అయోధ్య రామ మందిర ట్రస్ట్‌కు లీగల్ నోటీసు షాక్.. 7 కోట్ల దొంగతనం ఆరోపణలు!
అయోధ్య రామాలయం వివాదం హీటెక్కింది. రామ మందిర ట్రస్ట్‌కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. రూ.7 కోట్ల దొంగతనం ఆరోపణలపై 3 రోజుల్లో పూర్తి ఆర్థిక వివరాలు ఇవ్వాలని డిమాండ్.
అయోధ్య రామ మందిర ట్రస్ట్‌కు ఊహించని విధంగా భారీ షాక్ తగిలింది. ఆలయానికి వచ్చిన విరాళాలు, భూమి కొనుగోళ్లు, ఆదాయ-వ్యయాల పూర్తి వివరాలను వెల్లడించాలంటూ లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకుని అధికార పక్షంపై పదునైన విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో అయోధ్య రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. బీహార్‌కు చెందిన ఆర్‌జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ ఈ లీగల్ నోటీసులను పంపించారు. సుప్రీంకోర్టు లాయర్ సత్యం సింగ్ రాజ్‌పుత్ ద్వారా ఆయన ఈ చర్యకు ఉపక్రమించారు. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్, ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరిలను టార్గెట్ చేస్తూ ఈ నోటీసులు జారీ చేయడం,ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న పూర్తి ఆర్థిక రికార్డులను సమర్పించాలని డిమాండ్ చేశారు. ఈ నోటీసులో ప్రధానంగా ఆడిట్ రిపోర్ట్లు, బ్యాలెన్స్ షీట్లు, బ్యాంక్ లావాదేవీల వివరాలను అడిగారు. వీటితో పాటు ఎఫ్‌సీఆర్‌ఏ విరాళాలు, భూమి కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను కూడా కేవలం 3 రోజుల్లోనే ఇవ్వాలని డెడ్‌లైన్ విధించారు. మాజీ ఎస్పీ ఎమ్మెల్యే పవన్ పాండే చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో ఈ లీగల్ నోటీసు వ్యవహారం తెరపైకి వచ్చింది. విరాళాల లెక్కింపు గది నుండి రూ.7 నుంచి రూ.7.5 కోట్ల నగదును దొంగిలించారని పవన్ పాండే తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు రామ మందిర ట్రస్ట్‌పై ముకుమ్మడిగా దాడికి దిగుతున్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ వ్యవహారంపై కోర్టులో పిల్ దాఖలు చేశారు. విరాళాల లెక్కింపు గదికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని తక్షణమే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు శివసేన నేత సంజయ్ రౌత్ సైతం ఈ వివాదంపై స్పందిస్తూ రూ.5 కోట్లకు పైగా దోపిడీ జరిగిందని ఆరోపించారు. దీనిపై నిజానిజాలు తేల్చేందుకు అయోధ్యకు ప్రతినిధి బృందం వెళ్లే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలు అన్నింటినీ రామ మందిర ట్రస్ట్ నిర్వాహకులు తీవ్రంగా ఖండించారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్పందిస్తూ ఇవన్నీ కేవలం అబద్ధాలు మరియు రాజకీయ వదంతులు మాత్రమేనని కొట్టిపారేశారు. ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలన్నీ చాలా పారదర్శకంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్రస్ట్‌కు సంబంధించిన అధికారిక ఆడిట్ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాల మధ్య ఒక పెద్ద పొలిటికల్ వార్‌గా రూపాంతరం చెందింది. లీగల్ నోటీసులకు ట్రస్ట్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 3 రోజుల గడువు ముగిసిన తర్వాత ప్రతిపక్షాలు ఎలాంటి అడుగులు వేస్తాయో చూడాలి. ఫలితంగా అయోధ్య రామ మందిర నిధుల వివాదం దేశ రాజకీయ స్క్రీన్‌పై కొత్త ట్విస్ట్‌లు సృష్టిస్తోంది.