లోకేష్ కనకరాజ్ హీరోగా, అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ‘డీసీ’ మూవీ రివ్యూ. నటన, మ్యూజిక్, రేటింగ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
సినిమా పేరు: డీసీ (DC) నటీనటులు: లోకేష్ కనకరాజ్, వామిక గబ్బి, సంజన కృష్ణమూర్తి, కస్తూరిరాజా, తదితరులు. సంగీతం: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: ముకేష్ నిర్మాత: కళానిధి మారన్ (సన్ పిక్చర్స్) రచన - దర్శకత్వం: అరుణ్ మాదేశ్వరన్ కథ: దేవదాస్ అనబడే దాసు చిన్నతనంలోనే తన కళ్ల ముందే తన తల్లిని కోల్పోతాడు. ఆ బాధతో రగిలిపోయి, తప్పు చేసిన వాళ్లను నేరుగా ఖతం చేసి చిన్న వయసులోనే జైలుపాలవుతాడు. ఇయర్లు గడిచి బయటికి వచ్చాక, సాధారణ బతుకు బతకాల్సింది పోయి పెద్ద రౌడీ గ్యాంగ్‌లో చేరిపోతాడు. రకరకాల నేరాలతో పోలీసుల మోస్ట్ వాంటెడ్ జాబితాలో నెంబర్ వన్ స్థానానికి వెళ్తాడు. ఒకానొక సందర్భంలో పోలీసుల ఆయుధాలన్నీ కొల్లగొట్టి, ఏకంగా ఒక ఎస్ఐని లేపేయడంతో డిపార్ట్‌మెంట్ మొత్తం దాసు కోసం వేట మొదలుపెడుతుంది. దీంతో దాసు తన గ్యాంగ్‌తో కలిసి ఊరు వదిలి పారిపోవాల్సి వస్తుంది. ఈ పరుగు ప్రయాణంలో అతనికి చంద్ర అనే వేశ్య పరిచయం అవుతుంది. ఈ ఊహించని పరిచయం దాసు జీవితాన్ని ఏలుతుంది. మరోపక్క పోలీసుల ఉచ్చు బిగుసుకుంటున్న తరుణంలో దాసు, చంద్రల బతుకులు ఏ తీరానికి చేరాయి? అనేది మిగతా సినిమా. విశ్లేషణ: సినిమా అంటేనే ఒక విజువల్ మ్యాజిక్. ఒక్కోసారి కథలో పెద్దగా బలం లేకపోయినా, టేకింగ్ తోనూ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనూ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోవచ్చు. 'డీసీ' సినిమా విషయానికి వస్తే సరిగ్గా ఇదే జరిగింది. తమిళంలో వరుస హిట్లు కొట్టి, దర్శకుడిగా అందరితో శభాష్ అనిపించుకున్న లోకేష్ కనకరాజ్ ఈసారి ఏకంగా కెమెరా ముందుకొచ్చి హీరోగా నటించడం అనేది అందరికీ ఒక సర్‌ప్రైజ్. అరుణ్ మాదేశ్వరన్ లాంటి వైవిధ్యమైన దర్శకుడు ఈ కథను ఎంచుకున్న తీరు చూస్తేనే అర్థమవుతుంది ఇది రొటీన్ కమర్షియల్ రప్పా రప్పా సినిమా కాదని. సినిమా మొదలైన మొదటి పది నిమిషాల నుంచే దర్శకుడు మనల్ని ఒక రా అండ్ రస్టిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. కథ అంటూ పెద్దగా కిచికిచి పెట్టే సబ్జెక్ట్ ఏమీ లేదు. ఒక రౌడీ, పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోవడం, మధ్యలో హీరోయిన్ కలవడం, ఈ ప్రయాణంలో వచ్చే హింస ఇవే ఈ సినిమాలోని మెయిన్ పాయింట్లు. ఇవన్నీ వినడానికి సింపుల్‌గా అనిపించినా, తెరమీద చూస్తున్నప్పుడు ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. సినిమా నడుస్తున్న తీరు చూస్తుంటే ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్తపడ్డాడు దర్శకుడు. ముఖ్యంగా హీరో గ్యాంగ్ పోలీసుల మీద అటాక్ చేయడం, మళ్లీ పోలీసులు వీళ్ల మీద ఎదురుదాడికి దిగడం.. ఈ సీన్లే సినిమాలో డెబ్బై నుంచి ఎనభై శాతం కనిపిస్తాయి. సాధారణంగా ఇలాంటి రిపీటెడ్ యాక్షన్ సీన్లు వస్తే ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. కానీ ఇక్కడ ఆ చిరాకు రాకుండా దర్శకుడు తన టేకింగ్ తో మ్యాజిక్ చేశాడు. వయొలెన్స్ హద్దులు దాటిపోయినా సరే, ఆ సన్నివేశాల్లో ఒక పొయెటిక్ అప్రోచ్ కనిపించడం విశేషం. రక్తపాతం కళ్లముందు కనిపిస్తున్నప్పటికీ, అది జుగుప్స కలిగించకుండా కేవలం ఒక కథలో భాగంగా మనల్ని కదిలిస్తుంది. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు నూటికి నూరు పాళ్లు మాట్లాడుకోవాల్సిన వ్యక్తి అనిరుధ్ రవిచందర్. తన మ్యూజిక్‌తో ఈ సినిమా స్థాయిని ఏకంగా పదేళ్లు ముందుకు తీసుకెళ్లాడు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ముకేష్ పనితనం ప్రతీ ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. చీకటి కోణాలను, ఎండ తగలని పల్లెటూరి వాతావరణాన్ని, పోలీసు స్టేషన్లలోని ఆ నీలిరంగు లేదా పసుపు రంగు లైటింగ్ షేడ్స్‌ని చూపించిన విధానం మూడ్‌కి తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. కెమెరా యాంగిల్స్ కూడా చాలా చోట్ల హీరో ఎలివేషన్‌ని ఎక్కడికో తీసుకెళ్లాయి. లో-యాంగిల్ షాట్స్ ద్వారా రౌడీ పాత్రలోని ఇంటెన్సిటీని మరింత పెంచారు. ఎడిటింగ్ పరంగా చూస్తే జీకే ప్రసన్న కత్తెరకు ఎక్కడా పదును తగ్గలేదు. సినిమా నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించినా, అనవసరమైన సాగదీత లేకుండా ప్రతీ సీన్‌ని పకడ్బందీగా కట్ చేశారు. నటీనటుల విషయానికి వస్తే, లోకేష్ కనకరాజ్ మొదటిసారే కెమెరా ముందుకు వచ్చినా ఎక్కడా తడబడలేదు. తన మొఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ పెట్టకుండా, కేవలం ఆ సీరియస్ లుక్స్‌తోనే పాత్రను మోశాడు. దేవదాస్ పాత్ర స్వభావానికి లోకేష్ బాడీ లాంగ్వేజ్ సరిగ్గా సరిపోయింది. డైలాగులు పెద్దగా చెప్పకపోయినా, తన ఉనికితోనే తెరని నింపేశాడు. ఇక ఈ సినిమాకు అసలైన ప్రాణం పోసింది మాత్రం వామిక గబ్బి. చంద్ర పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు చూస్తుంటే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. గ్లామర్ పాత్రల నుంచి బయటికి వచ్చి ఇలాంటి ఇంటెన్స్, బోల్డ్ క్యారెక్టర్ చేయడం నిజంగా సాహసమే. ఆ పాత్రలో ఆమె పలికించిన హావభావాలు, ఆవేదన సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. హీరోతో ఆమెకు ఏర్పడే పరిచయం, ఆ తర్వాత వచ్చే డెప్త్ సీన్లలో ఆమె నటన చూశాక థియేటర్ నుంచి బయటకొచ్చినా ఆ పాత్ర తాలూకు ప్రభావం మన వెంట ఉంటుంది. ఇక సెకెండ్ హాఫ్‌లో వచ్చే చిన్న పాత్రలైనా, గ్యాంగ్‌లోని ఇతర నటులైనా తమ పరిధి మేరకు బాగానే నటించారు. ముఖ్యంగా పోలీసు ఆఫీసర్‌గా చేసిన నటుడి హావభావాలు, ఆ గొంతులోని బెదిరింపు వాతావరణం సినిమాకు మంచి టెన్షన్‌ను తెచ్చిపెట్టాయి. హీరో గ్యాంగ్‌లో ప్రతీ ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమా ప్రయాణం మొత్తం ఒకే లైన్ మీద సాగినా, సాంకేతిక విలువలు దీనిని నిలబెట్టాయి. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు ప్రతీ రూపాయి స్క్రీన్ మీద కనిపించేలా చేశాయి. గ్రాండియర్‌గా కాకుండా కథ డిమాండ్ చేసిన మేరకు చాలా సహజంగా సెట్లు వేసి, లొకేషన్లను ఎంచుకున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర అనిరుధ్ కొట్టిన ఆ రాజ్ ఆఫ్ రాగ్ బీజీఎం థీమ్ థియేటర్లలో ఈలలు వేయిస్తుంది. ఆ ఒక్క సీన్‌తోనే సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. క్లైమాక్స్ దిశగా కథ వెళ్లే కొద్దీ పాత్రల మధ్య వచ్చే సంఘర్షణ మరింత బలపడుతుంది. ఎక్కడా కూడా సినిమా ట్రాక్ తప్పకుండా దర్శకుడు చివరి వరకు ఒకే గ్రిప్‌తో నడిపించాడు. కొన్ని చోట్ల నేటివిటీ సమస్యలు ఇబ్బంది పెట్టినా, ఆ సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ ఆ లోపాలన్నింటినీ కప్పిపడేస్తాయి. మొత్తానికి చూస్తే, ఇది ఒక రొటీన్ మాస్ సినిమా కాదు. ఒక డిఫరెంట్ జోనర్‌లో వచ్చిన రా అండ్ రస్టిక్ డ్రామా. ప్లస్ పాయింట్స్ : అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వామిక గబ్బి నటన టేకింగ్, విజువల్స్ ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ : నెమ్మదైన కథనం తమిళ నేటివిటీ ఫ్లేవర్ రొటీన్ స్టోరీ లైన్ ఫైనల్ వర్డ్ : రొటీన్ కమర్షియల్ హంగులకు దూరంగా, కేవలం రా ఎమోషన్స్, అదిరిపోయే టెక్నికల్ వాల్యూస్ నమ్ముకుని తీసిన సినిమా ఇది. అనిరుధ్ మ్యూజిక్ కోసం, వామిక గబ్బి అద్భుతమైన నటన కోసం ఈ వారాంతంలో ఈ చితారాన్ని ఒకసారి నిరభ్యంతరంగా చూడవచ్చు. SkyC Rating: 2.75/5