బోర్న్‌విటా ప్రకటనలపై FSSAI సీరియస్..!

బోర్న్‌విటా తప్పుదోవ పట్టించే ప్రచారాలపై FSSAI కఠిన చర్యలు చేపట్టింది. ఇ-కామర్స్‌లో హెల్త్ క్లెయిమ్‌లను మాండెలెజ్ ఉపసంహరించుకుంది.

ప్రముఖ మాల్ట్ పానీయం బోర్న్‌విటాపై ఉన్న తప్పుదోవ పట్టించే ఆరోగ్య, పోషకాహార ప్రకటనల విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక చర్యలు చేపట్టింది. కంపెనీ ప్రచారం చేస్తున్న ఆరోగ్య క్లెయిమ్‌లను ఇ-కామర్స్ వేదికల నుంచి వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదేశించడంతో మాండెలెజ్ ఇండియా ఆయా యాడ్స్‌ను తొలగించింది. పిల్లలకు ఈ పానీయం ద్వారా ఎదుగుదల, బలం లభిస్తాయని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా ప్రచారం చేయడంపై రెగ్యులేటర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ చర్యల కారణంగా మార్కెట్‌లో బోర్న్‌విటా ఉత్పత్తి అమ్మకాలపై ఎలాంటి నిషేధం విధించలేదని, కేవలం ప్యాకేజింగ్ మరియు ప్రకటనల నిబంధనలను మాత్రమే మార్చాలని అధికారులు స్పష్టం చేశారు. గత కొన్ని ఏళ్లుగా బోర్న్‌విటాలో ఉండే చక్కెర శాతంపై తీవ్ర స్థాయిలో జాతీయ స్థాయిలో చర్చలు నడిచాయి. 2023లో ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ విడుదల చేసిన విశ్లేషణాత్మక వీడియో తర్వాత ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. దీంతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) కూడా ఈ ప్యాకేజింగ్ ప్రకటనలపై సమీక్ష జరపాలని కంపెనీని కోరింది. ఆ తదనంతరం వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం ఇ-కామర్స్ వేదికలలో బోర్న్‌విటాను హెల్త్ డ్రింక్ విభాగం నుంచి తొలగించాలని ఆదేశించింది, ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ చట్టంలో హెల్త్ డ్రింక్ అనే పదానికి ఎలాంటి ప్రత్యేక నిర్వచనం లేదు. 2026 నాటికి కూడా కొన్ని ప్యాకెట్లపై పాత రకం ప్రకటనలు కొనసాగుతుండటంతో FSSAI మళ్లీ రంగంలోకి దిగింది. ఈ నిబంధనల ఉల్లంఘనను పరిశీలించిన FSSAI అధికారులు మాండెలెజ్ సంస్థపై ప్రధానంగా రెండు రకాల లోపాలను గుర్తించి నోటీసులు ఇచ్చారు. మిస్‌లీడింగ్ హెల్త్ క్లెయిమ్స్ తో పాటు న్యూట్రియెంట్ కంపారిటివ్ క్లెయిమ్స్ నిబంధనలను కంపెనీ అతిక్రమించిందని స్పష్టం చేశారు. దీంతో స్పందించిన తయారీ సంస్థ తన డిజిటల్ ప్రకటనలను, ఆన్‌లైన్ వివరణలను తొలగించి భవిష్యత్తులో అధికారిక నిబంధనలకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చింది. ఇదిలా ఉండగా FSSAI కేవలం ఒక్క బోర్న్‌విటాకే పరిమితం కాకుండా వినియోగదారులను మభ్యపెట్టే ప్రచారాలు చేస్తున్న దాదాపు 150కి పైగా ప్రముఖ కంపెనీలకు హెచ్చరికలు జారీ చేసింది. ఫలితంగా నెస్లే, పెప్సికో, కోకాకోలా, రెడ్‌బుల్, డానోన్, అబాట్ మరియు అమ్‌వే వంటి బహుళజాతి సంస్థలు కూడా ఈ నోటీసుల పరిధిలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అమ్‌వే సంస్థ తన కొబ్బరినూనె ఉత్పత్తులపై ఉండే 100 శాతం ప్యూర్ అనే ప్రచార ప్రకటనను వెనక్కి తీసుకోగా, మరో బేబీ ఫుడ్ సంస్థ ప్యాకేజింగ్ మార్చే వరకు వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా మూసివేసింది. ప్రకటనల నియంత్రణ చట్టం 2018 ప్రకారం ఆహార పదార్థాల ఆరోగ్య ప్రయోజనాల క్లెయిమ్స్ కు కచ్చితమైన మానవ ఆధారిత శాస్త్రీయ అధ్యయనాలు అవసరమని అధికారులు నొక్కి చెప్పారు. ఉల్లంఘనలు నిరూపితమైతే చట్టంలోని సెక్షన్ 53 కింద భారీ జరిమానాలు విధిస్తామని రెగ్యులేటర్ గట్టి హెచ్చరికలు చేసింది. రాబోయే రోజుల్లో ఆఫ్‌లైన్ రిటైల్ షాప్‌లలో అందుబాటులో ఉన్న పాత ప్యాకేజింగ్ స్టాక్ స్థానంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2026 నాటికి కొత్త ప్యాకేజింగ్ విధానం రానుంది. ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ లేబులింగ్ ద్వారా ఉత్పత్తులలో ఉండే చక్కెర, ఉప్పు మరియు కొవ్వు శాతాలను స్పష్టంగా ప్రదర్శించేలా FSSAI కొత్త నిబంధనలు తీసుకరాబోతోంది. ఆఫ్‌లైన్ ప్యాకేజింగ్ మార్పు ప్రక్రియ ఎంత వేగంగా జరుగుతుందనే అంశంపై ప్రస్తుతం మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. అదే సమయంలో బిస్కెట్లు, ఎనర్జీ డ్రింక్స్ విభాగాల్లో ఉన్న ఇతర ప్రముఖ బ్రాండ్లపై కూడా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ వివాదం ద్వారా వినియోగదారులలో మరియు ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులలో అవగాహన పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రకటనలు చూసి పిల్లల ఎదుగుదల కోసం పానీయాలను కొనుగోలు చేసే ముందు వాటిలోని పోషకాల వివరాలను గమనించడం అత్యవసరం. బోర్న్‌విటా అమ్మకాలు నిరాటంకంగా కొనసాగుతున్నప్పటికీ, కంపెనీలు తమ వ్యాపార ప్రచారాల కోసం తప్పుదోవ పట్టించే క్లెయిమ్స్ చేయడానికి వీల్లేదని ఈ సంఘటన స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం స్పష్టమైన సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా FSSAI తీసుకుంటున్న చర్యలు ఆహార భద్రతలో కీలక మార్పుకు దారితీస్తున్నాయి.
By V Sudhakar — 25 August 2026