసరికి పాటల డబ్బింగ్ సరిగ్గా కుదరక కాస్త చిరాకు తెప్పిస్తుంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పాత్రకు వాడిన తెలుగు డబ్బింగ్ వాయిస్ ఆ సీన్ మూడ్‌ను పూర్తిగా డ్యామేజ్ చేసింది. నటన పరంగా చూస్తే, విజయ్ తన స్టైల్ మ్యానరిజమ్స్‌తో సెకండాఫ్‌లో ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తాడు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో తలపతి వెత్రి కొండన్‌గా ఆయన పలికిన హావభావాలు, డైరెక్ట్ యాక్షన్ మోడ్‌లో చూపించిన బాడీ లాంగ్వేజ్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కదిలించే 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్' సీక్వెన్స్‌లో విజయ్ నటన సినిమాకు ఒక మంచి ఎమోషనల్ యాంకర్‌గా నిలిచింది. ఇక సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించిన మమిత బైజు పీటీఎస్డీ (PTSD) బాధితురాలిగా అద్భుతంగా నటించింది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ స్క్రీన్ మీద చాలా సహజంగా కనిపిస్తాయి. అయితే ప్రతినాయకుడిగా నటించిన బాబీ డియోల్ పాత్ర మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఆయనకు రాసిన 'అమ్రిష్ పూజారి' లేదా జాన్ హిమ్లర్ పాత్ర రాతలోనూ, తీతలోనూ ఎక్కడా పట్టు లేకపోవడంతో ఆ సీన్లు వచ్చినప్పుడల్లా సినిమా స్పీడ్ దెబ్బతింటుంది. పూజా హెగ్డే పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితమైంది, ఆమెకు నటనకు పెద్దగా స్కోప్ దొరకలేదు. ప్రకాష్ రాజ్ తనదైన అనుభవంతో పాత్రకు న్యాయం చేసినా, కొత్తదనం ఏమీ కనిపించదు. గౌతమ్ మీనన్, ప్రియమణి వంటి నటులు ఉన్నప్పటికీ వారి పాత్రలు తేలిపోవడం నిరాశ పరుస్తుంది. టెక్నికల్ డిపార్ట్‌మెంట్ విషయానికి వస్తే, తమిళ సినిమాలకు ఉండే రిచ్‌నెస్ ఈ చిత్రంలో ఎక్కడా కనిపించదు. సినిమాను చాలా హడావుడిగా షూట్ చేసినట్లు ప్రతీ ఫ్రేమ్‌లోనూ తెలుస్తుంది. సినిమాటోగ్రఫీ లైటింగ్ మరియు కలర్ గ్రేడింగ్ విషయాల్లో వర్క్ చాలా డల్లుగా అనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్‌లో వాడిన వీఎఫ్‌ఎక్స్ వర్క్ అయితే ఏమాత్రం బాగోలేదు. ఆఫ్రికా సివిల్ వార్, డ్రోన్లు కాల్పులు జరపడం, రోబోట్లు ఫైట్ చేసుకోవడం వంటి సీన్లు చూస్తుంటే ఏదో లో-బడ్జెట్ వీడియో గేమ్ లేదా యూట్యూబ్ ఏఐ ప్రాంప్ట్ వీడియో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. "రిపబ్లిక్ ఆఫ్ స్వాస్నియా" మరియు జాన్ హిమ్లర్ ట్రాక్ పూర్తిగా సినిమా స్థాయిని తగ్గించేశాయి. సాధారణంగా విజయ్ సినిమాల్లో అనిరుధ్ మ్యూజిక్ ఒక రేంజ్‌లో ఉంటుంది. కానీ ఈ చిత్రంలో 'థలపతి కచేరీ' మరియు 'జననాయక' సాంగ్స్ మినహా మిగతా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా సాధారణంగా, ఏమాత్రం ఇంపాక్ట్ చూపించకుండా ఉంది. ఎడిటింగ్ కూడా అక్కడక్కడా గందరగోళంగా సాగింది, సీన్ల మధ్య కనెక్టివిటీ మిస్సయినట్లు కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా పేలవంగా ఉండి, ఎక్కడా గ్రాండ్ ఫీల్ ఇవ్వలేకపోయాయి. దర్శకుడు హెచ్. వినోద్ "ఖాకీ" లాంటి అద్భుతమైన సినిమా తీసిన దర్శకుడేనా అని ఆశ్చర్యపోయేలా ఈ స్క్రీన్ ప్లే సాగింది. ఒరిజినల్ సినిమాలో ఉన్న ఆత్మీయత, తండ్రీకూతుళ్ల మధ్య ఉండే స్వచ్ఛమైన భావోద్వేగాలు ఇందులో కరవయ్యాయి. కేవలం విజయ్ పొలిటికల్ ఇమేజ్‌ను ఎలివేట్ చేయడానికి, ఆయన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బలవంతంగా ఇరికించిన రాజకీయ డైలాగులు, సన్నివేశాలు సినిమాటిక్ ఫ్లోను పూర్తిగా దెబ్బతీశాయి.ముగింపు దశలో వచ్చే ముప్పై నిమిషాల క్లైమాక్స్ లో మతాల మధ్య చిచ్చు లాంటి సన్నివేశాలు ప్రేక్షకుడి సహనానికి అసలైన పరీక్ష పెడతాయి. సినిమా ముగిసేసరికి ఒక మంచి హీరోకు సరైన ఫేర్‌వెల్ దొరకలేదనే బాధ మాత్రం మిగులుతుంది. మొత్తంగా చూస్తే, ఒరిజినల్ కథను ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించి ఉంటే ఫలితం వేరేలా ఉండేది, కానీ అనవసరమైన ప్రయోగాలు సినిమాను పాత కాలపు టెంప్లేట్ లాగా మార్చేశాయి. ప్లస్ పాయింట్స్ : ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ గుడ్ టచ్ సీక్వెన్స్ రెండు మంచి సాంగ్స్ విజయ్ డ్యాన్స్ మూవ్స్ మైనస్ పాయింట్స్ : ఆకట్టుకోని విలన్ ట్రాక్ నాసిరకం వీఎఫ్‌ఎక్స్ విజువల్స్ బలవంతపు రాజకీయ రిఫరెన్సులు జీవం లేని స్క్రీన్ ప్లే ఫైనల్ వర్డ్ : భగవత్ కేసరి చూడని వాళ్ళకి ఈ మూవీ ఎక్కొచ్చు ఏమో కానీ.. చూసిన మన తెలుగు వాళ్ళకి పై పై మెరుగులతో సంతృప్తి మాత్రమే..! SkyC Rating: 2.25/5
By Venkat Reddy — 23 July 2026