అరకులో సంజీవని హెల్త్‌కేర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నా సీఎం

అరకులో సంజీవని డిజిటల్ ఆరోగ్య ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో ఉచిత ఏఐ టెలిమెడిసిన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల గ్రామంలో పర్యటిస్తున్నారు. గిరిజన ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రూపొందించిన సంజీవని డిజిటల్ హెల్త్‌కేర్ ప్రాజెక్టును గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆయన అధికారికంగా ప్రారంభించనున్నారు. కష్టతరమైన కొండ ప్రాంతాల్లో సాధారణంగా వైద్య సేవలు చేరడం ఆలస్యమయ్యే పరిస్థితిని మార్చడానికి ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి ఉదయం 10 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి గన్నెల జంక్షన్‌కు చేరుకుంటారు. తొలుత రామకృష్ణానగర్‌లో సరబోయిన్ డొన్ను అనే వృద్ధుడి ఇంటిని సందర్శించి వారి బాగోగులు, సామాజిక-ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని సంజీవని ప్రయోజనాలను వివరిస్తారు. ఆ తర్వాత గన్నెల పీహెచ్‌సీ వద్ద సంజీవని ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించి ప్రజావేదిక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రతి పౌరుడికి యూనిక్ హెల్త్ కార్డ్ లేదా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అందిస్తారు. ఇందులో పూర్తి వైద్య చరిత్ర, డయాగ్నొస్టిక్ రిపోర్టులు, చికిత్స వివరాలు భద్రంగా నిల్వ ఉంటాయని అధికారులు తెలిపారు. దీంతో రోగులు ఫిజికల్ రికార్డులు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండానే పీహెచ్‌సీల నుంచి స్టేట్ లెవల్ ఆసుపత్రుల వరకు డేటా రియల్ టైమ్‌లో సింక్ అవుతుంది. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టులో ఏఐ ఆధారిత వైద్య సహాయం, టెలిమెడిసిన్ మరియు రిమోట్ హెల్త్‌కేర్ సేవలను నిరంతరం అందుబాటులో ఉంచుతారు. టాటా గ్రూప్ సహకారంతో అమలవుతున్న ఈ డిజిటల్ హెల్త్‌కేర్ ప్రోగ్రామ్ కుటుంబాల ఔట్-ఆఫ్-పాకెట్ వైద్య ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ నేపథ్యంలో కుప్పం, చిత్తూరు జిల్లాల్లో నిర్వహించిన పైలట్ ప్రాజెక్టులో హైపర్‌టెన్షన్ కేసుల్లో 56 శాతం నియంత్రణతో పాటు డయాబెటిస్ తీవ్రత 16 శాతం తగ్గినట్లు ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితంగా కర్నూలు జిల్లా ఆస్పరి, మార్కాపురం ప్రాంతాలలో కూడా ఈ ప్రాజెక్టును విజయవంతంగా ప్రారంభించి విస్తరించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1, 2027 నుంచి ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం 90 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి గిరిజన సాంద్రత ఎక్కువగా ఉన్న గన్నెల పీహెచ్‌సీ పరిధిలో డోర్-టు-డోర్ సర్వే నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఇతర రిమోట్ ప్రాంతాలకు ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలను విస్తరించడం ద్వారా వైద్య వ్యవస్థను మరింత బలపరుస్తారు. సంజీవని అమలు తర్వాత గిరిజన కుటుంబాలు దూరప్రాంత ఆసుపత్రులకు వెళ్లే భారం తగ్గి ముందస్తు స్క్రీనింగ్, ఫాలోఅప్ సేవలు సులభమవుతాయి. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ టి. నిషాంతి, ఐజీ గోపినాథ్ జెట్టి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. రాష్ట్రవ్యాప్త రోల్‌అవుట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో ఒక మోడల్ స్టేట్‌గా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
By Venkat Reddy — 29 August 2026