బొత్స పార్టీ మార్పుపై క్లారిటీ.. తెరపైకి కుమార్తె అనూష!

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. తన కుమార్తె అనూషను విజయనగరం జడ్పీ చైర్మన్ రేస్‌లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన జనసేన పార్టీలో చేరుతారంటూ జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. విజయసాయి రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యల తర్వాత ఈ తరహా చర్చలు మరింతగా ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో బొత్స కుటుంబానికి ఉన్న బలమైన రాజకీయ పట్టు, కాపు సామాజికవర్గంలో ఉన్న ప్రాబల్యం కారణంగా ఈ ఊహాగానాలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రచారంపై బొత్స సత్యనారాయణ స్వయంగా స్పందిస్తూ స్పష్టమైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఏ ఒక్క కారణం చేత కూడా పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు. తనపై వస్తున్న వార్తలన్నీ కేవలం ప్రచారమేనని కొట్టిపారేస్తూ కూటమి ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా వైసీపీ అధిష్టానం కూడా ఈ పార్టీ మార్పు ప్రచారాలను ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదని సమాచారం అందుతోంది. అధినేతతో ఉన్న అనుబంధం దృష్ట్యా ఈ వార్తల్లో నిజం లేదని పార్టీ భావిస్తోంది. దీంతో ఈ జంపింగ్ ప్రచారాలకు వెంటనే తెరపడుతుందని భావించినప్పటికీ పరిస్థితి అలా కనిపించడం లేదు. స్థానికంగా ఈ చర్చలు ఇప్పటికీ ఆగకపోవడం విశేషం. ఇదిలా ఉండగా బొత్స ఫ్యామిలీ ప్యాక్‌తో జనసేన వైపు అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా బొత్స సత్యనారాయణ ఇప్పటికే తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. తన కుమార్తె డాక్టర్ బొత్స అనూషను విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రేస్‌లోకి తీసుకురావాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక రాజకీయాల్లో బొత్స కుటుంబం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అనూష వైద్యాన్ని అభ్యసిస్తూనే చీపురుపల్లి, విజయనగరం నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఫలితంగా కుటుంబంలో నాలుగో తరం రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. గతంలో బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ లక్ష్మి కూడా మొదట జడ్పీ చైర్‌పర్సన్‌గానే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు. అదే తరహాలో ఇప్పుడు తమ కుమార్తె అనూషను కూడా జడ్పీ చైర్‌పర్సన్‌గా బరిలోకి దింపేందుకు ఆగస్టు నెలలోనే బొత్స స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మరోవైపు ఈ ప్రాంతంలో కాపు సామాజికవర్గ బలం ఎక్కువగా ఉండటంతో రాబోయే ఎన్నికల నాటికి ఏ రకమైన పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ఆసక్తి నెలకొంది. పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండిస్తూనే స్థానిక సమరానికి సిద్ధమవుతున్న బొత్స వ్యూహం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
By Chandrasekhar B — 04 September 2026