E20 పెట్రోల్‌పై కేంద్రానికి షాక్.. 53% NDA ఓటర్లు వ్యతిరేకం..

ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సి-ఓటర్ సర్వేలో 52 శాతం మంది వ్యతిరేకించగా, ఇంజిన్ పాడవుతుందనే భయాలు వ్యక్తమయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తెస్తున్న ఈ20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం) వాడకంపై దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సి-ఓటర్ నిర్వహించిన సరికొత్త దేశవ్యాప్త సర్వేలో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం సర్వేలో పాల్గొన్న వారిలో 52 శాతం మంది ఈ కొత్త ఇంధన విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తేల్చి చెప్పారు. 2026 జూన్ 8 మరియు 9 తేదీల్లో దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడిన 1641 మంది అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే ఫలితాలను విడుదల చేశారు. దేశంలో చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల రైతులకు కూడా లబ్ధి చేకూరుతుందని, దేశ ఇంధన భద్రత పెరుగుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, క్షేత్రస్థాయిలో వాహనదారుల ఆలోచనలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం ఆశిస్తున్న ప్రయోజనాల కంటే కూడా తమ వాహనాల భద్రతపైనే ప్రజలు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సర్వే ఫలితాలు అధికార కూటమి అయిన ఎన్డీయేకు సైతం గట్టి షాక్ ఇచ్చాయి. ఎందుకంటే అధికార బీజేపీ నేతృత్వంలోని కూటమికి ఓటు వేసిన వారిలో కూడా 53 శాతం మంది ఈ20 పెట్రోల్ వాడకాన్ని వ్యతిరేకిస్తున్నారు. కేవలం 22 శాతం మంది మాత్రమే దీనికి మద్దతు ఇవ్వగా, మరో 26 శాతం మంది ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో ఈ విధానంపై ప్రజల్లో ఉన్న అపనమ్మకం స్పష్టంగా బయటపడింది. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రధానంగా రెండు విషయాలపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 55 శాతం మంది ఈ కొత్త ఇంధనం వల్ల తమ వాహనాల ఇంజిన్లు పాడవుతాయని భయపడుతున్నారు. అలాగే మరో 53 శాతం మంది వాహనాల మైలేజ్ తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా, మార్కెట్లో సాధారణ పెట్రోల్ లభ్యతను కొనసాగించాలని, ఈ20 పెట్రోల్ ధరను సాధారణ పెట్రోల్ కంటే తక్కువగా ఉంచాలని 76 శాతం మంది డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పాత వాహనాలకు ఈ కొత్త పెట్రోల్ వాడకాన్ని తప్పనిసరి చేయకూడదని 56 శాతం మంది స్పష్టం చేశారు. ఇందులో బీజేపీకి ఓటు వేసిన 49 శాతం మంది ఓటర్లు కూడా ఉండటం గమనార్హం. పాత ఇంజిన్లు ఈ కొత్త ఇంధనాన్ని తట్టుకోలేవనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.
By Bhavani E — 14 July 2026