జీవీ ప్రకాష్ కుమార్, కయాదు లోహర్ జంటగా నటించిన 'ఇమ్మోర్టల్' మూవీ సెప్టెంబర్ 4న విడుదల కానుంది. థియేటర్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
జీవీ ప్రకాష్ కుమార్, కయాదు లోహర్ జంటగా నటించిన తమిళ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సర్వం సిద్ధం చేశారు. తాజాగా డిఎన్‌సి థియేటర్స్ సర్క్యూట్ ఈ సినిమాకు సంబంధించిన అధికారిక బుకింగ్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ చూసిన సినీ ప్రియులు తీవ్ర ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాలో జీవీ ప్రకాష్, కయాదు లోహర్ల వర్షంలో సాగే రొమాంటిక్ దృశ్యాన్ని పోస్టర్ ద్వారా ప్రదర్శించారు. ప్రస్తుతం ప్రకటించిన ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మరికొద్ది రోజుల్లోనే అన్ని ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని థియేటర్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ కథలో కథానాయకుడు తానుష్టపడిన యువతి ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత అతని జీవితం ఎలా మారిపోయిందో చూపిస్తారు. దీంతో సాధారణంగా ప్రారంభమయ్యే రొమాంటిక్ ప్రయాణం ఒక రాత్రిలోనే భయానక భ్రమగా మారుతుంది. ఇదిలా ఉండగా 4,000 సంవత్సరాల పూర్వంనాటి వింత కథతో పాటు గబ్బిలం రూపంలో ఉండే భయానక జీవి ఈ కథలో కీలకంగా మారనుంది. ఇటీవలే ధనుష్ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఫలితంగా సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు భాషలో విడుదలైన టీజర్ కూడా విశేషమైన స్పందనను దక్కించుకుంది. ఈ చిత్రానికి మరియప్పన్ చిన్న దర్శకత్వం వహించగా, సామ్ సిఎస్ సంగీతం అందించారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషలలో కూడా ఒకేసారి విడుదల కానుంది. ప్రస్తుతం ప్రేక్షకులు సెప్టెంబర్ 4వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ఏ విధమైన ఘనవిజయాన్ని సాధిస్తుందో చూడాలి.