మెగాస్టార్‌తో రామచందర్ రావు భేటీ.. పొలిటికల్ సర్కిల్స్‌లో కొత్త ట్విస్ట్..!
చిరు రామచందర్ భేటీ పొలిటికల్ ట్విస్ట్! హైదరాబాద్‌లో మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బీజేపీ చీఫ్ రామచందర్ రావు. మోడీ 12 ఏళ్ల పాలనపై చిరు ప్రశంసలు.
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మెగాస్టార్ చిరంజీవిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం 12 ఏళ్ల విజయవంతమైన పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భేటీ జరిగింది. ప్రస్తుతం బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ లో భాగంగా ఈ సమావేశం జరగడం విశేషం. ఈ కీలక భేటీలో రామచందర్ రావు చిరంజీవికి మోడీ ప్రభుత్వం సాధించిన ప్రగతికి సంబంధించిన వివరాలను అందించారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన ఆర్థిక అభివృద్ధి, దేశవ్యాప్తంగా అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రత్యేక బుక్‌లెట్, బ్రోచర్లు అందజేశారు. మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను రామచందర్ రావు మెగాస్టార్‌కు వివరించగా, ఆయన ఎంతో ఆసక్తిగా వాటిని పరిశీలించారు. దీంతో ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనపై చిరంజీవి ప్రశంసలు కురిపించినట్లు సమాచారం అందుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ముందుకు నడిపిస్తున్న తీరును మెగాస్టార్ అభినందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ భేటీలో కేవలం ప్రభుత్వ పథకాలే కాకుండా ప్రస్తుత జాతీయ, రాష్ట్ర రాజకీయ అంశాలపై కూడా ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. దీంతో ఈ భేటీ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ నేతలు మాత్రం ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విజయాలను సమాజంలోని వివిధ రంగాల ప్రముఖులకు చేర్చడం కోసమే తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వారు వెల్లడించారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్తున్నప్పటికీ, మెగాస్టార్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఫలితంగా ఈ మీటింగ్ తాలూకు వివరాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఈ భేటీపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా స్పందించారు. "12 ఏళ్ల వికాసం, విశ్వాసం, జన కల్యాణం సందర్భంగా మెగాస్టార్ & పద్మ విభూషణ గ్రహీత చిరంజీవి గారిని హైదరాబాద్‌లో కలిశాను" అని ట్వీట్ చేశారు. మోడీ ప్రభుత్వ విజయాలను హైలైట్ చేసే బుక్‌లెట్‌ను ఆయనకు అందజేసినట్లు రామచందర్ రావు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ భేటీతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చిరంజీవి వంటి అగ్ర నటుడు మోడీ 12 ఏళ్ల పాలనను అభినందించడం బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాబోయే రోజుల్లో మహాజన్ సంపర్క్ అభియాన్ కింద మరికొంతమంది ప్రముఖులను కలవాలని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి, రామచందర్ రావు భేటీ పొలిటికల్ స్క్రీన్‌పై సరికొత్త ట్విస్ట్‌ను తీసుకొచ్చిందని చెప్పవచ్చు.