ఒవైసీ రాజకీయం: ముస్లింలకు మేలా? లేక బీజేపీకి లాభమా?

అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ ప్రస్థానం మైనారిటీల అభివృద్ధికి తోడ్పడుతుందా లేదా వారిని రాజకీయంగా ఏకాకులను చేస్తోందా? ఓట్ల చీలిక మరియు అభివృద్ధిపై ప్రత్యేక విశ్లేషణ ఇక్కడ చదవండి.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్య ముఖచిత్రంపై ఒక గంభీరమైన చర్చను రేకెత్తించాయి. సెక్యులర్ పార్టీలు ముస్లింలను కేవలం ఎన్నికల సాధనాలుగా వాడుకొని వదిలేశాయని, అందుకే ఆ వర్గానికి ఒక ప్రత్యేక రాజకీయ అస్తిత్వం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సెక్యులర్ పార్టీల అసమర్థతను ఎత్తిచూపడంలో ఆయన వాదనలో కొంత నిజం ఉన్నప్పటికీ, ఆయన ఎంచుకున్న ఈ 'ప్రత్యేక రాజకీయ మార్గం' ముస్లిం సమాజాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందా లేక మరింత రాజకీయ ఏకాకులను చేస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. ముస్లింలు తమకంటూ ఒక విడిగా గొంతుకను నిర్మించుకోవాలని అనడం, పైకి ఆ సామాజిక వర్గ బలోపేతంలా కనిపిస్తున్నా, వాస్తవానికి అది దేశంలో మతపరమైన విభజనను మరింత లోతుగా చేసే ప్రమాదం ఉంది. దీనివల్ల ముస్లింలు ప్రధాన రాజకీయ స్రవంతికి దూరమై, ఒక వర్గానికే పరిమితమైన రాజకీయ ముద్రతో మిగిలిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒవైసీ "నేను ముస్లింని కాబట్టి ముస్లింలంతా నాకే ఓటు వేయాలి" అని అడగడం ద్వారా దేశంలో మతపరమైన ధ్రువీకరణను (Polarization) స్వయంగా ప్రోత్సహిస్తున్నారు. ఒకవేళ మైనారిటీలు మతం ప్రాతిపదికన విడిపోతే, మెజారిటీ మతస్తులు కూడా అదే ప్రాతిపదికన ఏకం కావడం సహజం. నేడు దేశవ్యాప్తంగా కనిపిస్తున్న 'హిందూ కన్సాలిడేషన్'కు ఒవైసీ ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒవైసీ దేశమంతటా తిరిగి ఇచ్చే రెచ్చగొట్టే ప్రసంగాలు హిందువుల్లో ఒక రకమైన అభద్రతా భావాన్ని లేదా వ్యతిరేకతను సృష్టిస్తాయి. దీనివల్ల హిందువులందరూ బిజెపి వైపు, ముస్లింలందరూ తన వైపు చేరేలా ఒవైసీ ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల అటు బిజెపికి, ఇటు ఒవైసీకి రాజకీయ ప్రయోజనాలు ఏకకాలంలో నెరవేరుతున్నాయి. ఇది కళ్ళముందు కనిపిస్తున్న 'సహజీవన సంబంధం'. ఒవైసీ నిజంగా ముస్లింల అభివృద్ధి కోరుకుంటున్నారా అంటే అందుకు తగిన ఆధారాలు లేవు. ఆయన పార్టీ ఎంఐఎం అనేది ఒక వారసత్వ పార్టీ. తాత నుండి తండ్రికి, తండ్రి నుండి కొడుకులకు అధికారం బదిలీ అవుతోంది తప్ప, సామాన్య ముస్లింలకు అక్కడ స్థానం ఎక్కడ ఉంది? హైదరాబాద్ పాతబస్తీని ఉదాహరణగా తీసుకుంటే, దశాబ్దాలుగా ఒవైసీ కుటుంబం అక్కడ అధికారంలో ఉంది. కానీ అక్కడ సామాన్య ముస్లిం బిడ్డలకు కనీసం చదువు, వైద్యం, ఉపాధి అవకాశాలు అందడం లేదు. ఆయన మెడికల్ కాలేజీల్లో పేద ముస్లింలకు ఫీజు లేకుండా సీట్లు ఇస్తున్నారా? లేదు. ముస్లిం మహిళల ఆత్మగౌరవం కోసం జరిగిన 'ట్రిపుల్ తలాక్' వ్యతిరేక పోరాటంలో ఒవైసీ పాత్ర ఏంటి? ఆ హక్కుల కోసం ఆయన ఎప్పుడైనా గళం ఎత్తారా? లేదు. అంటే, కేవలం మతపరమైన భావోద్వేగాలను వాడుకుని తన రాజకీయ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం తప్ప, ముస్లింల సామాజిక మార్పు కోసం ఆయన చేసింది శూన్యం. కేంద్ర దర్యాప్తు సంస్థల తీరును గమనిస్తే ఒవైసీపై ఉన్న అనుమానాలు మరింత బలపడతాయి. నేడు దేశంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రతి చిన్న, పెద్ద నాయకుడిపై సిబిఐ, ఈడి, ఐటి దాడులు జరుగుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటి వారు జైలుకు వెళ్లారు. మమతా బెనర్జీ, స్టాలిన్, పినరయి విజయన్ వంటి వారి చుట్టూ దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగిస్తున్నాయి. చివరకు చంద్రబాబు నాయుడు వంటి వారిని కూడా వదలలేదు. కానీ, ఇంతకాలంగా అసదుద్దీన్ ఒవైసీపై గానీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీపై గానీ కేంద్ర సంస్థలు ఒక్క కేసైనా ఎందుకు పెట్టలేదు? అక్బరుద్దీన్ హిందూ దేవతల గురించి ఎంత నీచంగా మాట్లాడినా, అది రెండు మతాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసేలా ఉన్నా, బిజెపి ప్రభుత్వం ఎన్ఐఏ (NIA) కేసు ఎందుకు పెట్టలేదు? దీనికి సమాధానం ఒక్కటే—బిజెపికి ఒవైసీ ఒక రాజకీయ ఆయుధం. ఒవైసీ సెక్యులర్ ఓట్లను చీల్చడం ద్వారా బిజెపికి గెలుపును సులభం చేస్తున్నారు. లౌకిక పార్టీల నుండి ముస్లింలను దూరం చేయడం ద్వారా ఆ పార్టీలను బలహీనపరచడమే ఆయన అసలు పాత్ర. ఒకవైపు "నేను ముస్లింను కాబట్టి నాకు ఓటు వేయండి" అని ఆయన అంటే, మరోవైపు "మేము హిందువులం కాబట్టి మాకు ఓటు వేయండి" అని మోదీ లేదా యోగి ఆదినాథ్ అనడంలో తప్పు పట్టే అవకాశం లేకుండా ఒవైసీయే మార్గం సుగమం చేస్తున్నారు. ఈ విషవలయంలో సామాన్య ముస్లింలు నలిగిపోతున్నారు. రాజకీయంగా ఒకే గూటికి పరిమితమైపోవడం వల్ల ఇతర పార్టీలు ముస్లింల అవసరాలను పట్టించుకోవడం మానేస్తాయి. కాబట్టి, ముస్లింలు గుర్తింపు రాజకీయాల కంటే అభివృద్ధి రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే, ఒవైసీ వంటి నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒక వర్గాన్ని దేశ ప్రధాన స్రవంతికి ఎప్పటికీ దూరం చేస్తూనే ఉంటారు.
By Venkat Reddy — 12 May 2026