IRCTC టికెట్ బుకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు 3 కోట్ల ఐడీలు రద్దు..!
IRCTC టికెట్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత కోసం 3 కోట్ల అనుమానాస్పద ఖాతాలను రద్దు చేశారు. సైబర్ మోసాల అదుపునకు AI సాంకేతికతను వాడుతున్నారు.
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచడంతో పాటు సైబర్ మోసాలను అరికట్టేందుకు ఆర్థిక సంవత్సరంలో కఠిన చర్యలు చేపట్టింది. నిజమైన ప్రయాణికులకు టికెట్ల లభ్యతను సులభతరం చేసేందుకు ఏకంగా 3.03 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను అధికారులు పూర్తిగా డీయాక్టివేట్ చేశారు. ఈ ప్రక్షాళన చర్యలను IRCTC చట్ట అమలు సంస్థల సహకారంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో అత్యంత వేగంగా పూర్తి చేసింది. ఇందులో భాగంగానే 4.18 lakhs అనుమానాస్పద PNRలకు సంబంధించి నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో 501 ఫిర్యాదులను నమోదు చేశారు. ఇదిలా ఉండగా సుమారు 6.05 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను అదనపు ధృవీకరణ ప్రక్రియ కోసం అధికారులు ప్రత్యేకంగా గుర్తించారు. నకిలీ డిజిటల్ గుర్తింపులను అడ్డుకునే క్రమంలో 13,343 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్‌లను కూడా సంస్థ పూర్తిగా బ్లాక్ చేసింది. తత్కాల్ వంటి అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో జరిగే మోసాలను నివారించేందుకు IRCTC సరికొత్త సాంకేతికతలను రంగంలోకి దించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వ్యవస్థల ద్వారా బల్క్ బుకింగ్‌లు చేసే ఏజెంట్ల ఖాతాలపై నిరంతరం నిఘా ఉంచారు. దీంతో తాత్కాలిక లేదా అనుమానాస్పద ఈమెయిల్ ఐడీలతో సృష్టించిన నకిలీ ఖాతాలను సులభంగా గుర్తించి నిష్క్రియం చేయడం సాధ్యమైంది. ఫలితంగా సామాన్య ప్రయాణికులకు తత్కాల్ బుకింగ్ సమయంలో సమాన అవకాశాలు లభిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. రైల్వే టికెట్ బుకింగ్ ప్రక్రియలో భద్రతా చర్యలు పెంచినప్పటికీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రోజుకు సగటున 14.53 లక్షల టికెట్లు అమ్ముడుపోగా, సగటు 13.88 లక్షలుగా మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 16న ఉదయం 10:02 గంటలకు కేవలం ఒకే ఒక్క నిమిషంలో 37,410 టికెట్లు బుక్ అయి సరికొత్త రికార్డు సృష్టించాయి. అలాగే ఆగస్టు 19న ఒకే రోజులో అత్యధికంగా 18.40 లక్షల టికెట్ల బుకింగ్ నమోదైంది. నకిలీ ఖాతాలు, సైబర్ మోసాలు, బల్క్ బుకింగ్‌లపై తీసుకుంటున్న ఈ కఠిన చర్యల వల్ల బుకింగ్ వ్యవస్థ మరింత సురక్షితంగా మారుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు తమ ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయని IRCTC స్పష్టం చేసింది.