జన నాయగన్ లీక్ వివాదంపై స్పందించిన వినోత్

జన నాయగన్ లీక్ వివాదంపై దర్శకుడు హెచ్ వినోత్ క్లారిటీ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారం చేశారని, జూలై 23న సినిమా విడుదలవుతుందని తెలిపారు.

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ లీక్ వ్యవహారంపై ఆ చిత్ర దర్శకుడు హెచ్. వినోత్ తీవ్రంగా స్పందించారు. సినిమా థియేటర్లలోకి వచ్చే ముందు ఏప్రిల్ నెలలో ఆన్‌లైన్‌లో లీక్ కావడం పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. ఆ సమయంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రాజకీయ లబ్ధి కోసమే చిత్ర బృందం కావాలని ఈ లీక్ చేసిందంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను దర్శకుడు వినోత్ ఖండిస్తూ, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు ఇటువంటి అసత్యాలను ప్రచారం చేశారని స్పష్టత ఇచ్చారు. ఈ లీక్ ఘటన ఏప్రిల్ 2026లో సెన్సార్ సమస్యల వల్ల సినిమా ఆలస్యమవుతున్న సమయంలో చోటుచేసుకుంది. ముందుగా హై డెఫినిషన్ క్లిప్స్, ఆ తర్వాత పూర్తి సినిమా ఆన్‌లైన్ వేదికల్లోకి అక్రమంగా వచ్చేసింది. టెలిగ్రామ్, వాట్సాప్, టారెంట్ సైట్లలో ఈ కంటెంట్ వేగంగా ప్ర వ్యాపించింది. దీంతో నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వెంటనే స్పందించి, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన లీక్ అని ధృవీకరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా తమిళనాడు సైబర్ క్రైమ్ వింగ్ రంగంలోకి దిగి 6 మందిని అరెస్టు చేసి, 300కి పైగా లింకులను తొలగించింది. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాన్ని ఎవరైనా కావాలని ఎలా లీక్ చేస్తారని వినోత్ ప్రశ్నించారు. లీక్ జరిగిన సమయంలో విజయ్ ఎలాంటి అధికారంలో లేరని, పైగా లీక్ అయితే కొన్ని గంటల్లోనే అధికారులకు సమాచారం అందుతుందని గుర్తుచేశారు. ఈ క్రమంలో చిత్ర బృందం కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణను కూడా కోరింది. ఫలితంగా సెన్సార్ బోర్డు స్పందిస్తూ, మార్చ్ 17న డిజిటల్ కాపీని నిర్మాతలకు అప్పగించామని, తమ వైపు నుంచి ఎలాంటి లీక్ జరగలేదని స్పష్టం చేసింది. ఈ వివాదానికి రాజకీయ రంగు పులమడంతో తమిళగ వెట్రి కజగం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌ను టార్గెట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నకు కూడా వినోత్ సమాధానమిచ్చారు. విజయ్ ముందే స్పందించి ఉంటే మరిన్ని రాజకీయ విమర్శలు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. లీక్ వ్యవహారంపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు పూర్తయ్యాయని, చట్టం తన పని తాను చేసుకుపోతోందని మీడియాకు వినోత్ వివరించారు. సెన్సార్ అడ్డంకులు మరియు లీక్ వంటి అనేక సమస్యలను ఎదుర్కొన్న ఈ చిత్రం, ఆరు నెలల ఆలస్యం తర్వాత జూలై 23న థియేటర్లలో విడుదలవుతోంది. విజయ్ నటిస్తున్న ఆఖరి సినిమా కావడంతో ఈ పొలిటికల్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మేనన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. డిజిటల్ పైరసీని అరికట్టేందుకు ప్రేక్షకులు లీక్ కంటెంట్‌ను చూడకుండా థియేటర్లలోనే సినిమాను చూసి మద్దతు ఇవ్వాలని చిత్ర బృందం కోరుతోంది.
By Venkat Reddy — 22 July 2026