E20 పెట్రోల్‌పై వెనక్కి తగ్గేదే లేదన్న కేంద్ర ప్రభుత్వం

E20 పెట్రోల్ విధానంపై కేంద్రం రాజ్యసభలో స్పష్టతనిచ్చింది. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని సేవ్‌తో పాటు ప్రయోజనాలను వెల్లడించింది.

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వినియోగంపై వ్యక్తమవుతున్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా స్పష్టమైన వివరణ ఇచ్చింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే విధానం నుండి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చిచెప్పింది. E0 లేదా E10 ఇంధన రకాలకు తిరిగి మారే ఆలోచన ప్రభుత్వం వద్ద లేదని రాజ్యసభలో రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని అనాలోచితంగా తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ విధానాన్ని ఆషామాషీగా కాకుండా పూర్తి స్థాయి శాస్త్రీయ అధ్యయనం తర్వాతే అమలులోకి తెచ్చామని కేంద్రం తెలిపింది. నీతి ఆయోగ్, ప్రముఖ వాహన తయారీదారులు, ఏఆర్‌ఏఐ మరియు సియామ్ వంటి అగ్రగామి సంస్థలతో సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొంది. శాస్త్రీయంగా అన్ని పరీక్షలు పూర్తయి, ఆమోదం లభించిన తర్వాతే దేశంలో E20 పెట్రోల్ పంపిణీని ప్రారంభించామని మంత్రి తెలిపారు. దీంతో వాహనదారుల్లో ఉన్న అనేక అనుమానాలకు ముగింపు పలికినట్లయింది. ఇదిలా ఉండగా, దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో వేర్వేరు రకాల ఇంధనాలను సరఫరా చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షకు పైగా పెట్రోల్ బంకుల్లో E0, E10, E20 ఇంధనాలను విడివిడిగా అందుబాటులో ఉంచడం వల్ల లాజిస్టిక్స్ సమస్యలు వస్తాయి. దీనివల్ల రవాణా మరియు నిర్వహణ ఖర్చులు ఊహించని విధంగా పెరుగుతాయని తెలిపింది. అందుకే ఒకే రకమైన ఇంధన విధానాన్ని పాటించడం అనివార్యమని స్పష్టం చేసింది. ఫలితంగా E10 ఇంజిన్లలో E20 ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల మైలేజీలో 3 నుండి 5 శాతం వరకు స్వల్ప తగ్గుదల ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధిక ఆక్టేన్ లభించడం వల్ల వాహనాల యాక్సిలరేషన్ మెరుగవుతుందని వివరించింది. అంతేకాకుండా కర్బన ఉద్గారాలు 30 శాతం వరకు తగ్గుతాయని ప్రభుత్వం పేర్కొంది. E20 వల్ల ఇంజిన్లు పాడవుతున్నాయ అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, అందుకే వాహన తయారీ కంపెనీలు సైతం తమ వారంటీలను యథావిధిగా కొనసాగిస్తున్నాయని స్పష్టం చేసింది. ఇథనాల్ బ్లెండింగ్ విధానం వల్ల దేశానికి ఆర్థికంగా మరియు పర్యావరణపరంగా అపారమైన ప్రయోజనాలు చేకూరాయని కేంద్రం గణాంకాలతో సహా వివరించింది. ఇప్పటివరకు ఈ విధానం ద్వారా సుమారు 1.97 లక్షల కోట్ల రూపాయల విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని తెలిపింది. దీనికి తోడు 316 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతులు తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతాన్ని ఇచ్చిందని పేర్కొంది. చివరగా పర్యావరణ పరిరక్షణలో కూడా ఈ నిర్ణయం కీలక పాత్ర పోషించిందని ప్రభుత్వం వెల్లడించింది. ఇథనాల్ వాడకం వల్ల ఇప్పటివరకు 952 లక్షల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగామని తెలిపింది. ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ ఇంధన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది.
By Chandrasekhar B — 05 August 2026