అయోధ్య రామాలయం తొలి సీఈఓ ఎంపికపై ట్రస్ట్ బిగ్ అప్‌డేట్
అయోధ్య రామాలయం తొలి సీఈఓ ఎంపికపై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నేడు కీలక భేటీ నిర్వహిస్తోంది. 5,585 దరఖాస్తుల నుంచి ముగ్గురు అభ్యర్థులను ఫైనల్ చేశారు.
అయోధ్య రామజన్మభూమి ఆలయ నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ హిస్టారిక్ నిర్ణయం తీసుకుంది. ఆలయ చరిత్రలోనే తొలిసారిగా పూర్తిస్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను నియమించేందుకు గాను బుధవారం సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 2 గంటలకు కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ నివాసమైన మణిరామ్‌దాస్ ఛావనీలో ఈ భేటీ జరగనుండగా, అయోధ్య రామాలయం తొలి సీఈఓ ఎవరనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సీఈఓ నియామకంతో పాటు ఖాళీగా ఉన్న కీలక పదవుల భర్తీపై కూడా ట్రస్ట్ ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి అధికారిక ప్రకటన వెలువరించనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉద్యోగ ప్రకటనకు ఏకంగా 5,585 దరఖాస్తులు వచ్చాయి. మాజీ న్యాయమూర్తి ప్రమోద్ కొహ్లీ, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, సురేశ్ హావరేలతో కూడిన ముగ్గురు సభ్యుల సెర్చ్ కమిటీ వీటిని క్షుణ్ణంగా పరిశీలించింది. సెర్చ్ కమిటీ మొత్తం 16 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి, చివరకు ముగ్గురితో కూడిన తుది ప్యానెల్ జాబితాను ట్రస్ట్‌కు సమర్పించింది. 50 నుంచి 70 ఏళ్ల వయస్సు, కనీసం 20 ఏళ్ల పరిపాలనా అనుభవం కలిగి ఉండి, ప్రాక్టీసింగ్ హిందువుగా ఉన్న వారిని మూడేళ్ల కాంట్రాక్ట్ కాలపరిమితికి సీఈఓగా ఎంపిక చేయనున్నారు. ఈ సీఈఓ పదవితో పాటు ట్రస్ట్ తొలి సెక్రటరీగా ఐఐటీ బాంబే ఎంటెక్ గ్రాడ్యుయేట్, రామాలయ ప్రాజెక్ట్ మేనేజర్ అయిన జగదీశ్ ఆఫ్లే పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు వీహెచ్‌పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాగ్డాను కూడా ట్రస్ట్ సభ్యుడిగా చేర్చుకునే దిశగా చర్చలు వేగవంతమయ్యాయి. ఇదిలా ఉండగా గతంలో మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాల రాజీనామాలు, అలాగే ట్రస్టీ విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణం వల్ల ట్రస్ట్‌లో మూడు కీలక స్థానాలు ఖాళీగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం కృష్ణ మోహన్ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తూ ఆలయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. 2024 జనవరిలో వైభవంగా ప్రాణప్రతిష్ఠ జరగడం, 2025 నవంబర్‌లో ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో అయోధ్య రామాలయానికి రోజువారీ భక్తుల రద్దీ ఊహించని రీతిలో పెరిగింది. ఫలితంగా ఆలయ రోజువారీ పరిపాలన, కోట్ల రూపాయల విరాళాల పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్లు ట్రస్ట్‌కు సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో జూన్ 2026లో ఆలయ విరాళాలు, హుండీ నగదు దొంగతనం జరిగినట్లు తీవ్ర ఆరోపణలు రావడంతో యూపీ ప్రభుత్వం వెంటనే సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కేసూలో ఎనిమిది మందిని అరెస్టు చేసి రూ.79.85 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో, నైతిక బాధ్యత వహిస్తూ చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు తమ పదవులకు రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు ఆలయ పవిత్రతను దెబ్బతీసిన తరుణంలో ట్రస్ట్ వెంటనే స్పందించి ఆ రాజీనామాలను ఆమోదించింది. రోజువారీ నిర్వహణను పూర్తిగా ప్రొఫెషనల్ బాధ్యతలతో నడిపించేందుకు సీఈఓ పోస్టును సృష్టిస్తూ సెర్చ్ కమిటీని రంగంలోకి దించింది. రేసులో రాజేష్ పాండే, యోగేశ్వర్ రామ్ మిశ్రా, పరేష్ సక్సేనా వంటి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, ట్రస్ట్ ఆమోదించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపిన వివరాల ప్రకారం, ఈ సమావేశంలోనే కొత్త సీఈఓ పేరుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మిలియన్ల కొద్దీ భక్తులు విరాళాలు ఇచ్చే ఆధ్యాత్మిక కేంద్రంలో సీఈఓ నియామకం అనేది పరిపాలనలో నూతన అధ్యాయానికి పునాది కానుంది. సీఈఓ నేరుగా జనరల్ సెక్రటరీకి రిపోర్ట్ చేస్తూ ఆలయ రోజువారీ సెక్యూరిటీ, విరాళాల సిస్టమ్స్‌ను పూర్తి స్థాయిలో నియంత్రిస్తారు. ఈ నిర్ణయంతో రామాలయ ట్రస్ట్ భక్తుల నమ్మకాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఆలయ నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచనుంది. బుధవారం మధ్యాహ్నం జరగబోయే ఈ కీలక సమావేశం ఆలయ భవిష్యత్ ప్రణాళికలకు, వృత్తిపరమైన పర్యవేక్షణకు మార్గం సుగమం చేయనుంది.