హనుమాన్ అంశ్ మూవీ రూ 54 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ అయింది. నీమ్ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ రిలీజ్ వివరాలు ఇవే.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రూ 2 కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన హనుమాన్ అంశ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని సాధించింది. నీమ్ కరోలి బాబా జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ హిందీ భక్తి నాటకం పెద్ద నటులు, ప్రచారం లేకుండానే విడుదల కాగా, వర్డ్ ఆఫ్ మౌత్‌తో అనూహ్యంగా పుంజుకుని 2026లోనే అత్యంత లాభదాయకమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఎలాంటి ప్రచార ఆర్బాటం లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చి మొదటి రోజు కేవలం రూ 10 లక్షలు మాత్రమే రాబట్టింది. ఆరంభంలో కలెక్షన్లు నిరాశపరచడంతో తొలి రెండు వారాల్లో రూ 1.5 కోట్ల లోపే నికర వసూళ్లు రాబట్టి, రెండో వారానికి కేవలం 40 స్క్రీన్లకు పరిమితమైంది. అయితే మూడో వారం నుంచి భక్తులు, సోషల్ మీడియా సిఫార్సుల వల్ల అనూహ్యమైన పాజిటివ్ టాక్ పెరగడంతో థియేటర్ల సంఖ్యను పెంచారు. ఫలితంగా నాలుగో వారాంతం పూర్తయ్యే సరికి ఈ సినిమా రూ 28 కోట్లకు పైగా నికర వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ మొదటి వారం నాటికి హనుమాన్ అంశ్ చిత్రం భారతదేశంలో నికర వసూళ్లు రూ 54 కోట్లు దాటగా, గ్రాస్ వసూళ్లు రూ 63 కోట్లకు చేరుకున్నాయి. దీంతో నిర్మించిన బడ్జెట్‌తో పోలిస్తే 20 రెట్లకు పైగా ఆదాయం పొంది 2000 శాతానికి పైగా లాభాలను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా, పెద్ద బడ్జెట్‌తో భారీ అంచనాల మధ్య వచ్చిన ధురంధర్ 2, చిత్రాలను లాభాల శాతంలో ఈ చిన్న సినిమా అధిగమించడం విశేషం. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో స్వాంభూ మీడియా నెట్‌వర్క్ నిర్మించిన ఈ చిత్రంలో శోభినావ్ సత్యా, చందన్ ఆనంద్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలో, ఈ సంచలన విజయాన్ని చూసిన ప్రముఖ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సెప్టెంబర్ 3న అధికారిక ప్రకటన చేస్తూ, సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్‌లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. నీమ్ కరోలి బాబాకు గ్లోబల్ స్థాయిలో స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్, విరాట్ కోహ్లీ వంటి ప్రముఖ అనుచరులు ఉన్నందున అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా భారీ స్పందన వస్తుందని భావిస్తున్నారు. ఈ చిత్రం ఆధ్యాత్మిక ప్రేమికులతో పాటు సామాన్య ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నుండి కూడా ప్రశంసలు అందుకుంది. ఆమె ఈ సినిమాను ఒక థెరపీ అని కొనియాడారు. దర్శకుడు విశాల్ చతుర్వేది కూడా సినిమా ముగింపులో ఇచ్చిన సూచనల ప్రకారం, త్వరలోనే హనుమాన్ అంశ్ సీక్వెల్‌పై పనులు ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏర్పడిన పోటీలో చిన్న బడ్జెట్ సినిమాలు సరైన కథ, భక్తి భావం ఉంటే బాక్సాఫీస్ వద్ద ఎంతటి అద్భుతాలు సృష్టిస్తాయో ఈ చిత్రం నిరూపించింది. ఎలాంటి ప్రచారం లేకపోయినా ప్రేక్షకుల ఆదరణే సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్తుందో ఇది ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు ఓవర్సీస్ విడుదలతో ఈ చిత్రం అంతర్జాతీయంగా కూడా మరిన్ని సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.