హార్మూజ్ జలసంధి అమెరికా సొంతం.. ట్రంప్ సంచలన పోస్ట్
హార్మూజ్ జలసంధిని "కొత్త అమెరికా భూభాగం"గా పేర్కొంటూ ట్రంప్ సంచలన మ్యాప్ షేర్ చేశారు. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు. పూర్తి వివరాలు ఇవే.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పతాక స్థాయికి చేరుతున్నాయి. తాజాగా డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో హార్మూజ్ జలసంధిని "కొత్త అమెరికా భూభాగం"గా పేర్కొంటూ ఒక మ్యాప్‌ను పోస్ట్ చేశారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలసంధిపై ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమేనా లేదా అమెరికా అనుసరించబోయే వ్యూహమా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వివాదానికి ప్రధాన కారణం జూన్ నెలలో కుదిరిన ఇరాన్-అమెరికా ఒప్పందం. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గలీబఫ్ ఈ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. హార్మూజ్ దిగ్బంధం తొలగించడం, చమురు ఆంక్షలు ఎత్తివేయడం, విదేశాల్లోని తమ ఆస్తుల విడుదల జరగాలని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా ఈ డిమాండ్లను అంగీకరించకపోతే, హార్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఆయన ఇరాన్ స్టేట్ టీవీ వేదికగా హెచ్చరించారు. దీంతో ట్రంప్ ఒక్కసారిగా రంగంలోకి దిగి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. గతంలోనే హార్మూజ్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని, దిగ్బంధం ద్వారా దీనిని కంట్రోల్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తాను హార్మూజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నానని గతంలోనే మండేరోస్‌తో చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజా మ్యాప్ పోస్ట్ ద్వారా ఒమన్ వంటి దేశాలకు కూడా హెచ్చరికలు పంపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా భద్రతా పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఒకవేళ ఒమన్ ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుంటే, తీవ్రమైన మిలిటరీ చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచ దేశాల చమురు సరఫరాలో దాదాపు 20 శాతానికి పైగా హార్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఫలితంగా ఈ కీలక జలమార్గంపై అమెరికా తన పట్టును బిగించాలని చూడటం అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం హార్మూజ్ జలసంధి ఏ ఒక్క దేశానికి చెందిన భూభాగం కాదు. ఇది ఇరాన్ మరియు ఒమన్ దేశాల ప్రాదేశిక జలాల్లో ఉన్న అంతర్జాతీయ జలమార్గం మాత్రమే. ట్రంప్ చేస్తున్న ఇటువంటి ప్రకటనలు చట్టబద్ధత కంటే రాజకీయ సంకేతాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. గతంలోనే ఆయన "స్ట్రెయిట్ ఆఫ్ ట్రంప్" పేరుతో చేసిన మ్యాపులు రాజకీయ వ్యూహాల్లో భాగంగానే చోటు చేసుకున్నాయని గుర్తు చేస్తున్నారు.