రివ్యూ : చెన్నై లవ్ స్టోరీ

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ రివ్యూ. కథ, నటన, ప్లస్, మైనస్ పాయింట్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

సినిమా పేరు & తారాగణం సినిమా పేరు: చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story) తారాగణం: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ, త్రిగుణ్, సిరి హనుమంతు, కరుణ్ కుమార్, దేవి ప్రసాద్ తదితరులు. దర్శకత్వం: రవి నంబూరి కథ, స్క్రీన్‌ప్లే: సాయి రాజేష్ సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియల్ నిర్మాతలు: ఎస్కేఎన్, సాయి రాజేష్ కథ: నివేదిత అలియాస్ నివి (శ్రీ గౌరీ ప్రియ) చెన్నైలో ఐటీ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అజయ్ (త్రిగుణ్) తో ప్రేమలో పడి, పెళ్లికి కూడా రెడీ అవుతుంది. అంతా సెట్ అనుకున్న టైమ్‌లో అజయ్ హ్యాండ్ ఇస్తాడు. ఈ షాక్‌తో నివి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి, పూర్తిగా తాగుడుకు బానిస అవుతుంది. జీవితంపై ఆశ చచ్చిపోయి రోజూ గడవడం కష్టమవుతుంది. ఈ సమయంలో చెన్నైలో సినిమా రైటర్ కావాలని వచ్చిన స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) ఆమె జీవితంలోకి అనుకోకుండా ఎంటరవుతాడు. ముందూ వెనుకా ఎవరూ లేని స్టీవెన్, నివి ఫ్రెండ్స్‌తో కలిసి అదే ఇంట్లో ఉంటాడు. మొదట్లో అతనంటే నివికి ఇష్టం లేకపోయినా, స్టీవెన్ అమాయకత్వం, స్వచ్ఛమైన మంచితనం చూశాక ఆమెలో మార్పు వస్తుంది. తన గతాన్ని మర్చిపోయి స్టీవెన్‌తో కలిసి కొత్త జీవితాన్ని ఊహించుకుంటుంది. అంతేకాదు, తానే స్వయంగా స్టీవెన్‌ను పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేస్తుంది. ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న టైమ్‌లో ఊహించని ఒక పెద్ద సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన నివి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత స్టీవెన్ ఏం అయ్యాడు? నివి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ఈ ప్రేమ ప్రయాణం ఎక్కడికి దారితీసింది? ఇవన్నీ తెరపై చూడాల్సిందే. విశ్లేషణ: సినిమాలు అనగానే రొటీన్ కమర్షియల్ హంగామా, ఎలివేషన్లు, అనవసరమైన ఫైట్లు అనే మూస పద్ధతిలో కాకుండా, కాస్త భిన్నమైన ఆలోచనలతో వస్తే ఆ ఆడియెన్స్ అనుభవమే వేరుగా ఉంటుంది. ‘బేబీ’ లాంటి సెన్సేషనల్ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన సాయి రాజేష్, ఈసారి ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ మరోసారి ఒక ప్యూర్ లవ్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి నిమిషం నుంచి చివరి వరకు ఒక డిఫరెంట్ ఫీల్‌ను పంచుతుంది. ముఖ్యంగా “ప్రతి ప్రేమకథా ఒకేలా ఉంటే చరిత్రకు కూడా నచ్చదండీ” అనే డైరెక్ట్ స్టేట్‌మెంట్‌తో మొదలయ్యే ఈ ప్రయాణం, ఈ జెనరేషన్ ప్రేమ కథలకు పూర్తిగా భిన్నంగా, చాలా హుందాగా, ఎలాంటి వల్గారిటీ లేకుండా సాగుతుంది. సాధారణంగా తెలుగు సినిమాల్లో హీరో బ్రేకప్ అయ్యాక తాగుబోతుగా మారడం, గడ్డం పెంచడం, దేవదాసులా తిరగడం చూస్తుంటాం. కానీ ఇక్కడ డైరెక్టర్ ఆ టెంప్లేట్‌ను పూర్తిగా రివర్స్ కొట్టాడు. అజయ్ (త్రిగుణ్) చేతిలో మోసపోయిన హీరోయిన్ నివి (శ్రీ గౌరీ ప్రియ) బ్రేకప్ తర్వాత మద్యం తాగుతూ డిప్రెషన్‌లో ఉండటం, మరోవైపు చెన్నైలో సినిమా రైటర్ కావాలని వచ్చి ఎవరి మద్దతూ లేని స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) ఆమె జీవితంలోకి అనుకోకుండా ఎంటరై ఆమెను మార్చడానికి ప్రయత్నించడం అనే పాయింట్టే సినిమాకి అసలైన సోల్‌ను ఇస్తుంది. సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఎలాంటి బోరింగ్ ఇంట్రోలు లేకుండా నేరుగా కథలోకి వెళ్లడం విశేషం. ‘తొలి ప్రేమ తోపు కాదు’ అనే పాయింట్‌తో దర్శకుడు ప్రేమకథలను ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించే ప్రయత్నం చేశాడు. తొలి ప్రేమ దగ్గరే ఆగిపోతే జీవితం ముందుకు కదలదని, మూవ్ ఆన్ అవ్వడానికి బెస్ట్ లవ్ ఎక్కడుందో వెదుక్కొంటూ ప్రయాణించాల్సిందే అనే కాన్ప్సెప్ట్ చాలా రియలాస్టిక్‌గా అనిపిస్తుంది. ప్రారంభ సన్నివేశాలు కాస్త నిదానంగా సాగినప్పటికీ, స్టీవెన్ శంకర్ పాత్ర పరిచయంతో కథలోకి వేగమొస్తుంది. కిరణ్ అబ్బవరం ఇప్పటివరకు చేసిన సినిమాల్లోని ఓవర్‌టాప్ ఫన్ మోడ్‌కు భిన్నంగా, ఇక్కడ చాలా సటిల్‌గా నటించాడు. స్టీవెన్ పాత్రలో ఉండే అమాయకత్వం, మంచితనం కిరణ్ కళ్లలో చాలా సహజంగా పలికాయి. తన గతం చెప్పుకునే సీన్ కావచ్చు, లేదా హీరోయిన్‌తో నడిచే సంభాషణలు కావచ్చు, కిరణ్ తన అద్భుతమైన ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌తో కట్టిపడేస్తాడు. ఇక మిడ్ సెగ్మెంట్‌లో వచ్చే ‘బనిస’ ఎపిసోడ్ కొద్దిగా క్రింజ్‌గా అనిపించినా, అది మరీ భరించలేని స్థాయికి వెళ్లకుండా రొమాంటిక్ మోంటేజ్ సాంగ్స్, ఫన్ మూమెంట్స్‌తో చక్కగా బ్యాలెన్స్ చేశారు. ఇక ఈ సినిమాకి అసలైన హైలైట్ ప్రీ-ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే టెంపుల్ సీక్వెన్స్. గుడి మెట్ల దగ్గర ఫన్నీ కన్వర్జేషన్‌తో ప్రారంభమై, ఆ తర్వాత ఎమోషనల్ టర్న్ తీసుకునే సీన్ డైరెక్టర్ పెన్ పవర్‌ను తెలియజేస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బూమ్ అవ్వడం, మోంటేజెస్ షైన్ అవ్వడం, మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ సన్నివేశానికి ప్రాణం పోయడం అన్నీ కుదిరాయి. ‘మగవాళ్లు తమ భాగస్వామి గతం గురించి ఎలా ఆలోచిస్తారో’ హీరో అడిగే ఆ చిన్న మాట సినిమా మూడ్‌ను పూర్తిగా మార్చేస్తుంది. అసలు ఇంటర్వెల్ వద్ద జరిగే అనూహ్యమైన ‘ఇన్సిడెంట్’ కథను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఇక్కడే విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ పనితనం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. చెన్నై నగరంలోని హడావుడిని మరీ ఎక్కువ చూపించకుండా, పాత్రల భావోద్వేగాలకు తగినట్టుగా వార్మ్ టోన్‌తో లైటింగ్, పాలిష్డ్ లుక్ మెయింటైన్ చేయడం వల్ల ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా అనిపిస్తుంది. రాత్రి వేళల్లో వచ్చే సీన్లలో షాడోస్, కలర్ ప్యాలెట్ చాలా నేచురల్‌గా ఉండి మూడ్‌ను ఎలివేట్ చేస్తాయి. అయితే, సెకండాఫ్‌లోకి అడుగుపెట్టాక సినిమా కొద్దిగా తడబడుతుంది. పోస్ట్-ఇంటర్‌వెల్ ట్విస్ట్ తర్వాత కథ ఎక్కడికి వెళ్తుందో ఆడియన్స్‌కు ముందే ఒక అంచనా వచ్చేస్తుంది. ‘నమ్మకపోతే అబద్ధం.. నమ్మగలిగితే అద్భుతం’ అంటూ ఆత్మ లేదా సోల్ కాన్సెప్ట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు, ఆ సీన్‌ను డిజైన్ చేసిన తీరు బాగున్నప్పటికీ, సెకండాఫ్‌లో కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడం సినిమా మైనస్‌గా మారుతుంది. హీరో ఎందుకు పోరాడాలి? ఎవరి కోసం? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం దొరకకపోవడంతో కథ రొటీన్ బాట పడుతుంది. ఈ దశలో స్క్రీన్‌ప్లే కొద్దిగా ప్యాచ్‌గా మారుతుంది. శాంసన్ నాయుడు ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్‌లో ఎంతో స్మూత్‌గా ఉన్నప్పటికీ, సెకండాఫ్‌లో దాదాపు మూడు గంటల నిడివి కారణంగా కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపించి ఆడియెన్స్ పేషెన్స్‌ను టెస్ట్ చేస్తాయి. అయినప్పటికీ, నటీనటుల అంకితభావం ఆ లోపాలను చాలా వరకు కప్పిపుచ్చుతుంది. ముఖ్యంగా శ్రీ గౌరీ ప్రియ పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాకి ఆమెనే అసలైన ఎమోషనల్ యాంకర్. బ్రేకప్ తర్వాత మందుకు బానిస కావడం, ఆ తర్వాత స్మశానంలో జరిగే సీన్లలో ఆమె పలికించిన హావభావాలు, నటన గుండెల్ని పిండేస్తాయి. హీరోయిన్ పాత్ర ప్రవర్తనలో కొన్ని చోట్ల కన్‌ఫ్యూజన్ ఉన్నప్పటికీ, గౌరీ ప్రియ తన సహజమైన అప్పీయరెన్స్‌తో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌కి వస్తే, చాలా కాలం తర్వాత మణిశర్మ తన మార్క్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. పాటలు వినడానికి మాత్రమే కాకుండా, కథలో భాగంగా కలిసిపోయి ఎమోషన్స్‌ను పీక్స్‌కి తీసుకెళ్లాయి. ‘త్రిగుణ్’ అతిథి పాత్ర కావచ్చు, కరుణ్ కుమార్, సిరి హనుమంతు వంటి సహాయ నటుల పాత్రలు కావచ్చు, కథను ముందుకు నడిపించడంలో తమ వంతు పాత్ర పోషించాయి. క్లైమాక్స్ ముగింపు దగ్గరకు వచ్చేసరికి డైరెక్టర్ భావోద్వేగాలను పీక్స్‌కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కుక్కల ఫైట్ వంటి కొన్ని క్యూరియాసిటీ ఎలిమెంట్స్ ఉన్నా, ఓవరాల్‌గా క్లైమాక్స్ చాలా ప్రిడిక్టబుల్‌గా మారుతుంది. రవి నంబూరి మాటలు మరీ లోతుగా కాకుండా, సింపుల్ కాన్వర్జేషన్లతో సాగిపోవడం సినిమాను అందరికీ చేరువ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఎక్సైట్‌మెంట్‌ను, మ్యాజిక్‌ను సెకండాఫ్‌లో చివరి వరకు క్యారీ చేయడంలో కొద్దిగా తడబడినప్పటికీ, ఒక స్వచ్ఛమైన ప్రేమకథను నిజాయితీగా తెరకెక్కించాలన్న తపన మాత్రం ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ఓవరాల్‌గా లాజిక్స్ వెతక్కుండా, ఎమోషన్స్‌ను కనెక్ట్ చేసుకొని చూస్తే ఈ ‘చెన్నై లవ్ స్టోరీ’ ఒక డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. ప్లస్ పాయింట్స్: కిరణ్ అబ్బవరం నటన శ్రీ గౌరీప్రియ పెర్ఫార్మెన్స్ మణిశర్మ నేపథ్య సంగీతం ఫస్ట్ హాఫ్ స్క్రీన్‌ప్లే మైనస్ పాయింట్స్: సెకండాఫ్ సాగదీత సీన్లు ఊహించదగిన క్లైమాక్స్ కొన్ని లాజిక్ లోపాలు ఫైనల్ వర్డ్: మొదటి సగం అద్భుతంగా సాగి, రెండో సగంలో కొంచెం తడబడినప్పటికీ, కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియల నటన కోసం, మణిశర్మ మ్యూజిక్ కోసం ఈ వీకెండ్‌లో కచ్చితంగా చూడదగ్గ ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 'చెన్నై లవ్ స్టోరీ'. SkyC Rating: 2.75/5
By Venkat Reddy — 24 July 2026