పొరపాటున పాక్‌లోకి ఎయిర్ ఇండియా ఫ్లైట్.. తీవ్ర కలకలం!

నావిగేషన్ లోపంతో పాకిస్థాన్ గగనతలంలోకి వెళ్లిన ఎయిర్ ఇండియా ఫ్లైట్. లాహోర్ ATC వార్నింగ్‌తో యూటర్న్. అమృత్‌సర్‌లో సేఫ్ ల్యాండింగ్, ప్రయాణికులు సురక్షితం.

భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో మంగళవారం రాత్రి ఒక ఊహించని పరిణామం తీవ్ర కలకలం రేపింది. దిల్లీ నుంచి అమృత్‌సర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI-479 పొరపాటున పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. జూన్ 23 మంగళవారం రాత్రి ల్యాండింగ్ ఆ సమయంలో నావిగేషన్ సిస్టమ్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్లే ఈ భారీ పొరపాటు జరిగినట్లు సమాచారం అందుతోంది. విమానం బార్డర్ దాటి దాదాపు ఒక మైలు లేదా అంతకంటే తక్కువ దూరమే పాక్ వైపునకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిణామంతో పాకిస్థాన్‌లోని లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెంటనే అలర్ట్ అయి భారత విమానానికి షాకింగ్ వార్నింగ్ ఇచ్చింది. పాక్ ఏటీసీ నుంచి హెచ్చరికలు రావడంతో అప్రమత్తమైన ఎయిర్ ఇండియా పైలట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని యూటర్న్ తిప్పాడు. దీంతో విమానం తిరిగి అత్యంత వేగంగా భారత్ వైపునకు సురక్షితంగా ప్రవేశించింది. నావిగేషన్ వ్యవస్థలో ఒక్కసారిగా తలెత్తిన టెక్నికల్ స్నాగ్ కారణంగానే పైలట్లకు రూట్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏర్పడిందని ప్రాథమికంగా తెలిసింది. ఈ హైటెన్షన్ డ్రామా ముగిసిన తర్వాత కూడా ఎయిర్ ఇండియా విమానానికి ఇబ్బందులు తప్పలేదు. అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో విపరీతమైన రద్దీ ఉండటంతో ఆ సమయంలో విమానం ల్యాండింగ్ కావడానికి వీలు పడలేదు. ఫలితంగా పైలట్లు విమానాన్ని తిరిగి దిల్లీకి డైవర్ట్ చేయాల్సి వచ్చింది. ఈ అనివార్య కారణాల వల్ల విమానం దిల్లీకి చేరుకుని, ఆ తర్వాత బుధవారం తెల్లవారుజామున మళ్లీ బయలుదేరి అమృత్‌సర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఉత్కంఠభరిత ఘటనతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయినప్పటికీ చివరికి విమానం క్షేమంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్ సిబ్బందితో పాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ తీవ్రమైన నావిగేషన్ లోపంపై ఎయిర్ ఇండియా యాజమాన్యం ఇప్పటికే ఉన్నత స్థాయి అంతర్గత విచారణకు ఆదేశించింది. సాంకేతిక లోపం ఎలా తలెత్తిందనే కోణంలో అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు ఇరు దేశాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ పొరపాటు జరగడం రక్షణ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి సెన్సిటివ్ టైమ్‌లో విమానం బార్డర్ దాటడంపై ఇరు వైపులా తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై పాకిస్థాన్ ప్రభుత్వం లేదా వారి రక్షణ శాఖ వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. లాహోర్ ఏటీసీ కేవలం వార్నింగ్ ఇవ్వడం, పైలట్ వెనక్కి వచ్చేయడంతో ప్రస్తుతానికి ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని సాంకేతిక వివరాలు ఎయిర్ ఇండియా అంతర్గత విచారణ పూర్తయిన తర్వాతే అధికారికంగా వెల్లడి కానున్నాయి.
By Chandrasekhar B — 24 June 2026