ఢిల్లీలో అలర్ట్: 480 పాకిస్థాన్ సోషల్ ఖాతాలు బ్లాక్
ఢిల్లీ విద్యార్థుల నిరసనల వేళ పుకార్లు రేపుతున్న 480 పాకిస్థాన్ సోషల్ మీడియా ఖాతాలను ఢిల్లీ పోలీసులు బ్లాక్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనలను ఆసరాగా చేసుకుని దేశంలో అశాంతిని రేకెత్తించేందుకు పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే విదేశాల నుంచి సాగుతున్న పెద్ద డిజిటల్ కుట్రను ఢిల్లీ పోలీసులు పక్కా సమాచారంతో ఛేదించారు. నిరసనల వేళ తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు, మార్ఫ్ చేసిన వీడియోలను వ్యాప్తి చేస్తున్న 480 పాకిస్థాన్ ఆధారిత సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు గుర్తించి వెంటనే బ్లాక్ చేశారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు డిజిటల్ నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు ప్రారంభించారు. ఈ వివాదం నీట్ పేపర్ లీక్ అంశానికి సంబంధించినది కావడం గమనార్హం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జంతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు హింసకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనల తీవ్రత కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఢిల్లీ మెట్రో ఏకంగా 17 స్టేషన్లను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. దీంతో ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని పాకిస్థాన్ ప్లాన్ చేసింది. ఇదిలా ఉండగా, గతంలో 2025 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో చురుగ్గా పనిచేసిన ఖాతాలే ఇప్పుడు మళ్లీ రీ-యాక్టివ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ఈ నెట్‌వర్క్ నకిలీ నివేదికలతో ఉద్రిక్తతలను పెంచడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఇప్పుడు మళ్లీ అవే ఖాతాలు విద్యార్థుల ఉద్యమాన్ని దుర్వినియోగం చేస్తూ అశాంతిని పెంచేందుకు కుట్ర పన్నుతున్నట్లు పోలీసుల ఇంటెలిజెన్స్ తనిఖీల్లో స్పష్టమైంది. ఫలితంగా సైబర్ సెల్ బృందాలు 24 గంటల పాటు సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విచారణ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి ఒక అధికారిక వీడియో సందేశంలో వెల్లడించారు. సోషల్ మీడియాలో ఎలాంటి నిరాధారమైన పోస్టులు లేదా మార్ఫ్ చేసిన కంటెంట్‌ను షేర్ చేసినా సైబర్ చట్టాల కింద కఠిన శిక్షలు ఉంటాయని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు సాధారణ ప్రజలతో పాటు ముఖ్యంగా యువత, విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియాలో ఏదైనా సమాచారం లేదా వీడియో కనిపిస్తే దాన్ని షేర్ చేసే ముందు ప్రామాణికతను, వాస్తవాలను తప్పక సరిచూసుకోవాలని కోరారు. అనామక ఖాతాల నుంచి వచ్చే మార్ఫ్ వీడియోలను, ఆధారాలు లేని పుకార్లను అస్సాతు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం కల్పించిన శాంతియుత నిరసన హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. తెలిసీ తెలియక పోస్టులు షేర్ చేసి దేశ వ్యతిరేక శక్తులకు పరోక్షంగా సహకరించవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు. మరోవైపు పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఈ పరిణామాలపై స్పందించడానికి నిరాకరిస్తూ, ఇది పూర్తిగా భారత్ అంతర్గత విషయమని పేర్కొంది. డిజిటల్ మీడియా ద్వారా విదేశీ శక్తులు దేశీయ ఉద్యమాలను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉన్నందున ప్రతీ పౌరుడు అప్రమత్తంగా ఉండటం అత్యవసరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.