ఏపీ ఆర్థిక పునరుద్ధరణపై ప్రొగ్రెస్ రిపోర్ట్ విడుదల చేసిన సీఎం

ఏపీలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో సీఎం చంద్రబాబు ఆర్థిక ప్రొగ్రెస్ రిపోర్ట్ విడుదల చేశారు. గత నష్టాలు, ప్రస్తుత పెట్టుబడుల వివరాలు అందులో పొందుపరిచారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర ప్రొగ్రెస్ రిపోర్ట్‌ను విడుదల చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తీవ్ర నష్టాలను చవిచూసిందని విమర్శిస్తూ, ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ స్పష్టమైన అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో విధ్వంసానికి గురైన వ్యవస్థలను బాగు చేస్తూ రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనా సంస్కరణలు, సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏడు కీలక శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసి రాష్ట్ర అసలు పరిస్థితిని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. తిరుపతి వేదికగా జూన్ 12న జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. ఈ క్రమంలో జూన్-జూలై నెలల్లో వివిధ శాఖల కార్యాచరణ నివేదికలు సిద్ధం చేసి, తాజాగా సమగ్ర ఆర్థిక ప్రొగ్రెస్ రిపోర్ట్‌ను అందుబాటులోకి తెచ్చారు. 2019-24 మధ్య కాలంలో రాజ్యాంగ వ్యవస్థలు తీవ్రంగా నిర్వీర్యమయ్యాయని, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిని పారిశ్రామికవేత్తలు వెళ్లిపోయారని చంద్రబాబు ఆరోపించారు. దీంతో జీఎస్‌డీపీ వృద్ధిరేటు 3.18 శాతం తగ్గి, రాష్ట్రానికి ఏకంగా రూ.6.94 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని గణాంకాలతో వివరించారు. విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.95,231 ఉండగా, తెలంగాణలో రూ.1,24,104, ఏపీలో రూ.93,903గా నమోదు నమోదైంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సీఏజీఆర్ 13.5 శాతం వృద్ధి సాధించేలా చర్యలు వేగవంతం చేశామని సీఎం పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ గణాంకాలపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అప్పుల ఊబిలో మునిగిపోతోందని, సంక్షేమ హామీలు, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలో విఫలమైందని ఆరోపిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు ముమ్మరమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రతి ఏటా పారదర్శకత కోసం ప్రొగ్రెస్ రిపోర్ట్ విడుదల చేస్తామని ప్రకటించి, ప్రతిపక్షాల విమర్శలకు తమ మార్కు అభివృద్ధి సమాధానం చెబుతుందని ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ప్రభుత్వం 28 నూతన పారిశ్రామిక విధానాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఉత్తరాంధ్రను పారిశ్రామిక హబ్‌గా మార్చేలా ఐటీ, ఫార్మా, ఏఐ, స్టీల్ రంగాల్లో భారీ పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడుల ఆసక్తి లభించిందని, దీని ద్వారా 23 లక్షల ఉద్యోగాలు సాధ్యమవుతాయని నివేదిక పేర్కొంది. పి4 విధానం ద్వారా 2.4 లక్షల కుటుంబాలకు సాయం అందించడంతో పాటు గూగుల్ ఏఐ డేటా సెంటర్, అర్సెలోర్‌మిట్టల్ వంటి బహుళజాతి ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఎంతో కీలకమైనవని సీఎం పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలను నిరంతరాయంగా అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రైల్వేలు, రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు సమకూరుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో పారదర్శక పాలన అందిస్తూ, ఆర్ధిక వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
By Venkat Reddy — 04 August 2026