ఐటీ కంపెనీలకు ఎర్లీ లాగౌట్ ఇవ్వండి - హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్‌లో భారీ వర్షాల హెచ్చరిక. సాయంత్రం వర్షం తీవ్రత పెరిగే అవకాశం. ఐటీ కంపెనీలకు ఎర్లీ లాగౌట్ సూచన, పోలీసుల అలర్ట్.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజధాని హైదరాబాద్ నగరంలోనూ గురువారం సాయంత్రం వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గురువారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో విడుద‌ల చేసిన ఐదు రోజుల వాతావరణ ఫోర్‌కాస్ట్‌లో ఈ విషయాలను వెల్లడించారు. నగరంతో పాటు తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. బుధవారం కుమురంభీం జిల్లాలో ఏకంగా 188.8 మిలీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అలాగే మంచిర్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సైతం 150 మిలీమీటర్లకు పైగా వర్షం పడింది. హైదరాబాద్‌లో కూడా బుధవారం నుంచి అక్కడక్కడా వాన పడుతుండగా, గురువారం ఉదయం నుంచే వాతావరణం చల్లబడి జల్లులు కురుస్తున్నాయి. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం గురువారం రాత్రి వరకు పూర్తిస్థాయిలో కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ప్రకారం ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. దీంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు. అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సాయంత్రం తర్వాత వర్షం తీవ్రత మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. వర్షాల వల్ల నగరంలో భారీగా నీరు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ముప్పు పొంచి ఉంది. ఫలితంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ కేటాయించాలని సూచించారు. ఆఫీసుల్లో ఉన్న సిబ్బందికి త్వరగా ఎర్లీ లాగౌట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం అందుతోంది. రోడ్లపై జలమయం అయ్యే అవకాశం ఉన్నందున వాహనదారులు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని పోలీసులు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు రావడం, రోడ్లు బాగా జారుడుగా మారడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ప్రత్యేకంగా హెచ్చరించింది. అనవసర ప్రయాణాలను పూర్తిగా వాయిదా వేసుకోవడమే మంచిదని సూచించారు. లోతట్టు ప్రాంత వాసులు మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు. రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత క్రమంగా తగ్గుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాహనదారులు నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ, పోలీసుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
By V Sudhakar — 30 July 2026